Plane Crash: ఒక కంపెనీకి చెందిన అడ్వర్టైజింగ్ బ్యానర్‌ను ఆకాశంలో ప్రదర్శిస్తూ ముందుకు లాక్కెళుతున్న క్రమంలో ఓ తేలికపాటి చిన్న విమానం అనూహ్య రీతిలో ప్రమాదానికి (Plane Crash) గురైంది. సముద్ర తీరంలోని నీళ్లలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమాన పైలెట్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ షాకింగ్ ఘటన బ్రెజిల్‌లో జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం, శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బ్రెజిల్ రాజధాని నగరం రియో డి జనీరోలోని కోపాకబానా తీరంలో చోటుచేసుకుంది.
Read Also- Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్ నేతల హౌస్ అరెస్ట్.. ఓపెన్ మెరిట్ విద్యార్థుల ఆందోళనలో కొత్త మలుపు
మరణించిన పైలట్ మృతదేహాన్ని మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సహాయక బృందాలు, జెట్ స్కీలు, ఇన్‌ఫ్లేటబుల్ బోట్లు, డైవర్లు, వైమానిక దళం సాయంతో ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. విమాన శకలాలతో పాటు మరెవరైనా బాధితులు సముద్రంలో పడిపోయారేమోనన్న అనుమానంతో గాలింపు చేపట్టామని, ఇందుకోసం సోనార్ పరికరాలను కూడా వినియోగించినట్టు వివరించారు.
కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సంబంధిత అధికారులు విడుదల చేశారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో విమానం కూలినట్టుగా స్పష్టమైంది. తీరానికి సమీపంలో విమానం ముందు భాగం తొలుత సముద్రంలోకి దూసుకెళ్లినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాన్ని తెలుసుకునేందుకు బ్రెజిల్ ఎయిర్‌ఫోర్స్ దర్యాప్తు మొదలుపెట్టింది. ప్రమాదానికి గురైన విమానం ఒక ప్రకటనల సంస్థకు చెందిన సెస్నా 170ఏ (Cessna 170A) రకానికి చెందినది అని అధికారులు నిర్ధారించారు.

