Tuesday, July 2, 2024

Exclusive

Criminal Law: కొత్త పోలీసు చట్టాలు

– దేశవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం
– కేసుల సత్వర విచారణే లక్ష్యం
– కొత్త చట్టాల ప్రకారమే కొత్త కేసుల విచారణ
– పోలీసు శాఖ కంప్యూటర్లలోనూ మార్పులు
– కొత్త మార్పులపై పెదవి విరుస్తున్న న్యాయ నిపుణులు

Law and Order: దేశవ్యాప్తంగా జులై 1వ తేదీ నుంచి కొత్త పోలీసు చట్టాలు అమల్లోకి వచ్చాయి. దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్‌), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ (ఐఈఏ) స్థానంలో భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్‌ఏ) పేరుతో నేటి నుంచి ఈ చట్టాలు అమలు కానున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా దర్యాప్తు, న్యాయ విచారణ చేసేందుకు అవకాశమిచ్చే ఈ చట్టాల మూలంగా శాంతి భద్రతలు మెరుగుపడతాయని, శతాబ్దంన్నర నాటి వలస కాలపు చట్టాలకు మంగళం పాడుతూ, నేటి అవసరాలకు తగినట్లుగా వీటిని రూపొందించామని కేంద్రం చెబుతోంది. కాగా, ఈ కొత్త చట్టాలతో మరిన్ని అధికారాలు పోలీసులకు దఖలు పడతాయని, దీనివల్ల సామాన్యులు, పలు కేసుల్లో బాధితులుగా ఉన్న వారికి తలనొప్పులేనని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కొత్త న్యాయ చట్టాలతో జరిగే లాభనష్టాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోండగానే, వీటి అమలుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే అనేక దశలుగా పోలీసులకు శిక్షణ శిబిరాలు నిర్వహించటంతో బాటు పోలీసు శాఖలోని కంప్యూటర్‌ వ్యవస్థలోనూ అవసరమైన మార్పులు చేశారు.

పూర్తయిన శిక్షణ
కొత్త చట్టాల అమలుకోసం ఇప్పటికే పోలీసు శాఖ పలువురు న్యాయ నిపుణుల చేత పోలీసు అధికారులందరికీ విడదల వారీగా గత రెండు నెలలుగా శిక్షణనిచ్చింది. అలాగే, పోలీసు శాఖకు సంబంధించిన కంప్యూటర్ల డేటా బేస్‌లోనూ పాత విధానాల స్థానంలో కొత్త వివరాల నమోదుకు ఏర్పాట్లు చేశారు. అయితే, సంక్లిష్టంగా ఉన్న అనేక అంశాల మీద నేటికీ స్పష్టత కరువు కావటంతో నేటి నుంచి కేసుల నమోదు విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

వచ్చిన ప్రధాన మార్పులు ఇవే..
కొత్త చట్టాల రాకతో.. నిందితులను పోలీసు కస్టడీకి తీసుకునే గడువు మరింత పెరిగింది. ప్రస్తుతం అరెస్టయిన 14 రోజుల్లోపు మాత్రమే కస్టడీకి కోరే అవకాశం ఉంది. అయితే, 60 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాల్సిన కేసుల్లో 40 రోజులకు, 90 రోజుల్లోపు దర్యాప్తు చేయాల్సిన కేసుల్లో 60 రోజుల వరకు కస్టడీ గడువును పొడిగించారు. అలాగే, కొత్త చట్టాల ప్రకారం.. ఏడేళ్లకు పైగా శిక్ష పడే అవకాశమున్న నేరాల్లో పోలీసులు తప్పనిసరిగా ఫోరెన్సిక్‌ నిపుణులతో ఆధారాల్ని సేకరించి కోర్టుకు సమర్పించాలి.

