Mob Attack On Hindu: పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై వరుసగా జరుగుతున్న మూకదాడులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆ దేశానికి చెందిన విద్యార్థి సంఘం నేత మహ్మద్ హదీ హత్య తర్వాత నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో, తొలుత దీపు చంద్రదాస్ ఘోరమైన హత్య, ఆ తర్వాత మరో ఇద్దరు హిందువుల ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలు మరచిపోక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తిపై మూకదాడి (Mob Attack On Hindu) జరిగింది. ఖోకాన్ దాస్ అనే 50 ఏళ్ల వ్యక్తిపై కొందరు సమూహం దాడి చేసి, నిప్పంటించారు. డిసెంబర్ 31న షరియత్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఖోకాన్ దాస్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ షాకింగ్ ఘటనతో బంగ్లాదేశ్‌లని మైనారిటీ హిందువులు మరోసారి భయభ్రాంతులకు గురయ్యారు.
ఇంటికి వెళుతున్న వ్యక్తిపై దాడి
దాడికి గురైన ఖోకాన్ దాస్ ఓ పని నిమిత్తం బయటకు వెళ్లి, తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ మూకదాడి జరిగింది. పదునైన ఆయుధాలతో దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత ఖోకాన్ దాస్‌కు నిప్పు కూడా పెట్టారు. తాజా ఘటనతో కలిపి, కేవలం రెండు వారాల్లోనే నలుగురు హిందువులపై దాడి జరిగినట్టు అయ్యింది. డిసెంబర్ 24న అమృత్ మండల్ అనే ఏళ్ల యువకుడిని కొట్టిచంపేశారు. కలిమోహర్‌లోని హోస్సెన్‌డంగా అనే ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. అంతకంటే ముందు, డిసెంబర్ 18న దీపు చంద్రదాస్ అనే వ్యక్తి ప్రాణాలు తీసిన తీరు యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. సరైన ఆధారాలు లేకుండానే దైవదూషణ ఆరోపణలపై అత్యంత ఘోరంగా హత్య చేశారు. ఓ వస్త్ర దుకాణంలో కార్మికుడిగా పనిచేస్తున్న అతడిని ఫ్యాక్టరీ యాజమాన్యమే మూకకు అప్పగించింది. అప్పటికే గేటు బయట వేచిచూస్తున్న ఒక్కసారిగా క్రూరంగా దాడి చేశారు. దుస్తులన్నీ విప్పేసి కొట్టారు. ప్రాణాలు పోయిన తర్వాత ఓ చెట్టుకు మృతదేహాన్ని వేలాడదీశారు. అనంతరం ఆ డెడ్‌బాడీకి నిప్పటించారు. బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్‌లో ఈ ఘటన జరిగింది. అత్యంత దారుణం ఏంటంటే, దీపు చంద్రదాస్ పనిచేస్తున్న ఫ్యాక్టరీలోని కార్మికులు కూడా మూకలో కలిసిపోయి దాడి చేశారు.
Read Also- Micro Dramas: న్యూయర్‌లో కొత్త దర్శకులను అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మంచు విష్ణు.. ఎప్పుడంటే?
కాగా, షేక్ హసీనా ప్రభుత్వం పతనం కావడం, ఆ తర్వాత యూనస్ సారధ్యంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల జట్ల అక్కడి మైనారిటీలు, ప్రపంచవ్యాప్తంగా హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతవారం కేంద్ర ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై స్పందించింది. హిందువులపై దాడులు అత్యంత విచారకరమని ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, క్రీస్టియన్లు, బౌద్ధులపై దాడులు జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేసింది. అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, పొరుగుదేశంలో నెలకొన్న పరిస్థితుల్లో పురోగతి ఉంటుందని ఆశిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మీడియా ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also- India Bullet Train: దేశంలో బుల్లెట్ రైలు కల నెరవేరబోతోంది.. ప్రారంభం తేదీని ఖరారు చేసిన కేంద్రం

