Pak Army Chief: అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ సైన్యాధిపతి అసీం మునీర్ ( Asim Munir).. భారత్ పై మరోమారు తన అక్కసు వెళ్లగక్కాడు. అగ్రరాజ్యం (America) వేదికగా నిలబడి భారత్ సహా యావత్ ప్రపంచానికి అణు హెచ్చరికలు జారీ చేశారు. ఫ్లోరిడా (Florida)లోని టాంపాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస పాక్ పౌరులను ఉద్దేశించి ఆసీం మునీర్ మాట్లాడారు. తాము నాశనమైతే తమతోపాటు సగం ప్రపంచాన్ని విధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
పాక్ ఆర్మీ చీఫ్ ఇంకా ఏం చెప్పారంటే?
పాక్ సైన్యాధిపతి ఆసీం మునీర్ మాట్లాడుతూ ‘మేము అణు శక్తి గల దేశం. మేము పతనమవుతున్నామని భావిస్తే ప్రపంచంలో సగభాగాన్ని మాతో పాటు నాశనం చేస్తాము’ అని హెచ్చరించారు. పాక్ తో కుదుర్చుకున్న సింధు నది ఒప్పందం నుంచి భారత్ తప్పుకోవడంపైనా ఆయన మాట్లాడారు. సింధు నది జలాలపై భారత్ నిర్మించబోయే ప్రాజెక్ట్స్.. పాకిస్థాన్‌కు వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటే వాటిని నాశనం చేస్తామని బెదిరించారు. తమ దేశానికి క్షిపణుల కొరత లేదని వాటితో ఆయా ప్రాజెక్ట్స్ ను కూల్చివేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి (Pahalgam Terror Attacks) తర్వాత ఇండస్ వాటర్స్ ఒప్పందం (Indus Water Treaty)పై న్యూ ఢిల్లీ తీసుకున్న నిర్ణయం 250 మిలియన్ల మందిని ఆకలి సంక్షోభంలోకి నెట్టిందని మునీర్ పేర్కొన్నారు.
‘సింధూ నదిపై ప్రాజెక్ట్స్ కూల్చివేస్తాం’
‘సింధు నదిపై భారత్ ఆనకట్ట నిర్మించే వరకు మేము వేచి ఉంటాము. ఆనకట్ట నిర్మించిన తర్వాత పది క్షిపణులతో (Missiles) దాన్ని నాశనం చేస్తాము. ఇండస్ నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదు. మాకు క్షిపణుల కొరత లేదు’ అని మునీర్ అన్నట్లు అమెరికన్ మీడియా తెలిపింది. ఇదిలా ఉంటే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ గత రెండు నెలల వ్యవధిలో రెండోసారి అమెరికాకు వచ్చారు. జూన్ 18న జరిగిన తొలి సందర్శనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump)తో కలిసి మునీర్.. శ్వేతసౌధంలో విందులో పాల్గొన్నారు. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు చల్లార్చేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారంటూ.. నోబెల్ శాంతి బహుమతికి సిఫారసు చేశారు.
భారత్ – పాక్ సైనిక ఘర్షణపై..
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సందర్భంగా భారత్ – పాక్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల గురించి సైతం ఆసీం మునీర్ మాట్లాడారు. నాలుగు రోజుల యుద్ధంలో తమ నష్టాల వివరాలను భారత్ ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. ‘భారతీయులు తమ నష్టాలను ఒప్పుకోవాలి. ఇది క్రీడాస్ఫూర్తి లక్షణం’ అని ఆయన అన్నారు. భారత్ తమకు జరిగిన నష్టాలను బహిర్గతం చేస్తే.. ఇస్లామాబాద్ కూడా ప్రకటిస్తుందని పేర్కొన్నారు.
కారు – రాళ్ల ట్రక్ జోస్యం
అమెరికా పర్యటనలో భారత్ పాక్ ప్రస్తుత పరిస్థితులను పోలుస్తూ ఆసీం మునీర్ విచిత్రమైన జోస్యం చెప్పారు. భారత్ ఒక మెరిసే మెర్సిడెస్ కారు లాంటిదని.. ఇస్లామాబాద్ రాళ్లతో నిండిన డంప్ ట్రక్ అని పేర్కొన్నారు. ‘భారత్ హైవేపై వచ్చే మెర్సిడెస్ కారు.. కానీ మేము రాళ్లతో నిండిన డంప్ ట్రక్. అది కారును ఢీకొంటే ఎవరు నష్టపోతారు?’ అంటూ పేర్కొన్నారు. అయితే భారత్ తమకంటే ఉన్నత స్థితిలో ఉందని పరోక్షంగా ఆసీం మునీర్ అంగీకరించినట్లు అర్థమవుతోంది. తమను తాము రాళ్లతో నిండిన ట్రక్ తో పోల్చుకొని పాక్ స్థాయి ఏంటో ఆసీం ప్రపంచానికి తెలియజేశారు.
పాక్ అధ్యక్షుడిగా మునీర్?
పాక్ ఆర్మీ చీఫ్ గా ఉన్న ఆసీం మునీర్.. త్వరలో ఆ దేశ అధ్యక్షుడు (Pak President) కాబోతున్నట్లు ఇటీవల ఊహాగానాలు మెుదలయ్యాయి. అంతేకాదు అమెరికా తరహాలో అధ్యక్ష తరహా పాలనను తీసుకొచ్చేందుకు పాక్ రాజ్యాంగంలో సవరణలు సైతం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇందులో భాగంగానే మునీర్ ను అధ్యక్షుడ్ని చేసే పాక్ పాలనను ఆయన చేతిలో పెడతారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆసీం మునీర్ కు ఎనలేని గౌరవ మర్యాదలు ఇస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.
Also Read: Rana Daggubati: నేడు ఈడీ విచారణకు దగ్గుబాటి రానా.. ఈసారైనా వెళ్తారా!
పాక్‌కు అంత సీన్ ఉందా?
భారత్ పై పాక్ ఆర్మీ చీఫ్ చేసిన అణుబెదిరింపులకు సంబంధించి నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. పాక్ అణు బాంబు ప్రయోగిస్తే భారత్ చేతులు కట్టుకొని కూర్చోదంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలోనే పాక్ న్యూక్లియర్ ప్లాంట్ కు సమీపంలో భారత్ దాడి చేసిందని.. అవసరమైతే అణు కేంద్రాలపై అటాక్ చేసేందుకు వెనుకాడబోమన్న సంకేతాన్ని ఇచ్చిందని గుర్తుచేస్తున్నారు. కాబట్టి ఆసీం మునీర్ చేస్తున్న బెదిరింపులకు భారత్ ఎట్టిపరిస్థితుల్లో బెదిరేది లేదని.. పాక్ నుంచి ఒక క్షిపణి గాల్లోకి లేస్తే.. ఇటు నుంచి 10 మిసైల్స్ పాక్ వైపునకు దూసుకెళ్తాయని సమాధానం ఇస్తున్నారు.