43 Years Of Indravelli Massacre Of Adilabad District: ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది నేస్తమా రావా..అంటూ ప్రజా యుద్ధనౌక గద్దర్ పాడిన పాట తెలంగాణ ప్రతి ఇంటిలో మార్మోగిన పాట. ఆ ఇంద్రవెల్లి గాయానికి నేటికి సరిగ్గా 43 ఏళ్లు. ఆ నెత్తుటి మరకలు ఇంకా పోనే లేదు. ఆ గాయాలు ఇంకా మానలేదు. అసలు ఇంద్రవెల్లిలో ఆనాడు ఏం జరిగింది. ఇంద్రవెల్లి నెత్తుటి మరకలు గురించి నేటి సమాజం తెల్సుకోవాల్సిన అవసరం కొంతైనా ఉంది.
అది ఏప్రిల్ 20, 1981. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గ్రామం. ఆదివాసి పోరాటాలకు నిలయం ఆదిలాబాద్ జిల్లా. రాంజీ గోండు, కొమురం భీం వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని పోరాటాలకు నాంది పలికిన ఖిల్లా. ఆదిలాబాద్ జిల్లా పోడు వ్యవసాయానికి పెట్టింది పేరు. పోడు భూములకు పట్టాలు లేవు. పోడు భూముల్లో ఉత్పత్తి చేసిన పంటలకు కనీస మద్దతు ధర లేదు. నక్సల్బరీ ఉద్యమంతో అప్పటికే రైతు కూలీ సంఘం పురుడు పోసుకుంది. నాటికే జగిత్యాల జైత్రయాత్రను విజయవంతం చేసిన రైతు కూలీ సంఘం పోడు భూములు పట్టాల కోసం మరో పోరాటం చేయడానికి నాంది పలికింది. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని.. వారు ఉత్పత్తి చేస్తున్న పంటలకు మద్దతు ధర ప్రకటించాలని ఏప్రిల్ 20, 19813 ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం సభ ఏర్పాటుకు పోలీసులను ఆశ్రయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని.. ప్రశాంతంగా సభ జరుపుకోవాలని పోలీసులు సభకు అనుమతిచ్చారు. దీంతో రైతు కూలీ సంఘం నాయకులు, గిరిజనుల్లో ఆనందం వెల్లివిరిసింది. దీంతో ఉవ్వెత్తున ఎగిసే కెరటంలా రైతులు, ఆదీవాసులు ఇంద్రవెల్లికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున వస్తున్న జనాన్ని చూసిన పోలీసు అధికారులు అప్పటికప్పుడు సభ ఏర్పాటుకు ఇచ్చిన పర్మిషన్ ను వెనక్కి తీసుకున్నారు. ఈ విషయం తెలియని రైతులు, ఆదివాసులు ఇంద్రవెల్లి సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
అప్పటికే పోలీసు అధికారులు ఇంద్రవెల్లి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున వచ్చిన అడవి బిడ్డలు, రైతులను చూసిన పోలీసులు ఎలాగైనా అడ్డుకోవాలని కుట్రపన్నారు. సభా ప్రాంగణానికి వచ్చిన వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. సభకు అనుమతి లేదని చెప్పారు. దీంతో అడవి బిడ్డలకు ఏం చేయాలో పాలుపోలేదు. సభ ఏర్పాటుకు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకోవడంతో అడవి బిడ్డలకు ఏం చేయాలో తోచలేదు. ఎలాగైన సభ నిర్వహించుకుంటామని ఆదివాసులు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులకు, ఆదివాసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం ముదురుతున్న సమయంలో పోలీసులు ఒక్కసారిగా ఆదివాసి బిడ్డలపై తూటాల వర్షం కురిపించారు. దీంతో ఆకుపచ్చటి అడవి నెత్తురు చిమ్మింది. పారిన నెత్తురుకు, పగిలిన తలలకు లెక్కలేదు. చెట్టుకొకరు, పుట్టకొకరుగా అడవి బిడ్డలు పారిపోయారు. దిక్కుకొకరుగా పారిపోయిన ఆ అమాయక ఆదివాసీలను పోలీసు బలగాలు వెంటాడి మరీ కాల్చిచంపాయి పోలీస్ బలగాలు. దీంతో ఆదివాసి బిడ్డలు అక్కడిక్కడే అశువులు బాశారు. హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసులపై నాటి ప్రభుత్వం మోపిన ఉక్కుపాదం కారణంగా పచ్చని అడవి గిరిజన బిడ్డల నెత్తుటితో ఎరుపు సింధూరంగా మారింది. ఆనాడు అంటిని ఎరుపు సింధూరం నేటికీ అలాగే ఉండటం గమనార్హం.
