– ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం
– ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై ఉన్న ద్వేషం..
– ఇప్పుడు హిందూ సమాజంపై విద్వేషంగా మారింది
– కాంగ్రెస్ కూటమికి హిందూత్వాన్ని అవమానించడం అలవాటే
– రాహుల్ అబద్ధాలను దుష్ప్రచారం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి
Rahul Gandhi: లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నేతలు వరుసబెట్టి విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, లోక్ సభలో విపక్ష నేత హోదా చాలా బాధ్యతాయుతమైనది, ఇప్పటిదాకా ఆ పాత్రకు ఎంతో మంది వన్నె తెచ్చారని అన్నారు. కానీ, రాహుల్ గాంధీ తన విద్వేషపూరిత ప్రసంగాలను పార్లమెంట్‌ను వేదికగా మలచుకోవడం దురదృష్టకరమని విమర్శించారు. యావత్ హిందూ సమాజానికి హింసను, విద్వేషాన్ని ఆపాదిస్తూ ఆయన మాట్లాడిన మాటలకు యావద్భారతం సాక్షీభూతంగా నిలిచిందన్నారు. ఇది రాహుల్ గాంధీ అసలు రంగును మరోసారి ప్రపంచానికి బట్టబయలు చేసిందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీద రాహుల్ గాంధీ నానాటికీ పెంచుకున్న ద్వేషం, ఇప్పుడు మొత్తం హిందూ సమాజం మీద, దేశం మీద విద్వేషంగా మారిందని విమర్శలు చేశారు.
‘‘బీజేపీ, మోదీ పట్ల ఉన్న అక్కసును, ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఓడిపోయిన ఉక్రోషం, రాహుల్ గాంధీ ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ, వారి మిత్ర పక్షాలు హిందూత్వాన్ని అవమానిస్తూ మాట్లాడటం ఇది మొదటిసారేమీ కాదు. సనాతన ధర్మాన్ని వారి మిత్ర పక్షాలు తీవ్రమైన పదజాలంతో విమర్శించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరోసారి ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ చేసిన విద్వేషపూరిత ప్రసంగం వారి వ్యూహాత్మక విష ప్రచారానికి తాజా ఉదాహరణ. 2014కు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హిందూవులను మాత్రమే శిక్షించే ఒక మత హింస బిల్లును రూపొందించడానికి కూడా ప్రయత్నించారు. ఈ విద్వేష పూరిత చర్యకు కొనసాగింపే రాహుల్ గాంధీ ప్రస్తుతం చేసిన ప్రసంగం. ఎప్పటిలాగే ఆయన తన ప్రసంగంలో భాగంగా అబద్ధాలను దుష్ప్రచారం చేశారు. నిజమైన సమస్యల మీద చర్చించవలసిన లోక్ సభను, బహుశా ఎన్నికల ప్రచారమని భావించి ఇంకా తప్పుడు సమాచారంతో, తప్పుడు వీడియోలతో దుష్ప్రచారం చేసి లబ్ధి పొందాలని రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. లోక్ సభలో ఆయన చేసిన విద్వేషపూరిత ప్రసంగానికి యావత్ హిందూ సమాజాన్ని క్షమాపణ కోరాలి’’ అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇక, హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా రాహుల్‌పై విరుచుకుపడ్డారు. ఎల్ఓపీ లీడర్‌ది కేబినెట్ ర్యాంక్, రాజ్యాంగ పదవి. కానీ, రాహుల్ గాంధీ పార్లమెట్‌లో మాట్లాడిన మాటలు దేశ ప్రజల మనోభావాలని దెబ్బతీశాయని అన్నారు. ప్రపంచంలోని హిందూవులందరికీ ఆయన క్షమణాలు చెప్పాలని డిమాండ్ చేశారు.