Airfare Cap: విమాన టికెట్ ధరలపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
Ram-Mohan-Naidu (Image source Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Airfare Cap: విమాన టికెట్ ధరలపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

Airfare Rates: ఇండిగో సంక్షోభం (Indigo) నేపథ్యంలో దేశంలో విమాన టికెట్ రేట్లపై కేంద్ర ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో హవాయ్ చెప్పుల నుంచి హవాయి జహజ్ (విమానం) వరకు అన్నింటినీ సామాన్యులకు దరిచేర్చారని, కానీ విమాన టికెట్ రేట్లు మాత్రం తగ్గించడం సాధ్యంకాదని వెల్లడించారు. దేశవ్యాప్తంగా విమాన ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని లోక్‌సభలో ప్రకటించారు. విమానయాన రంగాన్ని నియంత్రించకుండా ఉంటేనే అంతిమంగా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు. పండుగల సమయంలో టిక్కెట్ ధరలు పెరగడం సర్వసాధారణమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

ప్రత్యేక సమయాల్లో పెరుగుదల

పండుగల సీజన్‌, లేదా ప్రత్యేక సమయాల్లో కొన్ని రూట్లలో డిమాండ్ పెరగడంతో ఛార్జీలు పెరుగుతాయని మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు. ఈ రేట్లలో పెరుగుదల, తగ్గుదల కాలానికి అనుగుణంగా ఉంటాయి కాబట్టి, ఏడాది పొడవునా ఛార్జీలు ఒకే విధంగా ఉంచడం, పరిమితం చేయడం సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చారు. మార్కెట్ డిమాండ్, సప్లైల ఆధారంగానే రేట్లు నియంత్రణ అవుతుందని చెప్పారు. విమాన టికెట్ రేట్లను నియంత్రించకపోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడమేనని అన్నారు. విమానరంగం అసాధారణ వృద్ధి సాధించిన అన్ని దేశాలలో కూడా నియంత్రణ లేని మార్కెట్‌లే ఉన్నాయని, మరిన్ని సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టడానికి దోహదపడుతుందని రామ్మోహన్ నాయుడు వివరించారు. నియంత్రణ లేమి ప్యాసింజర్లకే ఎక్కువ ప్రయోజనాన్ని చేకూర్చుతుందన్నారు.

Read Also- C5 Alliance: ట్రంప్ మనసులో ‘సీ-5’!.. భారత్‌ను కలుపుకొని శక్తివంతమైన కూటమి ఏర్పాటుకు ప్రతిపాదన!

కంపెనీలకు సంపూర్ణ స్వేచ్ఛ లేదు

ఏవియేషన్ మార్కెట్‌పై ప్రభుత్వ నియంత్రించకపోయినా, విమానరంగ కంపెనీలకు సంపూర్ణ స్వేచ్ఛ లేదని మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. అసాధారణ పరిస్థితుల్లో టికెట్ ధరలను పెంచి, దుర్వినియోగం పాల్పడే అవకాశం ఉన్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఆయన చెప్పారు. ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం ద్వారా ఛార్జీలపై పరిమితి విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని మంత్రి చెప్పారు. కేంద్రం జోక్యం చేసుకున్న పలు సందర్భాలను ఆయన గుర్తుచేశారు. ఇటీవలి ఇండిగో సంక్షోభం, కోవిడ్ సంక్షోభం, మహా కుంభమేళా, పహల్గామ్ ఉగ్రదాడి వంటి అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో కేంద్రం తన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ధరల పెరుగుదలను నియంత్రించిందని మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రస్తావించారు.

Read Also- Akhanda 2 Producers: బయటెక్కడా నెగిటివ్ లేదు.. ఇండస్ట్రీలో మాత్రమే నెగిటివిటీ.. ప్రస్తుతం మిక్స్‌డ్ రిపోర్ట్స్ వస్తున్నాయ్

ధరలను నియంత్రించడం ఒక్కటే పరిష్కారం కాదన్న మంత్రి.. విమానయాన మార్గాలు, ఎయిర్‌పోర్ట్‌లు, ఆపరేషన్ నెట్‌వర్క్ వంటి మొత్తం ఏవియేషన్ వ్యవస్థ దీర్ఘకాలిక మనుగడను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని వివరించారు. ద్రవ్యోల్బణం పరంగా చూస్తే దేశంలో విమాన ఛార్జీలు సంవత్సరాల వారీగా తగ్గాయని, సామాన్య ప్రజలకు సైతం టికెట్ రేట్లు అందుబాటులో ఉన్నాయని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలలో విమాన ఛార్జీల పెరుగుదలతో పోలిస్తే, మన దేశంలో టికెట్ రేట్ల పెరుగుదల వాస్తవానికి భిన్నంగా ఉందన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం పరంగా చూస్తే, విమాన టికెట్ రేట్లు 43 శాతం తగ్గాయన్నారు. అమెరికాలో ఈ తగ్గుదల 23 శాతంగా, చైనాలో 34 శాతంగా ఉంది, కానీ భారతదేశంలో అత్యధికంగా 43 శాతం నమోదైందని లోక్‌సభకు ఆయన వివరించారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?