Kidney Health: మూత్రపిండాలు (కిడ్నీలు)మన శరీరానికి చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇవి మన శరీరంలో వ్యర్థాలను ఫిల్టర్ చేయడం, ద్రవాల సమతౌల్యం కాపాడటం, అవసరమైన ఖనిజాల స్థాయిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ, వీటి పనితీరు తగ్గిపోతే మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే, మనం తీసుకునే కొన్ని ఆహారాలు కిడ్నీలపై అదనపు ఒత్తిడిని కలిగించి పరిస్థితిని మరింతగా కష్టంగా మారుస్తాయి. కాబట్టి ఆహార నియమాలను జాగ్రత్తగా పాటించడం వలన కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే, కిడ్నీ సమస్యలతో బాధ పడేవారు ఈ ఫుడ్స్ ను తినకుండా ఉండటమే మంచిది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రాసెస్ చేసిన ఆహారాలు (అధిక సోడియం కలిగిన ఫుడ్స్)
చిప్స్, ఇన్‌స్టంట్ నూడిల్స్, పికిల్స్, టిన్నుల సూప్‌లు, ఫాస్ట్‌ఫుడ్.. ఇవన్నీ సోడియం (ఉప్పు) అధికంగా కలిగి ఉంటాయి. ఇది బ్లడ్ ప్రెజర్ ను పెంచి, కిడ్నీల పనితీరును బలహీనపరుస్తుంది. అధిక ఉప్పు కారణంగా శరీరంలో ద్రవం నిల్వవడంతో కిడ్నీలు వ్యర్థాలను ఫిల్టర్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఉప్పుకు బదులు మసాలాలు, దినుసులు ఉపయోగించి ఇంటి వంటలు తినడం మంచిది.
ఎర్ర మాంసం (రెడ్ మీట్)
( రెడ్ మీట్ ) ఎర్ర మాంసంలో అధిక ప్రోటీన్, ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి కిడ్నీలకు ఎక్కువ పని కలిగించి వ్యర్థ పదార్థాలు రక్తంలో పేరుకుపోయేలా చేస్తాయి. కాబట్టి వాటికీ బదులు పప్పులు, బీన్స్ వంటి ప్లాంట్ ప్రోటీన్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. కానీ పరిమాణం కోసం డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తప్పనిసరి.
పాలు, చీజ్, పెరుగు ( డైరీ ప్రోడక్ట్స్ )
డైరీ ఉత్పత్తుల్లో ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి కిడ్నీ సమస్యలున్నవారిలో ఎముకలు, గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆల్మండ్ మిల్క్, రైస్ మిల్క్ లేదా తక్కువ ఫాస్ఫరస్ ఉన్న వాటిని వాడటం మంచిది.
అధిక పొటాషియం ఫలాలు
అరటిపండు, ఆరంజ్, అవకాడో, బంగాళదుంపలు.. ఇవన్నీ పొటాషియం అధికంగా కలిగి ఉంటాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే ఈ పొటాషియం శరీరంలో పేరుకుపోయి కండరాల బలహీనత, గుండె సమస్యలకు దారితీస్తుంది. వాటికీ బదులు యాపిల్, ద్రాక్ష, బెర్రీలు, అనాసపండు వంటి తక్కువ పొటాషియం ఫలాలు తీసుకోవాలి.
చక్కెర కలిగిన పానీయాలు
సోడా, కోల్డ్ డ్రింక్స్ వంటి చక్కెర పానీయాలు బ్లడ్ లో చక్కెర స్థాయిలను పెంచి కిడ్నీ నష్టం వేగవంతం చేస్తాయి. నీరు, కోకనట్ వాటర్ లేదా నిమ్మరసం వంటి సహజ పానీయాలు తీసుకోవడం మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.
