Elon Musk Flags Risk Of Poll Rigging In EVM BJP Leader Responds:
ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంల పని తీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.. అయితే పోలింగ్ సమయంలో ఈవీఎం యంత్రాలు హ్యాకింగ్ కు గురవ్వడంపై టెస్లా, స్సేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్ ను నివారించవచ్చని అంటున్నారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్డోరికోలో రీసెంట్ గా నిర్వహించిన ప్రైమరీ ఎన్నికలలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుంది’’అని మస్క్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈవీఎంలలో అవకతవకలు
ప్యూర్టో రికోలో ఇటీవల తలెత్తిన ఎన్నికల వివాదాల కారణంగా అక్కడి అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి సారించారు. యూఎస్ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ సమీప బంధువు రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ ఈ హ్యాకింగ్‌పై మాట్లాడుతూ ‘‘ప్యూర్టో రికోలో నిర్వహించిన ప్రైమరి ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు చోటు చేసుకొన్నాయి. పేపర్ ట్రయిల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించగలిగాము. లేదంటే ఏమి జరిగేదో.. ఈ సమస్యలను నివారించడానికి పేపర్ బ్యాలెట్‌లను తిరిగి తీసుకురావాలి, అలా చేస్తే ప్రతి ఓటు లెక్కించే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
భారత కేంద్ర మంత్రి ఖండన
మస్క్ వ్యాఖ్యలపై భాజపా నేత, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు. ‘‘మస్క్ ప్రకటన అన్నింటిని కలిపి సాధారణీకరిస్తూ చేసినట్లుంది. సాధారణ కంప్యూటర్ ప్లాట్‌ఫామ్‌లు వాడి ఇంటర్నెట్‌కు అనుసంధానించేలా తయారు చేసిన ఈవిఎంలను వినియోగించే అమెరికా లేదా ఇతర దేశాల్లో ఆయన చెప్పిన విషయాన్ని అన్వయించుకోవచ్చేమో. కానీ, భారత ఈవీఎంలు ఏ నెట్‌వర్క్ లేదా మీడియాతో కనెక్ట్ అవ్వని విధంగా డిజైన్ చేశారు. వీటికి బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్‌లతో కనెక్టివిటీ ఉండదు. వీటిని రీప్రోగ్రామ్ చేయడానికి కూడా వీలుండదు. భారత్ తయారు చేసే విధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఇతర దేశాలు రూపొందించుకోవచ్చు’’ అని సూచించారు