Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను భారత సేనలు నేలమట్టం చేయడం, ఆ తర్వాత పాక్ బలగాలు ప్రతిఘటించడంతో ఇరుదేశాల మధ్య తీవ్ర సైనిక ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో చోటుచేసుకున్న ఈ సైనిక సంఘర్షణలో పాకిస్థాన్‌కు చెందిన 6 విమానాలను కూల్చివేశామని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తొలిసారి ప్రకటించారు. ఇందులో 5 యుద్ధ విమానాలు, ఒక భారీ విమానం ఉందని ఆయన తెలిపారు. పాకిస్థానీ విమానాలు గాలిలో ఉండగానే కూల్చివేశామని ఆయన తెలిపారు.
కూల్చివేసిన ఆ పెద్ద విమానం పేరు ‘ఏఈడబ్ల్యూసీ’ (ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్) అని, 300 కిలోమీటర్ల దూరంలో ఉండగా లక్ష్యం తప్పకుండా పేల్చివేశామన్నారు. ఈ విమానాన్ని కూల్చివేయడంతో పాకిస్థాన్ వైమానిక దళానికి పెద్ద ఎదురుదెబ్బగా మారిందని పేర్కొన్నారు. ఈ విమానంలో భారీ లోడ్‌లు ఉండే అవకాశం ఉందని, అందుకే కూల్చివేశామని పేర్కొన్నారు. అంతేకాదు, వైమానిక స్థావరాలపై జరిపిన బాంబు దాడుల్లోనూ పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌కు తీవ్ర నష్టం జరిగిందని అమర్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.
Read also- NIACL 2025: NIACL అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్.. అస్సలు మిస్ చేసుకోకండి..
‘‘పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన 5 విమానాలను కూల్చివేసినట్టుగా నిర్ధారణమైంది. కూల్చివేసిన పెద్ద విమానం ఈఎల్‌ఐఎంటీ లేదా ఏఈడబ్ల్యూ&సీ.. ఈ రెండింట్లో ఒకటి కావొచ్చు. ఇది 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే మేము టార్గెట్ పూర్తి చేశాం. ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద ఉపరితలం నుంచి గగనతల టార్గెట్‌గా అని చెప్పవచ్చు’’ అని అమర్ ప్రీత్ సింగ్ వివరించారు. బెంగళూరు నగరంలో శనివారం జరిగిన ‘16వ వార్షిక ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం కాత్రే లెక్చర్’లో కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రష్యా తయారు చేసిన ఎస్-400 యాంటీ మిసైల్ వ్యవస్థ (సర్‌ఫేస్ టూ ఎయిర్‌మిసైల్) ఒక ‘గేమ్ చేంజర్’గా ఆయన అభివర్ణించారు. పాకిస్థాన్ ఇప్పటికీ ఎస్-400 యాంటి మిసైల్ వ్యవస్థను దాటి భారత్‌లోకి ప్రవేశించలేకపోతుందని ఆయన వెల్లడించారు. ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో మన వాయు రక్షణ వ్యవస్థలు అద్భుతంగా పని చేశాయి. ఇటీవలే కొనుగోలు చేసిన ఎస్-400 యాంటి మిసైల్ వ్యవస్థ నిజంగా ఒక గేమ్‌చేంజర్‌గా మారింది. ఆ వ్యవస్థకు ఉన్న విస్తృత శక్తిసామర్థ్యాల కారణంగా, పాకిస్థాన్ యుద్ధ విమానాలు తమ లాంగ్-రేంజ్ గ్లైడ్ వంటి బాంబులను ఉపయోగించలేకపోయాయి. ఎస్-400 వ్యవస్థను దాటిరాగల శక్తిసామర్థ్యాలు పాకిస్థాన్ వద్ద లేవు. అందుకే, పాక్ లాంగ్-రేంజ్ గ్లైడ్ బాంబులను ఉపయోగించలేకపోయింది’’ అని అమర్ ప్రీత్ సింగ్ వివరించారు.
Read Also- Swetcha Effect: స్వేచ్ఛలో ప్రచురితమైన చాలాన్ల దోపిడి కథనం వైరల్
పాకిస్థాన్‌లోని జెకోబాబాద్, భోలారి ప్రాంతాల్లోని హ్యాంగర్‌లను కూడా భారత వాయుసేన ధ్వంసం చేసిందని చెప్పారు. అందులో కొన్ని బహుశా అమెరికా తయారు చేసిన ఎఫ్-16లు కావొచ్చని చెప్పారు. మెయింటెన్స్‌లో భాగంగా హ్యాంగర్లలో ఉంచారేమోనని, భారత వాయుసేన దాడుల్లో అవి ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. భోలారిలోనే మరో ఏడబ్ల్యూఏసీఎస్ విమానం కూడా ధ్వంసమై ఉండొచ్చని భావిస్తున్నట్టు ప్రీతమ్ సింగ్ తెలిపారు.
భారత సేనలు జరిగిపిన దాడులతో పాకిస్థాన్‌కు గణనీయమైన నష్టం వాటిల్లిందని, ఇరుదేశాల మధ్య పోరు కొనసాగి ఉండే నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుందని పాక్ గ్రహించిందని, అందుకే పాకిస్థాన్ కాల్పుల విరమణ (ceasefire) కోరిందని ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రీతమ్ సింగ్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య యుద్ధ పరిస్థితులు మే 10న సద్దుమణిగాయని వివరించారు. పాక్‌పై దాడుల ప్రణాళిక, అమలు చేయడంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన, దేశ రాజకీయ నాయకత్వాన్ని కూడా ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ ప్రశంసించారు.
‘‘మాకు చాలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ఎలాంటి పరిమితులు విధించలేదు. ఏమైనా అడ్డంకులు ఉంటే, అవి మా కారణంగానే. ఎన్ని స్థాయిల్లో దాడులు చేయాలో మేమే నిర్ణయించుకున్నాం. ప్రణాళిక రూపొందించడం నుంచి దాడులు అమలు వరకు మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అర్థవంతంగా వ్యవహరించాలని మేము భావించి, దాడుల నిర్దిష్టంగా, కచ్చితత్వంతో చేశాం’’ ఏపీ సింగ్ చెప్పారు. మే 7న దాడి మొదలుపెట్టడానికి ముందు తీసిన ఉగ్ర స్థావరాలు, ఆ తర్వాత ఉపగ్రహ చిత్రాలను కూడా ఆయన షేర్ చేశారు. ‘‘మన వద్ద ఉపగ్రహ చిత్రాలు మాత్రమే కాదు. స్థానిక మీడియా ద్వారా కూడా కొన్ని అంతర్గత ఫొటోలు అందాయి’’ అని ఎయిర్ చీఫ్ తెలిపారు.