Telangana Touch Politics: పొద్దున లేస్తే చాలు.. ఏ పేపర్ చూసినా, ఏ మీడియాలోనైనా రాజకీయ పార్టీల మాటలు చూస్తుంటే మతిపోతోంది. ఈ లోక్‌సభ ఎన్నికల ఎన్నికల వేళ నాయకుల వ్యాఖ్యలు జనాలను మరింత గందరగోళపరుస్తున్నాయి. ఎన్నికల సమయంలో విమర్శలు, ప్రతి విమర్శలూ కామనే. కానీ, ఈసారి విమర్శల కంటే ‘టచ్ పాలిటిక్స్’ చుట్టూనే రాజకీయమంతా తిరుగుతోంది. తమకు గులాబీ నేతలు టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్, 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాకు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ అనటం, ఈ రెండు పార్టీల వాళ్లూ మా పార్టీలో చేరబోతున్నారని బీజేపీ ఫీలర్లు వదులుతున్నాయి. తద్వారా ఎన్నికల వేళ జనాలను తమవైపు ఆకర్షించేందుకు, ఎదుటి పార్టీల్లో గందరగోళం సృష్టించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా అభివృద్ధి, ప్రజా సమస్యల గురించి గానీ చర్చకు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. అయితే ప్రజలు వీటన్నింటినీ గమనిస్తూనే, ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే దానిపై ఓ క్లారిటీకి వచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
ఇక హామీల విషయానికొస్తే, కాంగ్రెస్ తుక్కుగూడ సభా వేదిక మీది నుంచి తన మ్యానిఫెస్టోను ప్రకటించింది. అటు బీజేపీ సైతం తన హామీలను మ్యానిఫెస్టోగా తీసుకొచ్చింది. అయితే, పదేళ్ల మోదీ పాలనలో నెరవేరిన హామీల సంగతేంటని కాంగ్రెస్ నేతలు నిలదీశారు. అయితే, దీనికి బీజేపీ నేతలు స్పందించిన తీరు అప్రజాస్వామికంగా ఉందనే చెప్పాలి. ‘మా పార్టీ మ్యానిఫెస్టోను విమర్శించే హక్కు కాంగ్రెస్‌కు లేనేలేదు’ అని వారు అనటంలో తమనెవరూ ప్రశ్నించకూడదనే ధోరణి కనిపిస్తోంది. నిజంగానే తమను ఎవరూ ప్రశ్నించకూడదని బీజేపీ నేతలు అనటం న్యాయమే అయితే, ఆ మ్యానిఫెస్టోను తిరస్కరించే హక్కు కూడా ప్రజలకు ఉందని ఆ పార్టీ నేతలు గమనించాలి. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నో హామీలిచ్చినా, వాటిలో నెరవేరింది కొన్ని మాత్రమే. కానీ, అధికారం పోగానే ఆ పార్టీ, మూడు నెలల నాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని హామీల మీద నిలదీస్తోంది. దీనికి బీజేపీ కూడా గళం కలుపుతోంది. ఈ రెండు పార్టీల జాణతనాన్ని కూడా ప్రజలు మౌనంగా గమనిస్తూనే ఉన్నారు.
Also Read:మరకలే తప్ప మెరుపులేవీ?
గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చింది. తెలంగాణ విభజన హామీల మొదలు అనేక ఇతర పెండింగ్ సమస్యల మీద ఎన్నికల వేళ బీజేపీ మ్యానిఫెస్టో వాగ్దానం చేసిన అనేక అంశాలను అమలు చేయటంలో ఆ పార్టీ విఫలమైంది. దీనికి తోడు తెలంగాణ నుంచి గెలిచిన నలుగురు లోక్‌సభ సభ్యులు కూడా కేంద్ర పెద్దల మాటలనే వల్లెవేశారు తప్ప మా రాష్ట్రానికి న్యాయం చేయండని గట్టిగా అడగలేకపోయారు. ఇక.. ధాన్యం కొనుగోలు, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, నవోదయ స్కూళ్లు, మెడికల్ కాలేజీల అంశం వంటి అనేక అంశాల మీద కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మీద ఒంటికాలు మీద లేచారు. ఈ ఘర్షణ వారిద్దరినీ వైరి పక్షాలుగా మార్చేసిందన్న భ్రమ కలిగించారు. ప్రజల సమస్యల కోసమే ఈ ఘర్షణ అన్నట్లు బీఆర్ఎస్ దీనిని చిత్రీకరించే ప్రయత్నం చేసినా, అసలు కారణాలు వేరే ఉన్నాయని త్వరలోనే తెలంగాణ ప్రజలు గ్రహించగలిగారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం, బీజేపీకి 8 సీట్లు దక్కటం, స్వయంగా కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి పాలవటం జరిగిపోయాయి. ఇంత ఘోరమైన రీతిలో ఓడినా, ఇటీవలి వర్షాభావ పరిస్థితుల మీద ఆ పార్టీ యువనేత మాట్లాడుతూ, ‘ మా పార్టీ ఓడటం వల్లే ఈ కరువు’ అంటూ మాట్లాడటం చూసి జనం నోరెళ్ల బెడుతున్నారు. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలన తాలూకూ చేదు జ్ఞాపకాలను మరోసారి నెమరు వేసుకుంటున్నారు.
మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా తెలంగాణ ఏర్పడటం, దానికి తొలి సీఎంగా కేసీఆర్ వచ్చిన నాటి నుంచి తెలంగాణలో ప్రజాస్వామ్యపు పరిధి తగ్గిపోతూ వచ్చింది. దళితుడికి ముఖ్యమంత్రి పదవి, ప్రాజెక్టుల నిర్మాణం, దళిత బంధు, పేదలకు ఇళ్లు.. ఇలా ఈ పదేళ్లలో చెప్పిన ప్రతిమాటలోనూ అంతులేని నాటకీయత కనిపించింది. దీనికి తోడు విపక్షాలను బలహీన పరచటం ద్వారానే తాను బలంగా ఉంటాననే రీతిలో ఆయన రాజకీయం సాగింది. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన యువతకు ఇస్తానన్న ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి దక్కకపోగా, పరీక్షా పత్రాల లీకేజీతో ఏళ్ల తరబడి మానసిక వేదనను యువత ఎదుర్కోవాల్సి వచ్చింది. రైతుబంధు పేరుతో పెద్దరైతులకూ డబ్బుసాయం చేయటం, గుట్టలకు, డొంకలకు, బీడు భూములకు డబ్బు రైతుబంధు అందించటం, రుణమాఫీని సాఫీగా అమలు చేయకపోవటం, సెంటు పొలం లేక కౌలు చేసుకుని బతుకున్న రైతులను పట్టించుకోకపోగా, ‘కౌలు రైతులను.. రైతులుగానే పరిగణించం’అని అవమానించటం, బీమా పథకం వేస్ట్ అంటూ దానికి మంగళం పాడటం, ధాన్యం కొనుగోలు వ్యవహారంలో సామరస్యంగా సమస్యను పరిష్కరించాల్సింది పోయి కేంద్రంతో కలహించటం రైతుల్లో అసంతృప్తికి దారితీసింది. దళిత బంధు పేరుతో ఎమ్మెల్యేలు ఏకంగా 3 లక్షలు కమిషన్‌గా వసూలు చేయటం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో జరిగిన తంతు, ప్రజలకు సీఎం అందుబాటులో లేకపోవటం, వేల కోట్లు పెట్టి సచివాలయం, అంబేద్కర్ విగ్రహాలు పెట్టటం, ఏనాడూ అఖిల పక్షం పెట్టి, ఇతర పార్టీల అభిప్రాయం కనుక్కోకపోవటం వంటి అప్రజాస్వామిక ధోరణులు జనాలకు బీఆర్ఎస్ మీద అసంతృప్తికి కారణాలుగా నిలిచాయి. ఇంత బాధ్యతారాహిత్యంతో పాలించిన పార్టీ నేడు మూడు నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించటం చూసి జనం నోరెళ్ల బెడుతున్నారు.
Also Read:ఇంద్రవెల్లి నెత్తుటి జ్ఞాపకానికి సరిగ్గా 43 ఏళ్లు
ఇక.. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు అనేక పథకాలు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని నాడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నెత్తీ నోరూ మొత్తుకున్నా, కేంద్రంలోని బీజేపీ ఏమీ పట్టనట్లు వ్యవహరించింది. ఆర్థిక పరిమితులను మరిచిపోయి, అడ్డగోలుగా బ్యాంకు రుణాలు తీసుకుంటున్న కేంద్ర ఆర్థిక శాఖ చోద్యం చూస్తూ ఉండిపోయింది. పైగా అనేక పర్యాయాలు చాలామంది కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి ఇక్కడి పథకాలు బాగున్నాయంటూ కితాబులిచ్చారు. అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో తమకు స్థానం దక్కదనే అనుమానంతో బీజేపీ నేతలే విమర్శలు అందుకోవటం మొదలుపెట్టారు. ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మొదలు పలువురు కేంద్రమంత్రులు కేసీఆర్ మీద గొంతు పెంచారే తప్ప ఏ రకమైన విచారణా చేయలేదు. ఒకరకంగా ఈ పదేళ్లలో తెలంగాణకు జరిగిన నష్టానికి బీఆర్ఎస్ ఎంత కారణమో, బీజేపీ కూడా అంతే కారణమని నేడు ప్రజలు భావిస్తున్నారు. అయితే, నాటి తన వైఖరిని చర్చకు రానీయకుండా బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూ జనాల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోంది.
గత ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీల పట్ల ప్రజలకు సదభిప్రాయమే ఉన్నప్పటికీ వాటికి నిర్దిష్టమైన కాలవ్యవధి పెట్టకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తోంది. వందరోజుల్లోనే హామీల అమలు అనేది అసాధ్యమని విపక్షాలకు తెలిసినా, కావాలనే యాగీ చేస్తున్నాయనీ ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. ఏదిఏమైనా నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి, ప్రజాపాలనకు పట్టం కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మరింత బాగా పనిచేయాలంటే, ఈ లోక్‌సభ ఎన్నికల్లో దానికి అండగా నిలవటం తెలంగాణ ప్రజల బాధ్యత. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పడే ప్రతి ఓటూ ప్రజాస్వా్మ్యాన్ని బలోపేతం చేసేందుకు, అనైతిక రాజకీయం చేసి తెలంగాణను ఆగం చేసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెంపపెట్టుగా నిలవనుంది.
-డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి (కాకతీయ విశ్వవిద్యాలయం)