Plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన (Plane Crash) నేపథ్యంలో విమానాలకు సంబంధించిన చిన్నచిన్న ఘటనలు, లోపాలు కూడా హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఈ తరహా ఘటనలపై అప్రమత్తత కూడా పెరిగింది. అయినప్పటికీ మన పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో సోమవారం విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ట్రైనింగ్ విమానం ఓ స్కూల్ భవనంపై కూలింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయాలు అయినట్టుగా ప్రాథమిక సమాచారం వెలువడుతోంది.
ఢాకా నగరంలోని ఉత్తరా అనే ఏరియాలో ఉన్న ‘మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ’ భవనంపై విమానం కూలింది. కూలిన విమానం చైనాలో తయారైన ఎఫ్-7 యుద్ధ విమానంగా నిర్ధారించారు. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పొగలు సైతం ఎగసిపడుతున్న దృశ్యాలు టీవీ ఫుటేజ్‌లలో కనిపించాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. భద్రతా బలగాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. విద్యార్థులు కూడా గాయాలు అయినట్టుగా వీడియోల్లో కనిపిస్తోంది. కొంతమంది కాలిన గాయాలతో భయంతో పరుగులు తీయడం కూడా కనిపించింది. అంబులెన్సులు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో క్షతగాత్రులను ఆర్మీ సిబ్బంది చేతులతో ఎత్తుకొని ఆటో-రిక్షాల ద్వారా ఆస్పత్రులకు తరలించినట్టు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఇవాళ (జులై 21) మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ భవనం క్యాంటీన్ భాగంలో కూలినట్టు తెలుస్తోంది.
Read Also-Nitish Reddy: సిరీస్ మధ్యలోనే నితీష్ కుమార్ రెడ్డి తిరుగుపయనం.. బీసీసీఐ కీలక ప్రకటన
19 మంది దుర్మరణం
మొత్తం 19 మంది మరణించారు. ఫ్లైట్ లెఫ్టినెంట్ మహ్మద్ తౌకీర్ ఇస్లాం అనే పైలట్‌తో పాటు 16 మంది పిల్లలు, ఇద్దరు టీచర్లు ఈ ప్రమాదంలో కన్నమూశారు. వంద మందికి పైగా గాయపడ్డారు. వీరిలో అత్యధికులు విద్యార్థులే. కొంతమందికి తీవ్ర కాలిన గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆ ప్రాంతంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడినవారిలో కనీసం ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. నగరంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీకి చెందిన ఓ డాక్టర్ మాట్లాడుతూ, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రి మహ్మద్ యూనస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఈ ప్రమాదంలో ఎయిర్ ఫోర్స్‌కు, మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీకి చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు, సిబ్బందికి జరిగిన నష్టాన్ని పూడ్చలేం’’ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Read Also- Mumbai Blasts: ముంబై పేలుళ్ల కేసులో దోషులంతా నిర్దోషులే.. హైకోర్టు సంచలన తీర్పు
చైనా తయారు చేసిన ఎఫ్-7 యుద్ధ విమానం కూలిపోవడం ఈ ఏడాది ఇది రెండవ ఘటన కావడం గమనార్హం. గత నెలలో మయన్మార్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-7 విమానం సగాయింగ్ ప్రాంతంలో కూప్పకూలింది. ఆ ప్రమాదంలో ఒక పైలట్ మృతిచెందాడు. దీంతో, చైనా తయారీ రక్షణ రంగ ఉత్పత్తుల నాణ్యతపై ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి.