Trump vs Democrats: భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలను వ్యతిరేకిస్తూ ఆ దేశ చట్టసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ టారిఫ్ లు భారత్ – అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసేలా ఉండటమే కాకుండా సొంత పౌరులపై అధిక భారం మోపేలా చేస్తున్నాయని తీర్మానంలో పేర్కొన్నారు. విపక్ష డెమోక్రటిక్ పార్టీకి చెందిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యులు డెబోరా రాస్ (నార్త్ కరోలినా), మార్క్ వీజీ (టెక్సాస్) భారతీయ మూలాలు కలిగిన ఎంపీ రాజా కృష్ణమూర్తి (ఇల్లినాయిస్) కలిసి ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు.
సుంకాలు చట్ట విరుద్దం
ఈ ఏడాది ఆగస్టు 27న భారత్ పై విధించిన అదనపు (సెకండరీ) 25 శాతం సుంకాలను రద్దు చేయడమే ఈ తీర్మానం ఉద్దేశమని ముగ్గురు సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా ఇప్పటికే విధించిన సుంకాలకు ఇవి అదనంగా మోపబడ్డాయని పేర్కొన్నారు. నార్త్ కరొలినా రాష్ట్ర ఆర్థిక వాణిజ్యం, పెట్టుబడులు, సమాజం.. భారతదేశంతో అనుసంధానమై ఉందని కాంగ్రెస్ సభ్యురాలు డెబోరా రాస్ అన్నారు. భారతీయ కంపెనీలు తమ రాష్ట్రంలో ఒక బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టి జీవ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వేలాది ఉద్యోగాలను సృష్టించాయని పేర్కొన్నారు. అలాగే నార్త్ కరొలినా ఉత్పత్తిదారులు.. ఏటా వందల మిలియన్ల డాలర్ల విలువైన సరుకులను భారత్‌కు ఎగుమతి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
అమెరికన్స్‌పై అదనపు భారం
‘భారతదేశం ఒక ముఖ్యమైన సాంస్కృతిక, ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామి. ఈ చట్టవిరుద్ధమైన సుంకాలు.. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ఉత్తర టెక్సాస్ ప్రజలపై అదనపు పన్నుల్లాంటివి’ అని కాంగ్రెస్ సభ్యుడు మార్క్ వీజీ అన్నారు. అటు భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ మ్యాన్ రాజా కృష్ణమూర్తి ఈ సుంకాలను ప్రతికూలమైనవిగా అభివర్ణించారు. ఇవి సరఫరా గొలుసులను దెబ్బతీయడంతో పాటు అమెరికా కార్మికులకు నష్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలోని వినియోగదారుపలై అదనపు భారాన్ని మోపుతున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సుంకాలను రద్దుచేయడం ద్వారా అమెరికా – భారత్ ఆర్థిక, భద్రతా సహకారం మరింత బలోపేతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
Also Read: National Band Competition: విద్యార్థుల్లో వికాసం, క్రమశిక్షణకు పోటీలు.. ఢిల్లీలో జరిగే బ్యాండ్ పోటీలకు విజేతలు!
ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలపై సవాల్
ఈ తీర్మానం ద్వారా ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష వాణిజ్య చర్యలను సవాలు చేస్తున్నట్లు ముగ్గురు సభ్యులు తెలియజేశారు. భారత్‌తో అమెరికా సంబంధాలను పునరుద్ధరించడం కోసం డెమోక్రాట్లు చేపడుతున్న విస్తృత ప్రయత్నాల్లో ఇదొక భాగమని అన్నారు. కాగా అక్టోబర్ ప్రారంభంలోనే రాస్, వీసీ కృష్ణమూర్తి, రో ఖన్నా సహా మరో 19 మంది కాంగ్రెస్ సభ్యులు.. అధ్యక్షుడు ట్రంప్ తన ప్రతీకార సుంకాలను వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు. ముఖ్యంగా భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున వాటిని సరిచేయాలని సూచించారు. కాగా భారత్ తో వాణిజ్య లోటును భర్తీ చేయాలంటూ తొలుత 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అదనంగా ఇంకో 25 టారిఫ్ లు జారీ చేశారు.

