లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీలన్నీ ప్రచార పర్వంలో మునిగితేలుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తన పాలనా విజయాలను జనానికి ఏకరువు పెడుతోంది. ముఖ్యంగా ఈ దశాబ్ద కాలంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచి, పాతిక కోట్లమందిని దారిద్ర్యం నుంచి విముక్తి కల్పించామని ఆ పార్టీ గొప్పలు చెప్పుకుంటోంది. అయితే, ఈ అంశం మీద ఎక్కడా లోతైన చర్చ జరగకుండా ఉండేందుకు తీవ్ర భావోద్వేగాలను రేకెత్తించే అయోధ్య, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలనే తన ప్రచారంలో ప్రధాన అంశాలుగా ఉండేలా ఆ పార్టీ నేతలు అడుగడుగునా జాగ్రత్త పడుతున్నారు. దేశ వనరుల మీద అందరికీ సమాన హక్కును కల్పించటం ద్వారానే ప్రజలు ఆర్థికంగా బలపడతారనే వాస్తవం ఈ మొత్తం ప్రచార హోరులో మరుగున పడిపోతోంది. అందుకే ఈ లోక్‌సభ ఎన్నికల వేళ.. పదేళ్ల మోదీ పాలనలో దేశం సాధించిన వాస్తవ ఆర్థిక, సామాజిక ప్రగతి ఏమిటనే దానిపై లోతుగా చర్చ జరగాల్సి ఉంది. అప్పుడే ప్రజలకు వాస్తవ పరిస్థితి మీద స్పష్టమైన అవగాహన ఏర్పడే అవకాశం ఉంది.
తమ పాలనలో భారత్.. ప్రపంచపు ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందనీ, అతి త్వరలో మనం మూడవ అతిపెద్ద ఎకానమీగా రికార్డు సృష్టించబోతున్నామని బీజేపీ నేతలు ఘనంగా చాటుకుంటున్నారు. కానీ, భారత్‌లో ఆర్థిక వనరులన్నీ కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నాయని, కార్పొరేట్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని, దేశవ్యాప్తంగా జరిగే వ్యాపారాల మీద వచ్చే ఆదాయంలో 25% వాటా, దేశ సంపదలో 40% శాతం వాటా కేవలం 162 మంది బిలియనీర్స్ చేతికే అందుతోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ, సిఎస్‌డిఎస్ సంస్థ చేపట్టిన పరిశోధనలో తేలింది. మరోవైపు వందల కోట్ల ఖర్చుతో కార్పొరేట్లు దేశంలో జరుపుకునే వేడుకలు, విదేశాల్లో జరిగే వారి కుటుంబ సభ్యుల వివాహాలు దేశంలోని కడు బీదరికంలో ఉన్న వారని అవమానించేలా సాగుతున్నాయి. దీనివల్ల ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటోంది. ఈ అనారోగ్యకర ధోరణి ఎలాంటి ప్రగతికి సంకేతమో మన దేశంలోని ఆర్థికవేత్తలంతా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.
మన దేశంలో గత దశాబ్దకాలంలో గ్రామీణ, పట్టణ విద్యావంతుల్లో చాలామంది నిరుద్యోగులుగా లేదా తమ అర్హతకు తగని ఉద్యోగాలతో జీవితాలను నెట్టుకొస్తున్నట్లు పై నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో చాలామంది రూ. 10వేలకు అటూఇటూ వేతనాలతోనే సర్దుకుపోతున్న ఈ వీరంతా అధిక ధరలకు ఆర్థికంగా కుదేలైపోవటంతో మెరుగైన వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. వీరిలో మెజారిటీ తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించే క్రమంలో అప్పుల పాలై పోతున్నారనే వాస్తవాన్ని ఈ నివేదిక ఎత్తిచూపింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సజావుగా అందటం లేదని కూడా ఈ రిపోర్డు వెల్లడించింది. పేద, మధ్యతరగతి వారు కొనే నిత్యావసరాల మీద కూడా అధిక మొత్తంలో జీఎస్టీ విధిస్తున్నారనీ, తద్వారా ఏటా 35 లక్షల కోట్ల రూపాయల పేదల కష్టాన్ని పిండుకుంటున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
Also Read: ఇంద్రవెల్లి నెత్తుటి జ్ఞాపకానికి సరిగ్గా 43 ఏళ్లు
గత పదేళ్ల కాలంలో ఆయా రాష్ట్రాల్లోని 500 యూనివర్సిటీలకు కేంద్ర సర్కారు నుంచి చిల్లిగవ్వ దక్కలేదు. దీంతో బోధన, పరిశోధనా ప్రమాణాల పరంగా ఈ వర్సిటీలన్నీ కుదేలై పోయాయి. దేశంలోని విద్యా వ్యవస్థలను బలోపేతం చేయవలసిన యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ గత పదేళ్ల కాలంలో రీసెర్చి స్కాలర్లకు ఇచ్చే ఫెలోషిప్స్‌లో కోత విధించటంతో అనేక మంది విద్యార్థులు నష్టపోయారు. 1986లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో జిల్లాకి ఒకటి చొప్పున ఏర్పడిన నవోదయా స్కూళ్లు.. 