మెక్సికో (Mexico)లో ఘోర ప్రమాదం జరిగింది. కాంకున్ నుంచి టాబాస్కో వైపు వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొనడంతో మంటలు చెలరేగి ఏకంగా 40 మంది సజీవ దహనమయ్యారు. మరికొంత మంది గాయాల పాలయ్యారు. ఈ దుర్ఘటన దక్షిణ మెక్సికోలోని ఎస్కార్సె నగర సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
మృతుల్లో 38 మంది ప్రయాణీకులు కాగా మరో ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన బస్సులో మొత్తం 48 మంది ఉన్నట్లు వారు చెబుతున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృత దేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకు 18 మృతదేహాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
Also Read : ఆస్తి కోసమే జనార్ధన్ రావు హత్య.. ఏసీపీ క్లారిటీ
వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై టాబాస్కోలోని కమల్ కాల్కో మేయర్ ఒవిడియో పెరాల్టా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.