3 – 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి. 14 రోజుల్లోగా దర్యాప్తు చేపట్టి కేసును కొలిక్కి తేవాలి. ఇక.. ఆర్థిక సంబంధ నేరాల్లో నిందితుల ఆస్తులు, నేరాలు చేసి సంపాదించిన డబ్బుతో కొన్న స్థిర, చరాస్తులనూ జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. కొత్త చట్టాల ప్రకారం.. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు 2 నెలల్లోనే పూర్తి కావాలి. బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్‌ ఎదుట నమోదు చేయాలి. వారు లేకుంటే మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరచాలి. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి. పోక్సో కేసుల్లో బాధితురాళ్ల వాంగ్మూలాలను పోలీసులే కాకుండా.. మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా నమోదు చేయొచ్చు. ఇకపై.. క్రిమినల్‌ కేసుల విచారణలో ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి.

అనుకూలతలు..
కొత్త చట్టాల అమలుతో.. కేసు నమోదు నుంచి న్యాయ విచారణ పూర్తయ్యే వరకు ప్రతి సమాచారం ఎలక్ట్రానిక్‌ మాధ్యమం ద్వారా బాధితులకు అందనుంది. అంతేగాక సాక్షుల వాంగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్ష్యాలన్నింటినీ జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన డిజి లాకర్‌లో భద్రపరుస్తారు. ఈ లాకర్‌ను ఇంటర్‌ ఆపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టం (ఐసీజేఎస్‌)కు అనుసంధానం చేయటం వల్ల పోలీసులు, లాయర్లు, జడ్జిలు అవసరమైనప్పుడు సాక్ష్యాలను పరిశీలించొచ్చు. దీనివల్ల ఆధారాలు మాయం చేయడం సాధ్యం కాదు. క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టం (సీసీటీఎన్‌ఎస్‌) ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లను అనుసంధానం చేసినందున… సాక్ష్యాలను ఆన్‌లైన్‌‌లో దేశంలోని ఏ మూల నుంచి ఏ మూలకైనా నిమిషంలో పంపే అవకాశం వచ్చింది. అలాగే, ఏదైనా సాక్షి మరో ఊరిలోని కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి వస్తే.. ఆ ఊరు వెళ్లాల్సిన పనిలేకుండా, తానున్న ఊర్లోని గెజిటెడ్‌ అధికారి సమక్షంలో వీడియో ద్వారా సాక్ష్యం ఇవ్వచ్చు.

ఏదైనా ప్రాంతంలో పోలీసులు ఇళ్ల సోదాలు చేపడితే, ఈ ప్రక్రియనంతా ఇకపై పోలీసులు తప్పనిసరిగా వీడియో తీయించాలి. సోదాల్లో అనుమానాస్పద వస్తువులు స్వాధీనం చేసుకున్నప్పుడు.. సంబంధిత నివేదికను 48 గంటల్లోనే కోర్టుకు సమర్పించాలి. దీనివల్ల స్వాధీనం చేసుకున్న వస్తువులను పోలీసులు తర్వాత తారుమారు చేసే అవకాశం ఉండదు. కొత్త చట్టాల ప్రకారం.. బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఆ ఫిర్యాదుపై పోలీసులు మూడు రోజుల్లోగా ఫిర్యాదుదారుల సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. తాము నివసిస్తున్న చోటే పోలీసుల సాయం పొందొచ్చు.

ఇకపై.. ఏదైనా కేసుకు సంబంధించిన దర్యాప్తు, న్యాయవిచారణ సమన్లు ఇకపై పోలీసులు డిజిటల్‌ రూపంలో అంటే వాట్సప్‌ తదితర మార్గాల్లో పంపవచ్చు. దీనివల్ల అటు బాధ్యులు, ఇటు పోలీసులు సాకులు చెప్పి తప్పించుకోవటం కుదరదు. అలాగే, ఏదైనా కేసులో అరెస్టు వివరాలను పోలీస్‌స్టేషన్‌తోపాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. అలాగే, తమ వద్దకు వచ్చిన బాధితుల అరెస్టు సమాచారాన్ని వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు తెలపాల్సిన బాధ్యత ఇకపై పోలీసులదే. దీనివల్ల బాధితులకు తక్షణసాయం లభించే వీలుంది. బాధితులకు, నిందితులకు ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఉచితంగా అందిస్తారు. పోలీస్‌ రిపోర్ట్, ఛార్జిషీట్, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను రెండు వారాల్లో పొందొచ్చు.

