Amit Shah: విద్యా విధానంలో కేంద్రం సూచించిన త్రిభాషా విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ సీఎం ఎంకే స్టాలిన్ (CM MK Stalin) పై ప్రతీ రోజూ విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలోని కేంద్ర కార్యాలయాల పేర్లు తమిళ భాషలోనే పెట్టాలని ఇటీవల కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అటు డీఎంకే నేతలు సైతం హిందీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ బీజేపీ చర్యలను ఎండగడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తమిళనాడులో పర్యటించిన హోం మంత్రి అమిత్ షా.. సీఎం స్టాలిన్ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం తమిళనాడులోని అరక్కొణం జిల్లాలో పర్యటించారు. రాణిపేట్ లోని సీఐఎస్ఎఫ్ 56వ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన అమిత్ షా.. గత కొన్ని రోజులుగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్న సీఎం స్టాలిన్ పై విరుచుకుపడ్డారు. ఎల్‌కేజీ స్టూడెంట్.. పీహెచ్‌డీ హోల్డర్‌కు బోధించినట్లుగా సీఎం మాటలు ఉన్నాయని మండిపడ్డారు. తమిళ భాష కోసం ముఖ్యమంత్రిగా స్టాలిన్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ప్రాంతీయ భాషలకు అనుగుణంగా కీలక మార్పులు చేసింది ప్రధాని మోదీయేనని అమిత్ షా స్పష్టం చేశారు.
Also Read: China: ట్రంప్ తో వాణిజ్య యుద్ధం.. భారత్ తో కాళ్లబేరానికి వచ్చిన చైనా!
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో జాతీయ భాషకు తప్ప గతంలో మాతృభాషకు చోటులేదని హోంమంత్రి అమిత్ షా గుర్తుచేశారు. అలాంటిది ప్రధాని మోదీ చొరవతో CAPF రిక్రూట్ మెంట్ పరీక్షలను తమిళం సహా 8 భాషల్లో నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. మరోవైపు రాష్ట్రంలో వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల పాఠ్యాంశాలను తమిళ భాషలో ప్రవేశపెట్టాలని గత రెండేళ్లుగా సీఎం స్టాలిన్ కు కేంద్రం విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదని షా ప్రశ్నించారు. తమిళ భాషపై అంత ప్రేమ ఉంటే జాప్యం ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. త్వరలోనే ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటారని ఆశీస్తున్నట్లు చెప్పారు.
జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు సీఎం స్టాలిన్ తాజాగా మరోమారు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఎప్పటికీ గెలవలేని యుద్ధాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మెుదలుపెట్టారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఢిల్లీ ఆదేశాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయమని స్పష్టం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్నే ప్రధాన అజెండాగా చేసుకొని బీజేపీ బరిలోకి దిగాలని ఆయన సవాలు విసిరారు. పథకాలు, కేంద్రం ఇచ్చే అవార్డులు అన్నింటికి హిందీ పేర్లే పెట్టారన్న స్టాలిన్.. ఇది హిందీయేతర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు చెప్పారు.