Kunamneni Sambasivarao
Politics

PM Narendra Modi: అబద్ధాల్లో మోదీని మించారే..

– కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూనంనేని ఫైర్
– ‘సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి బీజేపీ యత్నం’

Kunamneni sambasiva rao comments(Telangana politics): కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మించిపోయారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఎంఎండీఆర్ పేరుతో చట్టం తెచ్చి బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు విక్రయిస్తున్నారని ఆగ్రహించారు. సింగరేణి బ్లాకులను వేలం వేయడమంటే తెలంగాణలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సంస్థకు ఉరిపోసినట్టేనని వాపోయారు. ఖమ్మంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ నిర్వహించిన మహాసభలకు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై మాట్లాడారు. ఈ ఏడాదిలో సీపీఐ పార్టీ వందేళ్ల వసంతంలోకి అడుగుపెడుతుందని కూనంనేని చెప్పారు. ఈ కాలంలో తమ పార్టీ ఎన్నో ఒడిదుడుకులకు లోనైనా ప్రజా సమస్యల పోరాటం చేసేది కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు.

ఉన్న బొగ్గు గనుల జోలికి వెళ్లబోమని, కొత్త బొగ్గు గనులను విక్రయిస్తామన్నట్టుగా బీజేపీ ఆలోచనలు ఉన్నాయని సీపీఐ ఎమ్మెల్యే విమర్శించారు. ఒడిషా, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో బొగ్గు గనులను నేరుగా ప్రభుత్వానికి అప్పగించారని వివరించారు. తెలంగాణలో కూడా ఇలాగే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రైవేటు వ్యక్తుల చేతికి ఇచ్చిన బొగ్గు గనులను ప్రభుత్వానికి ఇప్పించేలా కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలని, ఇందుకోసం ప్రధాని మోదీతో మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సందర్భంలో దూకుడుగా ఉండాలని సూచించారు. సింగరేని సంస్థ ప్రైవేటీకరణను తెలంగాణ ప్రజలు అడ్డుకోవాలని పిలుపు ఇచ్చారు. వచ్చే నెల 5వ తేదీన కోల్ బెల్ట్ బంద్ చేస్తామని, కలెక్టరేట్లను ముట్టడిస్తామని స్పష్టం చేశారు.

కేసీఆర్, బీజేపీ రెండూ ఒక్కటేనని కూనంనేని విమర్శించారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక కేసీఆర్ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్‌కు ఇప్పుడు పోరాటాలు గుర్తుకు వచ్చాయని, ఇప్పుడు పోరాటం చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. కానీ, పోరాటాలు చేసేది కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో పొత్తులు కొనసాగితే.. అలాగే వెళ్తామని చెప్పారు. లేదంటే.. సొంతంగా బరిలోకి దిగుతామని చెప్పారు. ఇప్పటికీ కమ్యూనిస్టులకు ఆదరణ తగ్గలేదని, ప్రస్తుత ప్రత్యేక సందర్భంలో కమ్యూనిస్టులవైపు కోట్లాది మంది చూస్తున్నారని వివరించారు. తమిళనాడు వంటి ప్రాంతాల్లో కమ్యూనిస్టుల పట్ల ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారని చెప్పారు. బీజేపీ 400 స్థానాలు గెలుస్తామని చెప్పి 240కే పరిమితం కావడం వెనుక కూడా కమ్యూనిస్టుల సైద్ధాంతిక పోరాటం ఉన్నదని గమనించాలని సూచించారు. బీజేపీ విధానాలపై పోరాడే శక్తి కమ్యూనిస్టులకే ఉన్నదని, బీజేపీ అయోధ్య వంటి చోట కూడా ఓడిపోయిందని తెలిపారు.