H5N5 Bird Flu Case: వాషింగ్టన్ లో ఒక వ్యక్తికి మనుషుల్లో ఎప్పుడూ గుర్తించని కొత్త రకం బర్డ్ ఫ్లూ వైరస్ H5N5 ను గుర్తించారు. ఈ సంఘటనతో అమెరికా వైద్యుల్లో ఆందోళన పెరిగింది. తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరిన ఈ వ్యక్తి ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు.
వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ సమాచారం ప్రకారం, ఇప్పటి వరకూ H5N5 వైరస్ జంతువుల్లో మాత్రమే కనిపించింది, కానీ ఇది మొదటిసారి మనిషిలో నమోదు కావడం షాకింగ్ లాగా ఉంది. ఈ కేసు గ్రేస్ హార్బర్ కౌంటీకి చెందిన వృద్ధుడిలో గుర్తించారు. అతని ఇంట్లో పెంచే కోళ్లు, బాతులు వంటి పక్షుల్లో ఇటీవల రెండు చనిపోవడంతో, అక్కడి నుంచే వైరస్ సోకిందా అని అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ వైరస్ మనుషుల్లోకి ఎలా చేరింది? పరిశోధనల్లో అధికారులు
పౌల్ట్రీ విభాగం,హెల్త్ శాఖలు కలిసి ఈ కేసు గురించి విచారిస్తున్నాయి. రోగి అనారోగ్యంగా ఉన్న పక్షులతో నేరుగా సంబంధం కలిగి ఉన్నట్లు తేలింది. అయితే, ఇది సాధారణ ప్రజలకు పెద్ద ప్రమాదం కాదని అధికారులు స్పష్టం చేశారు.
H5N5.. త్వరగా మార్పులకు గురయ్యే ప్రమాదకర క్లేడ్
ఈ వైరస్ 2.3.4.4b క్లేడ్‌కి చెందిన అత్యంత ప్రమాదకరమైన హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (HPAI) రకం. 2020 నుండి పక్షుల్లో భారీగా వ్యాపిస్తున్న ఈ క్లేడ్, ప్రసిద్ధ H5N1 వైరస్‌కి కొత్త జన్యు శాఖలా పరిగణించబడుతుంది. వన్యజీవుల్లో తిరిగే ఈ రకమైన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్‌లు పక్షుల్లోకి, కొన్నిసార్లు మనుషులకి కూడా సోకుతాయి. మనుషుల్లో ఇలాంటి కేసులు చాలా అరుదుగా కనిపిస్తాయి. అవి కూడా ఎక్కువగా చనిపోయిన పక్షుల నుంచి మాత్రమే సోకుతాయి.
ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి సోకుతుందా?
అమెరికా ఆరోగ్య శాఖ ప్రకారం, ఇంతకముందు దేశంలో నమోదైన కొన్ని బర్డ్ ఫ్లూ కేసుల్లో స్వల్పం నుండి తీవ్రమైన లక్షణాలు కనిపించినా, ఒక్క మరణం మాత్రమే నమోదైంది. ముఖ్యంగా, మనిషి నుంచి మనిషికి బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఇప్పటి వరకూ అమెరికాలో అసలు రికార్డు కాలేదు.