ప్రధాన లోపాలు..
మనదేశంలో చిన్న, పెద్ద నేరాలతో కలిపి కోట్లాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఉగ్రవాదం, తీవ్రమైన ఆర్థిక నేరాల వంటి కేసులకే ఎక్కువ విచారణా సమయం పడుతుంది. ఇవిగాక మిగిలినన్నీ చిన్నాచితకా కేసులే. వీటిని వర్గీకరించి త్వరగా విచారణ ముగిస్తే కేసుల సంఖ్య తగ్గి, న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థల మీద ఒత్తిడి తగ్గుతుంది. అయితే, కొత్తగా వచ్చిన ఈ బీఎస్‌, బీఎన్‌ఎస్‌ఎస్‌లలో అందుకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవటంతో చిన్న కేసుల్లోనూ సత్వర న్యాయం అందే అవకాశాలు తక్కువేనని నిపుణులు అభిప్రాయపడతున్నారు. పైగా, ఏదైనా కేసులో విచారణ ముగిసిన తర్వాత శిక్ష పడటం జరుగుతుంది. కొత్త చట్టాల మూలంగా జరగనున్న సుదీర్ఘ విచారణే నిందితుల పాలిట పెద్ద శిక్షగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

ఎంతో హడావుడి చేసి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాల విషయంలో పెద్దగా కసరత్తు జరగలేదనే అభిప్రాయమూ ఉంది. ఉదాహరణకు పశ్చిమ దేశాల్లో నేర బాధితులకు 2 ప్రత్యేక హక్కులున్నాయి. ఒకటి.. కేసు విచారణ కార్యకలాపాల్లో పాలు పంచుకునే హక్కు. తమకేసులో మూడో పక్షాన్ని ప్రతివాదిగా చేర్చాలని వారు కోరవచ్చు. దర్యాప్తు వివరాలను తెలుసుకోవడానికి, వాదనను వినిపించడానికి, నిజాన్ని నిరూపించే క్రమంలో కోర్టుకు తోడ్పడటానికి బాధితులకు హక్కు ఉంటుంది. రెండు..ప్రత్యేక సందర్భాల్లో బాధితులు నేరుగా క్రిమినల్‌ కోర్టు నుంచే నష్టపరిహారం కోరవచ్చు. అయితే, ఎంతో ఆధునికమైన చట్టాలుగా చెబుతున్న బీఎన్‌ఎస్‌ఎస్‌ నష్టపరిహారం విషయంలో బాధితుల హక్కులను గుర్తించడం లేదు.

బ్రిటన్‌, అమెరికాల్లో నేర శిక్షా స్మృతులు కాలానుగుణంగా మార్పులను అందిపుచ్చుకొన్నాయి. భారత్‌లో అలా జరగడం లేదు. 1996లో బ్రిటన్‌ కొన్ని సవరణలతో క్రిమినల్‌ ప్రొసీజర్‌, ఇన్వెస్టిగేషన్స్‌ చట్టాన్ని ఆమోదించింది. అమెరికాలో న్యాయమూర్తులకు చురుకైన పాత్ర కల్పిస్తూ 1962లో నమూనా శిక్షాస్మృతిని ప్రతిపాదించగా, అనేక రాష్ట్రాలు ఆమోదించాయి. బాధితుడికి అధిక పాత్ర కల్పిస్తూ ఫ్రాన్స్‌ కోడ్‌ పీనల్‌ను చేపట్టింది. అది 1810నాటి ఫ్రెంచి శిక్షాస్మృతి స్థానంలో వచ్చింది. కానీ, కేంద్రం తెచ్చిన చట్టాల్లో బాధితుడి గోడుకు పెద్ద ప్రాధాన్యత కనిపించటం లేదు. మరోవైపు.. మన దేశంలో క్రిమినల్‌ న్యాయవ్యవస్థకు నాలుగు మూలస్తంభాలుగా భావించే పోలీసుశాఖ, ప్రాసిక్యూషన్‌ (నేరాభియోగం దాఖలుచేసి విచారణ ప్రారంభించడం), తీర్పు వెల్లడి, కారాగార శిక్ష అమలు విభాగాల ప్రతినిధులెవరినీ కొత్త చట్టాల రూపకల్పనలో భాగస్వాముల్ని చేయకపోవడం వల్ల కొంత స్పష్టత కొరవడిందనే భావన ఉంది.

