- తెలంగాణలో ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు
- 64.93 శాతం ఓటింగ్ నమోదు
- 2019 లోక్ సభ ఎన్నికలకన్నా రెండు శాతం అధికం
- 1400 కేంద్రాలలో అర్థరాత్రి దాకా జరిగిన పోలింగ్
- 76.47 శాతం పోలింగ్ తో అత్యధికంగా నమోదైన భువనగిరి సెగ్మెంట్
- అత్యల్పంగా 46.07 శాతం నమోదైన హైదరాబాద్
- సాయంత్రం 6 దాటినా బారులు తీరిన ఓటర్లు
- తెలంగాణ వ్యాప్తంగా ఒక్క రోజే 38 ఎఫ్ఐఆర్ కేసులు నమోదు
- రీపోలింగ్ అవసరం లేదన్న ఎన్నికల కమిషనర్
- ఓటేసేందుకు వెళ్లి ముగ్గురు, విధుల్లో ముగ్గురు మృతి
Voting percentage in Telangana increased 64.93 percent lok sabha:
అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు తప్ప తెలంగాణలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఎలాంటి ఉద్రిక్తకర సంఘటనలు జరగకపోవడంతో ఎన్నికల అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సారి లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో 64.93 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. గతంలో 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 62.77 శాతం నమోదు అయింది. అయితే ఈ సారి రెండు శాతం తెలంగాణలో పెరగడం విశేషం. అందరూ గతంలో కన్నా ఓటింగ్ శాతం తగ్గుతుందని భావించారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఓటింగ్ శాతం పెరగడం విశేషం. ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు సత్ఫలితాలని ఇచ్చాయి. ఓటర్లను చైతన్యవంతం చేసేలా చేపట్టిన అవగాహన కార్యక్రమాలు మంచి రిజల్ట్ నే ఇచ్చాయి. అందులో భాగంగా సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ సమయం పెంచడం కూడా ఒక రకంగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఆరు తర్వాత కూడా క్యూలో నుంచున్న ప్రతి ఓటరుకూ అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం ప్రకటించడానికి ఆలస్యం అయింది.
1400 పోలింగ్ కేంద్రాలలో
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,400 పోలింగ్ కేంద్రాలలో సాయంత్రం 6 గంటల దాకా క్యూలో ఉన్నవారందరికీ రాత్రి బాగా పొద్దుపోయేవరకూ ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక ఈ సంవత్సరం గత రెండు వారాలుగా భయపెడుతూ వచ్చాయి. పోలింగ్ తేదీకి మూడు రోజుల ముందునుంచి ఎండల తీవ్రత తగ్గడం, వాతావరణం అనూహ్యంగా చల్లబడటంతో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి ఎండ తీవ్రంగా ఉంటుందని చాలా మంది ఉదయం నుంచే క్యూలో నిలుచుని తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు బారులు తీరారు. సినిమా, రాజకీయ, క్రీడా సెలబ్రిటీలు కూడా హుందాగా క్యూ లైన్ పాటించి తమ సందేశాల ద్వారా ఓటర్లను చైతన్యవంతం చేయడం విశేషం.
హైదరాబాద్ అత్యత్పం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక లో 50.34% పోలింగ్ శాతం నమోదయింది. ఇక లోక్ సభ పోలింగ్ సరళి చూస్తే..అదిలాబాద్ -72.96%, భువనగిరి -76.47%, చేవెళ్ల -55.45%, హైద్రాబాద్ -46.07%, కరీంనగర్-72.33%, ఖమ్మం-72.19%, మహబూబాబాద్-70.68% మహబూబ్ నగర్- (రూరల్) 71.54%, మల్కాజిగిరి-50.12%, మెదక్-74.38%, నాగర్ కర్నూల్ -68.86%, నల్గొండ-73.78%, నిజామాబాద్-71.50%, పెద్దపల్లి-67.88%, సికింద్రబాద్-48.11%, వరంగల్-68.29%, జహీరాబాద్-74.54%, సికింద్రబాద్ కంటోన్మెంట్.50.34% నమోదు కావడం విశేషం. అత్యధికంగా పోలింగ్ అయిన పార్లమెంట్ సెగ్మెంట్ భువనగిరి 76.47 శాతం నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్ 46.07 శాతం నమోదవడం గమనార్హం.
ఎక్కడా రీ పోలింగ్ అవసరం లేదు
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ సహా ఉత్తరాది రాష్ఠ్రాలకు లక్షలాది మంది తరలివెళ్లినా పోలింగ్ శాతం పెరగడం అభ్యర్థులను, రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం అధికారులకు ఊరటనిచ్చింది. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాధవీలత, నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిపై కేసులతోపాటుగా మొత్తం 38 ఎఫ్‌ఐఆర్‌లు సోమవారం ఒక్కరోజే నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 115 ఈవీఎంలు వివిధ కారణాలతో మొరాయించడంతో వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటుచేశారు. పోలింగ్ రోజు సోమవారం ఎన్నికల అక్రమాలపై సీ-విజిల్ యాప్‌కు 225 ఫిర్యాదులు, డయల్ 1950 ద్వారా 21 ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందాయి. రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాలేదని, రీ పోలింగ్ జరపాల్సిన అవసరం ఏర్పడలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదు. మొత్తం 44 కౌంటింగ్ కేంద్రాలలో జూన్ 4న ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు చేర్చారు. మిగిలిన మూడు దశల ఎన్నికల అనంతరం జూన్ 1వ తేదీన ఎగ్జిట్ పోల్ కు అనుమతించారు. ఇక దేశ వ్యాప్తంగా జూన్ 6 దాకా ఎన్నికల కోడ్ అమలులో ఉండనుంది. తెలంగాణ లో సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన ఆదిలాబాద్, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి తదితర సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. సమయం ముగిసే సమయానికి వరుసలో నిలబడిన వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. గిరిజన గూడేలు, తండాల్లో కూడా పోలింగ్ బాగా జరిగిందని అధికారులు చెబుతున్నారు.