Bengaluru: బెంగళూరులోని ప్రముఖ ఔషధ సంస్థ బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం విషాదకర ఘటన చోటుచేసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 26 ఏళ్ల యువ ఉద్యోగి కుమార్ కార్యాలయ భవనం ఐదో అంతస్తు నుంచి కింద పడిపోయి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
న్యూస్ ఏజెన్సీ PTI సమాచారం ప్రకారం, సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో కుమార్ తన మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ కంపెనీ కాంటీన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఐదో అంతస్తులోని కాఫెటీరియా టెర్రస్‌కు వెళ్లిన అతడు అక్కడి నుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతడిని మృతుడిగా ప్రకటించారు.
ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించామని, ఘటనకు గల కారణాలపై ఇంకా స్పష్టత లేదని తెలిపారు. ఈ ఘటనపై పరప్పన అగ్రహారా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
మీడియా కథనం ప్రకారం, కుమార్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కాగా, గత ఆరు నెలలుగా బయోకాన్‌లోని ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతడి తండ్రి శ్రీనాథ్ ఆలయ పూజారిగా పని చేస్తున్నారని సమాచారం. ఘటనకు ముందు కుమార్ కంపెనీ కాంటీన్‌లో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
పోలీసులు ఈ ఘటనలో అతడు స్వయంగా దూకాడా లేక ప్రమాదవశాత్తు పడిపోయాడా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటన సమయంలో అక్కడ ఉన్న ఉద్యోగులను ప్రశ్నించడంతో పాటు, సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు.
Also Read: SP Sudhir Ramnath Kekan: గట్టమ్మ ఆలయం వద్ద నూతన పార్కింగ్ ఏర్పాటు: ఎస్పీ శ్రీ సుధీర్ రామనాథ్ కేకన్
ఈ ఘటనపై బయోకాన్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. “మా బెంగళూరు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఈ కష్ట సమయంలో అతడి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. విషయం దర్యాప్తులో ఉన్నందున ప్రస్తుతం మరిన్ని వివరాలు వెల్లడించలేము,” అని సంస్థ పేర్కొంది. ఈ విషాద ఘటన సంస్థలోని ఉద్యోగుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది

