Ireland Permanent Residency: ఐర్లాండ్ ప్రభుత్వం ఇటీవల శాశ్వత నివాస (Permanent Residency – PR) అవకాశాన్ని ప్రకటించింది. శాశ్వతంగా ఇక్కడ నివసించేందుకు సుమారు రూ.52,000 (500 యూరోలు) ఖర్చుతో దరఖాస్తు చేసుకోవచ్చని సూచిందింది. భారతీయులు కూడా ఇందుకు అర్హులని స్పష్టం చేసింది. ఐర్లాండ్ లో రోజు రోజుకు పెరుగుతున్న వర్ణ వివక్ష దాడుల నేపథ్యంలో ఆ దేశం శాశ్వత నివాస అవకాశాన్ని ప్రకటించడం గమనార్హం. అయితే శాశ్వత పౌరసత్వానికి ఐర్లాండ్ ఎలాంటి షరతులు విధించింది? శాశ్వత నివాసం కోసం ఎలా అప్లై చేయాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ? ఈ కథనంలో చూద్దాం.
అర్హతల విషయానికి వస్తే..
తమ దేశంలో శాశ్వత నివాసం కోసం ఐర్లాండ్ కొన్ని షరతులు విధించింది. కనీసం 5 ఏళ్ల (60 నెలలు) పాటు తమ దేశంలో నివసించి ఉండాలని సూచించింది. జనరల్ ఎంప్లాయ్ మెంట్ పర్మిట్ (General Employment Permit ) కలిగిన వారు 5 సంవత్సరాల తర్వాత PRకి అర్హులు. క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్ మెంట్ పర్మిట్ (Critical Skills Employment Permit) కలిగినవారికి మాత్రం కేవలం 2 సంవత్సరాల తర్వాతే PR అర్హత ఉంటుంది. ఈ కాలంలో విరామం లేకుండా ఉద్యోగం చేయడం, పన్నులు క్రమం తప్పకుండా చెల్లించి ఉండాలి. అదే సమయంలో సోషల్ వెల్ఫేర్ (ప్రభుత్వ సహాయం) మీద ఆధారపడి ఉండకూడదు. అలాగే సదరు వ్యక్తిపై ఎలాంటి క్రిమినల్ రికార్డ్ ఉండకూడదు.
దరఖాస్తు ప్రక్రియ..
దరఖాస్తు ప్రక్రియ.. ఐరిష్ నాచురలైజేషన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ (Irish Naturalisation and Immigration Service – INIS)) కు ఈమెయిల్ పంపడం ద్వారా ప్రారంభమవుతుంది. ఫీజు సుమారు 500 యూరోలు (రూ.52,000)గా నిర్ణయించారు. శాశ్వత నివాస అప్లికేషన్ ప్రాథమిక ఆమోదానికి 28 రోజులు.. మెుత్తం ప్రక్రియకు 6-8 నెలల సమయం పట్టనుంది. కుటుంబ సభ్యులు (భార్య, పిల్లలు) కూడా కొంత సడలింపు ప్రమాణాలతో పీఆర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పీఆర్ వచ్చిన తర్వాత..
ఐర్లాండ్ లో శాశ్వత నివాసానికి ఆమోదం లభించిన వ్యక్తికి ఆ దేశంలో కొన్ని ప్రయోజనాలు లభించనున్నాయి. నిరవధికంగా అక్కడి కంపెనీల్లో పనిచేసే వెసులుబాటు లభిస్తుంది. అలాగే ఆరోగ్య, విద్య, సోషల్ వెల్ఫేర్ సౌకర్యాలు పొందవచ్చు. అలాగే నేచురలైజేషన్ ద్వారా పౌరసత్వం (citizenship)కు దరఖాస్తు చేయవచ్చు.
ఐర్లాండ్ లో అవకాశాలు..
నైపుణ్యం కలిగిన భారతీయులకు ఐర్లాండ్ లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు సిద్ధంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. టెక్నాలజీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నట్లు పేర్కొంటున్నారు. ఇంగ్లీషు వచ్చి ఉంటే సరిపోతుందని తెలియజేస్తున్నారు. అంతేకాదు ఇక్కడి అహ్లాదకరమైన వాతావరణం కూడా భారతీయులను కట్టిపడేస్తుందని అక్కడ సెటిల్ అయిన ఇండియన్స్ చెబుతున్నారు.
Also Read: GST Revamp: బిగ్ అలెర్ట్.. ఇప్పుడే ఆ వస్తువులు కొనొద్దు.. ఈ నెల 22 నుంచి చీప్‌గా వస్తాయ్
వర్ణ వివక్ష దాడులు
అయితే ఐర్లాండ్ లో కొద్దికాలంగా భారతీయులపై వర్ణ వివక్ష దాడులు జరుగుతున్నాయి. 2025 ఆగస్టులో డబ్లిన్‌లో 20 ఏళ్లకు పైగా నివసిస్తున్న 51 ఏళ్ల భారతీయుడుపై టీనేజర్లు దాడికి తెగబడ్డారు. 22 ఏళ్ల భారతీయ విద్యార్థి బస్‌స్టాప్ వద్ద జాతి వివక్ష తిట్లకు గురయ్యాడు. వాటర్‌ఫోర్డ్ నగరంలో 6 ఏళ్ల బాలికపై సైతం దాడి జరిగింది. దీనివల్ల ‘India Day’ వంటి భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. భారత రాయబార కార్యాలయం సురక్షిత మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. రాత్రివేళల్లో ఒంటరిగా బయట తిరగకూడదని హెచ్చరించింది. ఐర్లాండ్ అధ్యక్షుడు, ఉప ప్రధాన మంత్రి వంటి నేతలు ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ భారతీయ కమ్యూనిటీ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది.