Big Shock to USA: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో భారత్ దిగుమతులపై సుంకాలను ఏకంగా 50 శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా ట్రంప్ సర్కార్‌కు బుద్ధి చెప్పే లక్ష్యంతో (Big Shock to USA) కేంద్ర ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా, అమెరికా నుంచి ఆయుధాలు, విమానాల కొనుగోలుకు సంబంధించిన ప్రణాళికలను నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. తద్వారా భారత వైఖరిని మరింత బలంగా వినిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ యోచిస్తోందని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న ముగ్గురు భారత అధికారులు వెల్లడించారు.
భారత దిగుమతులపై సుంకాలను ఏకంగా 50 శాతానికి పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడంతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు గత కొన్ని దశాబ్దాల కాలంలోనే కనిష్ఠ స్థాయికి దిగజారాయి. భారత ఉత్పత్తులపై అసంబద్ధ రీతిలో టారిఫ్‌లు విధించడంపై భారత్ తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఈ తాజా పరిణామం తెరపైకి వచ్చింది.
రక్షణ మంత్రి పర్యటన రద్దు!
నిజానికి, రక్షణ రంగ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాల కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, కీలకమైన ఈ పర్యటనను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఇద్దరు ఉన్నతాధికారులు చెప్పారు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయడంపై అసంతృప్తిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 6న కీలక ప్రకటన చేశారు. భారతీయ వస్తు ఎగుమతులపై అదనంగా 25 శాతం టారిఫ్ విధించారు. దీంతో, భారత దిగుమతులపై మొత్తం టారిఫ్ 50 శాతానికి పెరిగింది. వ్యాపార భాగస్వాములపై అమెరికా విధిస్తున్న అత్యధిక సుంకం ఇదే కావడం గమనార్హం. రష్యా నుంచి చమురు కొనుగోలు ద్వారా ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాను ప్రోత్సహిస్తున్నట్టేనని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడుడుతున్నారు.
Read Also- Income Tax Bill: కేంద్రం అనూహ్య నిర్ణయం.. ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు-2025 ఉపసంహరణ
భారత్-అమెరికా మధ్య టారిఫ్‌లు, ద్వైపాక్షిక సంబంధాల విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత రక్షణ కొనుగోళ్ల అంశం ముందుకెళ్లే అవకాశం ఉందని, అయితే, ఇవన్నీ అనుకున్నంత వేగంగా జరగబోవని ఓ అధికారి పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు టారిఫ్‌ల విషయంలో అభిప్రాయాలు మార్చుకున్న చరిత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. నిజానికి టారిఫ్‌ల అంశంపై అమెరికాతో సంప్రదింపులు కొనసాగుతున్నట్టుగా భారత్ పేర్కొంది. కానీ, తాజా పరిణామాలు గమనిస్తే, అమెరికా చర్యలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
మరో అధికారి స్పందిస్తూ.. అమెరికా నుంచి ఆయుధాలు, విమానాల కొనుగోలుకు సంబంధించిన ప్రణాళికలను నిలిపివేయాలంటూ లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు అందలేదని చెప్పారు. ఈ దిశగా కనీసం ఒక్క అడుగు కూడా పడలేదని చెప్పారు. అయితే, భారత్ వద్ద కూడా ఆప్షన్లు ఉంటాయనే సంకేతాలు ఇచ్చినట్టు అయిందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇటు భారత రక్షణశాఖ, అటు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం అధికారికంగా స్పందించలేదు.
Read Also- India Russia Oil: రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తే.. భారత్‌కు జరిగే నష్టం ఎంతో తెలుసా?
భారత్ ఇప్పటివరకు అమెరికాతో బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మెరుగుపరచుకుంటూ వచ్చింది. కానీ, తాజా టారిఫ్ చర్యల పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిగా ఉంది. అన్యాయంగా భారత్‌ను టార్గెట్ చేశారంటూ ఇప్పటికే స్పష్టం చేసింది. అమెరికా, యూరోపియన్ దేశాలు తమ అవసరాల మేరకు ఇప్పటికీ రష్యాతో వాణిజ్య బంధాలను కొనసాగిస్తున్నాయని, తాము మాత్రం ఎందుకు ముడి చమురు కొనుగోలు చేయడకూదని ప్రశ్నించింది.
కాగా, జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్ తయారు చేసే స్ట్రైకర్ యుద్ధ విమానాలు, రేథియోన్-లాక్‌హీడ్ మార్టిన్ సంయుక్త అభివృద్ధి చేసే జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైళ్లు, దాదాపు 3.6 బిలియన్ డాలర్ల విలువైన బోయింగ్పీ-8I నౌకా గూఢచార విమానాల (6 యూనిట్లు) ఒప్పందాలు పురోగతి దశలో ఉన్నాయని ఓ అధికారి వెల్లడించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఒప్పందాన్ని అమెరికా పర్యటనలో ప్రకటించాలని భావించారు. ఇప్పుడు ఆ పర్యటన రద్దు అయినట్టు తెలుస్తోంది.