Also Read: రుణమాఫీపై రాజకీయం తగునా..?
ఇంద్రవెల్లి కాల్పుల ఘటన ఆ నాడు సంచలనంగా మారింది. నాటి ప్రభుత్వం ఈ ఘటనలో కేవలం 13 మంది మాత్రమే ప్రాణాలు విడిచారని ప్రకటించడంతో రైతు కూలీ సంఘం, ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. ఈ ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేపట్టాలని ప్రజా సంఘాలు నాటి ప్రభుత్వాన్ని కోరినా.. వారి నుండి స్పందన కరువైంది. పీయూడీఆర్ నేతృత్వంలో ఒక నిజనిర్థారణ కమిటీ ఇంద్రవెల్లి కాల్పుల్లో దాదాపు 60 మంది అమరులయ్యారని నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ లెక్కలకు ప్రభుత్వ లెక్కలకు చాలా వ్యత్యాసం ఉంది. కానీ నిజానికి ఆ కాల్పుల్లో దాదాపు వందకు పైగా ఆదివాసులు నేలరాలారు. వందలాది అడవి బిడ్డలకు గాయాలయ్యాయి. కానీ నాటి తుపాకి తూటాల మోతలు ఇప్పటికీ ఇంద్రవెల్లి పరిసర ప్రాంతాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. నాడు గాయాలతో బయటపడ్డ కొందరు ఆ తర్వాతి కాలంలో మృతి చెందగా, మరి కొందరు ఇప్పటికీ బతికే ఉన్నారు. ఏప్రిల్ 20 వచ్చిందంటే చాలు ఈ సంఘటనను గుర్తు చేసుకొని భయంతో వణికిపోతుంటారు.
ఈ ఘటనలో నేలరాలిన గిరిజన బిడ్డల త్యాగాలకు ప్రతిరూపంగా రైతుకూలీ సంఘం ఇంద్రవెల్లిలో స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసింది. కానీ కొందరు గూండాలు.. అమరులు త్యాగాలను చెరిపివేయాలని చూశారు. 1986 మార్చి 19న ఈ స్థూపాన్ని కూల్చేశారు. ఆదివాసులు పోరాటంతో ఐటీడీఏ నిధులతో నాటి ప్రభుత్వం స్మారక స్థూపాన్ని మళ్లీ నిర్మించింది. దీంతో ప్రతి ఏటా అక్కడ ఇంద్రవెల్లి గాయాలు, త్యాగాలకు గుర్తుగా నేలరాలిన అమరవీరులను యాదిచేసుకుంటూ నివాళులర్పిస్తారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అప్పట్లో అధికార పార్టీ నేతలు చెప్పిన మాటలు ఆచరణ సాధ్యం కావడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా అమరవీరులకు నివాళులర్పించేందుకు పరిమిత సంఖ్యలోనే పోలీసులు అనుమతులిస్తున్నారు. భారీ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదంటూ పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. ఆ నెత్తుటి మరకలకు 43 ఏళ్లు పూర్తవుతున్న ఈ వేళ.. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం షరతులతో ఉన్న నిషేధాజ్ఞలను పూర్తిగా ఎత్తివేసి ఆదివాసీల హక్కుల కొరకు ప్రాణాలర్పించిన అమరులకు శ్రద్ధాంజలి ఘటించే అవకాశం కల్పించాలి. ఇంద్రవెల్లి స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా మార్చి అమరజ్యోతిని వెలిగించాలి. ఏది ఏమైనా ఆదివాసీ అమరులు ఇచ్చిన పోరాట బాటను చివరి వరకు కొనసాగించడమే వారికి నివాళి.
– శ్రీకాంత్ చెర్వుగట్టు (జర్నలిస్ట్)