Afghanistan Earthquake: ఆఫ్ఘానిస్తాన్‌లో శుక్రవారం వరుసగా రెండు భూకంపాలు నమోదయ్యాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మికాలజీ (NCS) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సాయంత్రం 4.1 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూగర్భంలో 178 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు NCS తెలిపింది.
ఎక్స్ ప్లాట్‌ఫారంపై NCS పోస్టు చేసిన సమాచారం ప్రకారం “EQ of M: 4.1, On: 21/11/2025, 21:33:32 IST, Lat: 36.45 N, Long: 70.99 E, Depth: 178 Km, Location: Afghanistan.”
ఉదయం కూడా 4.3 తీవ్రతతో ప్రకంపనలు
ఇదే రోజు ఉదయం మరో 4.3 తీవ్రత గల భూకంపం కూడా ఆఫ్ఘానిస్తాన్‌ను కుదిపేసింది. ఈ భూకంపం భూగర్భంలో 170 కిలోమీటర్ల లోతులో నమోదైందని NCS వెల్లడించింది.
NCS తమ ఎక్స్ పోస్టులో ఇలా రాసుకొచ్చింది
“EQ of M: 4.3, On: 21/11/2025, 12:59:11 IST, Lat: 36.40 N, Long: 70.52 E, Depth: 170 Km, Location: Afghanistan.”
నవంబర్ 4న ఉత్తర ఆఫ్ఘానిస్తాన్‌ను శక్తివంతమైన భూకంపం తీవ్రంగా ప్రభావితం చేసింది. 6.3 తీవ్రతతో నమోదైన ఆ ప్రకంపనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోగా, 956 మంది గాయపడ్డారని తాలిబాన్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరఫత్ జమాన్ అమర్ తెలిపారు. అదే సమయంలో, దేశంలోని అతి అందమైన మసీదులలో ఒకటి దెబ్బతిన్నట్లు వెల్లడించారు. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, మజార్-ఇ-షరీఫ్ నగరానికి సమీపంలో 28 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చింది. ఈ కంపనలతో అనేక కుటుంబాలు అర్ధరాత్రి నిద్రలేచాయి.
భూకంపాలకు నిలయం ఆఫ్ఘానిస్తాన్
హిందూ కుష్ పర్వత శ్రేణి ఉన్న ఆఫ్ఘానిస్తాన్, భూకంపాలకు ప్రసిద్ధి గాంచిన ప్రాంతం. భారత ప్లేట్, యురేషియన్ ప్లేట్‌ల ఢీకొనే ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడ ప్రతి సంవత్సరం తీవ్రమైన భూకంపాలు సంభవిస్తున్నాయని రెడ్ క్రాస్ పేర్కొంది. హెరాత్ ప్రాంతం గుండా కూడా ప్రధాన ఫాల్ట్ లైన్ వెళ్లడం వల్ల భూకంప ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
విపత్తులకు అత్యంత ప్రమాదకర ప్రాంతం
సంయుక్త రాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (UNOCHA) ప్రకారం, ఆఫ్ఘానిస్తాన్ వరుస ప్రకృతి విపత్తులకు అత్యంత ప్రభావిత దేశాలలో ఒకటి. వరుస భూకంపాలు, వరదలు, కొండచరియలు.. ఇవన్నీ ఇప్పటికే దశాబ్దాల కాలం నుంచి ఘర్షణలతో, వెనుకబాటుతనంతో పోరాడుతున్న ప్రజలను మరింత బలహీనులను చేస్తున్నాయని UNOCHA హెచ్చరించింది.