38 ఏళ్ల తర్వాత కూడా జనాభాకు అనుగుణంగా పెరగకపోవటం, 144 కోట్ల జనాభా గల దేశంలో నేటికీ 1254 కేంద్రీయ విద్యాలయాలే ఉండటం విషాదం. వీటి సంఖ్య పెంపు మీద పదేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం ఎలాంటి చొరవా చూపలేదు. దీంతో పేద, దిగువ మధ్యతరగతి వర్గాలు తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉన్న ఆస్తిపాస్తులను అమ్ముకోవాల్సి వస్తోంది. ఒకస్థాయి తర్వాత ఆర్థిక వనరులేమీ లేక ఆయా వర్గాల పిల్లలు ఉన్నత విద్య, పరిశోధనకు దూరమవుతున్నారు. ఇటు తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొనటం, కార్పొరేట్ విద్యాసంస్థలు, వర్సిటీలు చేస్తున్న దోపిడీని అడ్డుకునేందుకు కేంద్రం గానీ, పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గానీ ఎలాంటి నియంత్రణా చర్యలు తీసుకోకపోవటం విషాదం. మరోవైపు విద్యపేరుతో వేలకోట్ల దోపిడీకి పాల్పడుతున్న ఈ విద్యాసంస్థలు, వందల కోట్ల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్స్‌ను ఆయా పార్టీలకు ఇవ్వటం చూసి జనం నోరెళ్లబెడుతున్నారు.
మరోవైపు గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో యువత ఉపాధి కోసం పట్టణాలు, నగరాలకు వలస పోతున్నారు. దీంతో గ్రామీణ ఆర్థిక, సామాజిక ముఖ చిత్రమే మారిపోతోంది. ఒకప్పుడు స్వయం పోషకాలుగా ఉన్న గ్రామాల్లోని ప్రజలు, నగరవాసుల మాదిరిగా అన్నీ కొనుక్కోవాల్సిన దుస్థితి తలెత్తుతోంది. మరోవైపు నగరాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం కారుచౌకగా తమకు అండగా నిలిచే కార్పొరేట్లను అక్రమవిధానాల ద్వారా ధారాదత్తం చేస్తోంది. గత పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 96 ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్లకు ధారాదత్తం చేసి తద్వారా సమకూరిన రూ. 4 లక్షల కోట్లతో ఖజానాను నింపుకుంది గానీ, ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగ్గ ఉపాధినిచ్చే ప్రభుత్వ రంగ సంస్థ రాలేదు. ఈ వాస్తవాన్ని దాచిపెడుతున్న కేంద్ర పెద్దలు, దేశంలో పెరుగుతున్న కార్పొరేట్ సంఖ్యను చూపి, అదే నిజమైన అభివృద్ధి అంటూ ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు జాతీయ రహదారులను ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న మోదీ సర్కారు హైవేల కోసం రైతుల నుంచి సేకరించిన భూమికి న్యాయమైన నష్టపరిహారాన్ని అందించే విషయంలో, భూమి కోల్పోయిన ఆ వర్గాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకూ ఎలాంటి ప్రత్యేక శ్రద్ధా చూపలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, గిరిజన వర్గాలతో బాటు లక్షలాది పేద రైతుకూలీలకు కనీస ఉపాధి కల్పించేందుకు సోనియా గాంధీ నాయకత్వంలోని నాటి యూపీఏ సర్కారు తీసుకొచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం వంటి ఒక్కటంటే ఒక్క పథకాన్ని పదేళ్ల పాలనలో మోదీ సర్కారు తీసుకురాలేకపోయింది.
ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే… తెలంగాణ సెంటిమెంటును అడ్డం పెట్టుకుని పదేళ్ల పాటు రాష్ట్రాన్ని యధేచ్ఛగా లూటీ చేసిన పాలకులను గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పారద్రోలారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నిండా నాలుగు నెలలు కూడా గడవనే లేదు. అత్యంత పరిమితంగా ఉన్న ఆర్థిక వనరులతోనే ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని విపక్షాలు రోజూ విమర్శించటాన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ మూడు నెలల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దోపిడి, తెగబడ్డ అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా జనం ముందుకు వస్తున్నాయి. అదే సమయంలో వచ్చిన ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో బాటు కేంద్రంలోని మోదీ సర్కారు సాధించిన ఆర్థిక, సామాజిక మార్పులను బేరీజు వేసుకుని ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో బుద్ధి జీవులు, విద్యావంతులు తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్యకరమైన చర్చకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– ప్రొ. కూరపాటి వెంకట్ నారాయణ
ఛైర్మన్, తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కమిటీ