Jharkhand: జార్ఖండ్ లోని పలామూ జిల్లాకు చెందిన కొందరు మహిళలు అద్భుతం చేసి చూపించారు. పిచ్చులియా గ్రామానికి స్వయంగా రోడ్డు మార్గాన్ని నిర్మించారు. మెుత్తం 25 మంది మహిళలు పలుగు, పారా పట్టుకొని.. వాహనాలు తిరిగే సామర్థ్యం గల రహదారిని నిర్మించడం విశేషం. ఈ రోడ్డును దసరా కానుకగా ఊరి ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఆ మహిళలు ప్రకటించారు. రోడ్డు నిర్మాణం కోసం తమ సొంత నిధులను ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే?
జార్ఖండ్ లోని పలామూ జిల్లా పిచ్చులియా గ్రామానికి గత కొంతకాలంగా సరైన రోడ్డు లేదు. కొత్త రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు పలు మార్లు అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నారు. కానీ వారి నుంచి స్పందన రాలేదు. దీంతో విసుగుచెందిన 25 మంది స్వయం సహాయక సంఘం మహిళలు.. స్వయంగా ఊరికి రోడ్డు నిర్మించాలని సంకల్పించారు. దసరా కల్లా దానిని పూర్తి చేయాలని గత నెలలోనే సంకల్పించారు. ఇందుకు అనుగుణంగా పలుగు, పార, ప్లాస్టిక్ టబ్బులు పట్టుకొని పనిలోకి దిగారు. అలా వారం రోజుల పాటు కష్టించి మట్టితో రోడ్డును నిర్మించారు. సెప్టెంబర్ 28 నాటికి రోడ్డును పూర్తి చేశారు. దసరాకు నాలుగు రోజుల ముందే రోడ్డును పూర్తి చేయడం విశేషం.
రోడ్డు కోసం రూ. 70,000 ఖర్చు
రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.70 వేలు ఖర్చు అయినట్లు మహిళలు తెలిపారు. స్త్రీలకు ప్రభుత్వం అందిస్తున్న ‘మయ్యా సన్మాన్ యోజన’ డబ్బును ఈ రోడ్డు కోసం ఖర్చు చేసినట్లు చెప్పారు. ఒక్కో మహిళ తమకు వచ్చిన రూ. 2,500 లను రోడ్డు నిర్మాణానికి కేటాయించారని తెలిపారు. దసరా కానుకగా ఊరికి రోడ్డు ఇవ్వడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తమ కష్టాన్ని గుర్తించి.. ఊరికి శాశ్వత రోడ్డును ప్రభుత్వం నిర్మిస్తే తమ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుందని తెలియజేస్తున్నారు.
Also Read: Kisan Vikas Patra Scheme: రూ.10 లక్షలు పెడితే.. రూ.20 లక్షల రిటర్న్స్.. కళ్లు చెదిరే ప్రభుత్వ స్కీమ్!
రోడ్డులేక ఇబ్బందులు
రోడ్డు లేకపోవడంతో అంతకుముందు వరకూ పిచ్చులియా (Pichhulia village) గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డు లేకపోవడంతో సకాలంలో వైద్యం కూడా అందేది కాదని వాపోయారు. కొందరైతే పెళ్లిళ్ల విషయంలోనూ సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. బసంతి దేవి అనే మహిళ మాట్లాడుతూ.. తన భర్త బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడ్డాడని తెలిపారు. ఓ రోజు అతడికి సీరియస్ కావడంతో సకాలంలో అంబులెన్స్ రాలేకపోయిందని చెప్పారు. దీంతో తన భర్త ప్రాణాలు కోల్పోయినట్లు అన్నారు. మరో మహిళ మమతా మాట్లాడుతూ.. తాను గర్భం దాల్చినప్పుడు ఆస్పత్రికి వెళ్లడానికి ఎన్నో కష్టాలు పడినట్లు చెప్పారు. మెుత్తం మీద తోటి మహిళల సాయంతో తమకు రోడ్డు వచ్చిందని.. తమ సమస్యలు కొంతమేర తీరాయని సంతోషం వ్యక్తం చేశారు.