మరోవైపు, కేసు నమోదై ఎలాంటి విచారణకు నోచుకోకుండా వేలమంది ఏళ్లతరబడి జైళ్లలోనే మగ్గుతున్నారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న బీఎస్‌, బీఎన్‌ఎస్‌ఎస్‌లలో ఈ లోపాలను సరిదిద్దే ఏర్పాట్లేమీ లేవు. పైగా ఈ కొత్త చట్టాలు సత్యం కంటే సాక్ష్యానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి. ఇక.. విచారణ ముగిసిన తర్వాత శిక్ష పడటం సహజ ప్రక్రియ. కానీ, సుదీర్ఘంగా సాగుతున్న విచారణ ప్రక్రియే నిందితుల పాలిట శిక్ష అవుతోంది.

అవే క్లాజులు.. అంకెలే మారాయి
కాలం చెల్లిన భారతీయ నేర శిక్షా స్మృతి (సీఆర్పీసీ), సాక్ష్యాధారాల చట్టాలవల్ల మనదేశంలో చిన్న కేసు విచారణకు చాలాకాలం పడుతోంది. దీనివల్ల వేగంగా శిక్షలు పడటం లేదు. ఈ పరిస్థితిని మార్చటం కోసం కేంద్రం తెచ్చిన భారతీయ సాక్ష్య సంహిత (బీఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌)లలోనూ సీఆర్పీసీ అవశేషాలే ఉన్నాయి. సీఆర్పీసీలోని… సందేహానికి తావులేని విధంగా సాక్ష్యాధారాలు సమర్పించడం, దోషిగా తేలే వరకు ప్రతి నిందితుడిని నిర్దోషిగానే పరిగణించడం, విచారణ ఏళ్లూపూళ్లూ సాగడం, నిందితుడికి అవసరాన్ని మించి రక్షణలు కల్పించడం, న్యాయమూర్తికి చురుకైన పాత్ర ఇవ్వకపోవడం, బాధితుడికి విచారణ ప్రక్రియలో పాత్ర కల్పించకపోవడం వంటి లోపాలను సరిదిద్దేందుకు కొత్తగా తెచ్చిన బీఎస్‌, బీఎన్‌ఎస్‌ఎస్‌లు చేసిందేమీ లేదు. కేవలం సీఆర్పీసీ, సాక్ష్యాధారాల చట్టాల్లోని క్లాజులనే మళ్ళీ వల్లెవేసి, సంఖ్యలు మాత్రమే మార్చారు.

Publisher : Swetcha Daily

Latest

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Don't miss

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై ఉన్న ద్వేషం.. - ఇప్పుడు హిందూ సమాజంపై విద్వేషంగా మారింది - కాంగ్రెస్ కూటమికి హిందూత్వాన్ని అవమానించడం అలవాటే - రాహుల్ అబద్ధాలను...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ - నిన్న 3035 పోస్టులతో ఆర్టీసీ నోటిఫికేషన్ - పెండింగ్ నోటిఫికేషన్లకు తొలి ప్రాధాన్యత - ఆగస్టులో మరో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి పదవికీ లాబీయింగ్ - హస్తినలోనే సీఎం రేవంత్ - కోట నీలిమ అంగీకరిస్తారా? - టీపీసీసీకి లేని సమాచారం Ex Minister Talasani Srinivas...