Army Officer
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Army officer: ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ సిబ్బందిని చితక్కొట్టిన ఆర్మీ ఆఫీసర్.. కారణం ఇదే

Army officer: శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. క్యాబిన్ లగేజీ పరిమితికి మించి ఉండడంతో అదనపు ఛార్జీలు చెల్లించాలని కోరిన స్పైస్‌జెట్ విమాన సిబ్బందిపై ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ సీనియర్ అధికారి (Army officer) అత్యంత దారుణంగా దాడి చేశారు. చార్జీలు చెల్లించేందుకు నిరాకరించిన ఆయన ఈ ఘర్షణకు దిగారు. ఈ షాకింగ్ ఘటన జులై 26న శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో జరిగింది. నిందిత అధికారి ఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కాల్సి ఉందని, అతడు తీసుకొచ్చిన రెండు బ్యాగుల బరువు కలిపి మొత్తం 16 కేజీలు ఉందని స్పైస్‌జెట్ వెల్లడించింది. కాగా, దేశీయ మార్గాలలో ప్రయాణించే విమానాలలో 7 కేజీలకు మించిన లగేజీకి అదనపు చార్జీలు వర్తిస్తాయని, ఇదే విషయం అధికారికి వివరించాక ఊహకందని దాడి జరిగిందని తెలిపింది.

ఆర్మీ అధికారి జరిపిన దాడిలో స్పైస్‌జెట్‌కు చెందిన నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరికి స్పైనల్ ఫ్రాక్చర్ అయ్యింది. మరొకరి ముఖానికి తీవ్ర గాయం అయ్యింది. దవడ విరిగిపోయినట్టు తెలుస్తోంది. దీంతో, ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఈ దాడిలో తమ సిబ్బందికి తీవ్రమైన గాయాలు అయ్యాయని, సిబ్బందిపై పంచ్‌లు, క్యూ స్టాండ్‌ దాడి చేశారని తెలిపింది. ఒకరికి తీవ్రమైన దెబ్బ తగలడంతో నేలపై అపస్మారక స్థితిలో కుప్పకూలారని, అయినా, ఆ ప్యాసింజర్ ఆగకుండా అతడిపై పిడిగుద్దుల వర్షాన్ని కొనసాగించాడని తెలిపింది. కిందపడిపోయిన సహోద్యోగికి సాయం చేసేందుకు వంగిన మరో సిబ్బంది దవడపై బలంగా కొట్టాడని, ముక్కు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావం కూడా జరిగిందని స్పైస్‌జెట్ వివరించింది. గాయపడిన వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారంతా తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతున్నారని వివరించింది.

Read Also- Siraj: బుమ్రా లేనప్పుడు బాగా రాణిస్తావెందుకు?.. సిరాజ్ సమాధానం ఇదే

అసలేం జరిగిందంటే..
ఆర్మీ అధికారి దాడి ఘటనపై స్పైస్‌జెట్ పలు వివరాలు వెల్లడించింది. ‘‘పరిమితికి మించిన లగేజీపై చెల్లించాల్సిన ఛార్జీల విషయాన్ని మర్యాదపూర్వకంగా తెలియజేశాం. వర్తించే చార్జీలు చెల్లించాలని సిబ్బంది అభ్యర్థించినా ప్యాసింజర్ (ఆర్మీ అధికారి) నిరాకరించారు. బోర్డింగ్ ప్రక్రియ పూర్తి కాకుండానే బలవంతంగా ఎయిరోబ్రిడ్జ్‌లోకి ప్రవేశించారు. ఈ చర్య విమానయాన భద్రతా నిబంధనలకు స్పష్టమైన ఉల్లంఘన. దీంతో, వెంటనే సమాచారం అందుకున్న సీఐఎస్ఎఫ్ అధికారులు ఆయనను గేటు వద్దకు తిరిగి తీసుకొచ్చారు’’ అని స్పైస్‌జెట్ వివరించింది. అయితే, అక్కడే పరిస్థితి అదుపు తప్పింది. గేటు వద్దకు తీసుకెళ్లడంతో ఆ అధికారి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. స్పైస్‌జెట్ గ్రౌండ్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.

Read Also- CM Revanth Reddy: మోడీని కుర్చీ దించేయడం ఆయనకు మాత్రమే సాధ్యం

ఈ ఘటనకు సంబంధించి బయటకొచ్చిన వీడియోలు షాకింగ్‌గా అనిపిస్తున్నాయి. ఆర్మీ అధికారి చెక్-ఇన్ కౌంటర్ వద్ద ఉపయోగించే ఒక ఇన్ఫర్మేషన్ బోర్డుతో సిబ్బందిని కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆయనను నియంత్రించే ప్రయత్నం చేసినప్పటికీ, మాట వినలేదు. ఎయిర్‌లైన్ సిబ్బందిపై తీవ్ర అభ్యంతరకర పదజాలంతో దూషిస్తూ, పదేపదే దాడికి ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై స్పందించిన విమానాశ్రయ భద్రతా అధికారులు, సీఐఎస్ఎఫ్ పూర్తిస్థాయిలో విచారణ మొదలుపెట్టినట్టు చెప్పారు. ఈ ఘటనపై ఆర్మీ సంబంధిత అధికారులు కూడా స్పందించే అవకాశం ఉంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. అధికార వర్గాలు ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. విమానశ్రయ భద్రతా ప్రమాణాలను ప్రశ్నార్థం చేసేలా ఉన్న పరిణామంపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సదరు అధికారిని నో-ఫ్లై లిస్ట్‌లో చేర్చే ప్రక్రియ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?