Prabhas movie Kalki First day collected 180 crores:
విడుదలకు ముందే భారీ అంచనాలతో బరిలో దిగిన కల్కి 2898 ఏడీ మూవీ ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని దూసుకుపోతోంది. తొలిరోజు తొలి ఆటనుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ కంటెంట్ , విజువల్స్, డైరెక్షన్ కు ఆడియన్స్ థ్రిల్లింగ్ కు గురవుతున్నారు. కల్కి దర్శకుడు నాగ్ ఆశ్విన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక సరైన హిట్ బొమ్మ లేక గత ఆరు నెలలుగా టాలీవుడ్ పరిస్థితి దారుణంగా ఉంది. సంక్రాంతికి విడుదలైన హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత చెప్పుకోదగిన సినిమాలేవీ పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. అయితే ప్రభాస్ కల్కి మూవీని వచ్చిన టాక్ ను బట్టి చూస్తే వెయ్యి కోట్లు గ్యారెంటీ అంటున్నారు సినీ అభిమానులు. ఎందుకంటే తొలి రోజు కల్కికి వచ్చిన కలెక్షన్లను చూస్తే నిజమేననిపిస్తోంది. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా రావచ్చనే అంచనాల మధ్య విడుదలైంది. కల్కి 2898 ఏడి భారతీయ సినిమాలో మూడవ అతిపెద్ద ఓపెనింగ్ ను నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా భారతదేశంలో దాదాపు రూ.95 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. గ్రాస్ కలెక్షన్స్ ప్రకారం దాదాపు రూ.118 కోట్లు అని తెలుస్తోంది. అలాగే మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్లు కలెక్షన్స్ రాగా.. అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడవ చిత్రంగా నిలిచింది.
మూడవ స్థానంలో
ఇప్పటివరకు భారతదేశంలో కేజీఎఫ్ 2 రూ.159 కోట్లు , సలార్ రూ.158 కోట్లు, లియో రూ.142 కోట్లు, సాహో రూ.130 కోట్లు, జవాన్ రూ.129 కోట్లు రాబట్టగా..ఇప్పుడు కల్కి సినిమా గ్లోబల్ ఓపెనింగ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ మూవీ మొదటి రోజే రూ.223 కోట్లతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారతీయ ఓపెనర్ గా కొనసాగుతుంది. ఆ తర్వాత స్థానంలో బాహుబలి 2 ఫస్ట్ డే రూ.217 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక తర్వాత ఇప్పుడు కల్కి ప్రాజెక్ట్ రూ.180 కోట్లతో మూడవ స్థానంలో నిలిచింది.