Trump Trade War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన దుందుడుకు వైఖరితో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రతీకార సుంకాలు (Trade War) పేరుతో మిత్ర దేశాలను సైతం భయాందోళనకు గురిచేస్తున్నారు. అయితే అమెరికా ప్రయోజనాలే తనకు ముఖ్యమంటూ చెబుతున్న ట్రంప్.. తన చర్యల మూలన ఇప్పుడు దేశానికి భారీ నష్టాలను తీసుకొస్తున్నారు. గత కొన్ని రోజులుగా ట్రంప్ తీసుకుంటున్న అస్థిర విధానాల కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్లు (US Stock Market) భారీగా నష్టాలను చవిచూశాయి. కేవలం 20 రోజుల వ్యవధిలో స్టాక్స్ లోని మదుపర్ల సంపద 4 ట్రిలియన్ డాలర్ల (రూ.349 లక్షల కోట్లు) మేరకు ఆవిరైపోయింది.
రికార్డు స్థాయిలో పతనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన టారిఫ్ యుద్ధం.. ఆర్థిక అనిశ్చితులకు దారి తీయవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు గత కొద్దిరోజులుగా పతనమవుతూ వస్తున్నాయి. ఎస్‌అండ్‌పీ 500 సూచీ ఫిబ్రవరి 19వ తేదీన నమోదు చేసిన ఆల్‌టైమ్ హైతో పోలిస్తే ఇప్పటి వరకూ 8 శాతానికి పైగా విలువ కోల్పోయింది. అలాగే నాస్ డాక్ కాంపోజిట్ డిసెంబర్ లో సాధించిన హై వాల్యూ కంటే 10 శాతం నష్టపోయింది. అమెరికా స్టాక్ మార్కెట్ లో ఈ ఒక్క సోమవారమే 1.7 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయింది. 2022 సెప్టెంబర్ లో ఈ స్థాయిలో అమెరికన్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఈ స్థాయిలో సూచీలు పతనం కావడం ఇదే తొలిసారి. అటు ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మస్క్ కు సైతం షాక్ తప్పలేదు. అతడు స్థాపించిన టెస్లా కంపెనీ షేర్లు 15 శాతం పతనమయ్యాయి. డిసెంబర్ 17 నుంచి సంస్థ షేరు 50% ఆవిరై 479.86 డాలర్ల నుంచి 222.15 డాలర్లకు పతనమైంది.
ట్రంప్ ఏమన్నారంటే
అమెరికాను చుట్టుముడుతున్న ఆర్థిక మాంద్య భయాలపై ఇటీవల ట్రంప్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రస్తుతం దేశం మార్పు దశలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక మాద్యం వస్తుందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు.. తాను అలాంటి విషయాలను ఊహించడాన్ని కూడా ఇష్టపడనని అన్నారు. అయితే ఆర్థిక మాంద్యం రాదని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోయారు. తమ ప్రభుత్వం ప్రస్తుతం పెద్ద బాధ్యత తీసుకుందని చెప్పడం ద్వారా మార్కెట్ పతనానికి, ఆర్థిక మాంద్యానికి ట్రంప్ సర్కారు ముందే సిద్ధమైందన్న సంకేతాలు ఇచ్చారు.
Als0 Read: Air Quality Report: భారత నగరాల్లో విష గాలి.. ప్రజలు ఎక్కువ కాలం బతకలేరట!
శ్వేత సౌధం రియాక్షన్
మార్కెట్ల పతనం నేపథ్యంలో శ్వేతసౌధం ప్రతినిధి ఒకరు స్పందించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని ది నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ అధిపతి కెవిన్ హస్సెట్ట్ స్పష్టం చేశారు. ఆర్థిక మాంద్యం భయాలు పెద్ద ఎత్తున వినిపిస్తుండటాన్ని ఆయన తోసిపుచ్చారు. సుంకాల విషయంలో నెలకొన్న అస్పష్టత త్వరలోనే తొలగిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.