Tollywood big movies ready to release after parliament elections:
రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు రెండు నెలలుగా ఎన్నికల సందడి నెలకొంది. దీంతో సినిమాల వంకే చూడటం మానేశాడు ప్రేక్షకుడు. ఐదేళ్లకొకసారి వచ్చే ఎన్నికలంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉండటం సహజమే. అందుకే పబ్లిక్ అంతా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోవడంతో సినిమా హాళ్లు ప్రేక్షకులు లేక మూగబోయాయి. నిర్మాతలు కూడా భారీ తరహా సినిమాలేవీ విడుదల చేయకుండా జాగ్రత్త పడ్డారు. వచ్చిన చిన్నా చితకా సినిమాలలో స్టఫ్ లేక జనాన్ని ఆకట్టుకోలేకపోయాయి. ఓ మోస్తరు టాక్ వచ్చిన సినిమాలు సైతం ప్రేక్షకులు లేక ఢీలా పడ్డాయి. కొన్ని చోట్ల థియేటర్లు కూడా మూతబడ్డాయంటే ఎన్నికల ఎఫెక్ట్ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. మరో పక్క ఐపీఎల్ 2024 ఎఫెక్ట్ కూడా కొంత ఉండటంతో ఈ రెండు అంశాలతో థియేటర్లలో ప్రేక్షకులు తగ్గిపోయాయి. కలెక్షన్లు లేక నష్టాలతో థియేటర్లు నడిపించాల్సి వచ్చిందని థియేటర్ల యాజమాన్యం చెబుతోంది. మామూలుగా అయితే సమ్మర్ సీజన్ సినిమాలకు కలిసొచ్చే అంశం. అంతా సెలవల్లో ఉంటారు కనుక ఏ కాస్త విషయం ఉన్నా ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలాంటిది ఈ సమ్మర్ అంతా బడా సినిమాలు లేక థియేటర్లు వెలవెలపోయాయి.
ఊరిస్తున్న పెద్ద సినిమాలు
ఇక ఎన్నికలు ముగియడంతో ప్రజలు కూడా ఆ మూడ్ నుంచి బయటకి వచ్చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలలో పబ్లిక్ లో ఎక్కువ బజ్ క్రియేట్ చేసేవి రాజకీయాలు, సినిమాలు. రాజకీయాల హడావిడి ముగియడంతో మళ్ళీ ఐదేళ్ల వరకు ఈ తరహా సౌండ్ ఉండదు. ఏదేమైనా ఎన్నికల రిజల్ట్ రోజు మళ్ళీ బజ్ ఉంటుంది. దీంతో సినిమా వాళ్ళు మళ్ళీ జనాలను ఎట్రాక్ట్ చేసి సినిమాలపై బజ్ పెంచడానికి సిద్ధమయ్యారు. ఇక టాలీవుడ్ లో కూడా దర్శక నిర్మాతలు తమ సినిమాల పబ్లిసిటీ స్టార్ట్ చేసుకుంటున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ సినిమా రెడీ అవుతోంది. మే 15న డబుల్ ఇస్మార్ట్ టీజర్ ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ మూవీతో డైరెక్టర్ గా పూరి, హీరోగా రామ్ బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నారు. మే20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. అదే రోజు ఎన్టీఆర్ చేస్తోన్న బాలీవుడ్ మూవీ వార్ 2 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని టాక్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకి సంబందించిన అప్డేట్ కూడా వస్తుందనే మాట వినిపిస్తోంది. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి2898ఏడీ ప్రమోషన్స్ కూడా ఈ నెలలోనే స్టార్ట్ కానున్నాయి. . మంచు విష్ణు కన్నప్ప మూవీ టీజర్ కూడా ఈ నెలలోనే రిలీజ్ కాబోతోంది. అలాగే మరికొన్ని మీడియం రేంజ్ సినిమాల అప్డేట్స్ కూడా రాబోతున్నాయి.