Bolivia Road Accident: బొలీవియా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఘటనా స్థలిలో భీతావాహ పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటా హుటీనా ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
దాని వల్లే అధిక మరణాలు
లాటిన్ అమెరికాలో జరుగుతున్న ఒరురో కార్నివాల్ కు బస్సులు వెళ్తుండగా ఉయుని – కొల్చాని రహదారిపై ఈ బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకదానికొకటి ఢీకొన్న (Bolivia Bus Crash) అనంతరం ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో మృతుల సంఖ్య భారీగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్పష్టం చేశారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలిపారు. ఘటనకు కారణమైన ఇద్దరు డ్రైవర్లు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు ఉయుని పోలీసులు తెలిపారు. అందులో ఓ డ్రైవర్ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
ఘటనపై దర్యాప్తు ముమ్మరం
బస్సులు ఢీకొన్న ఘటనపై కేసు నమోదు చేసిన ఉయుని దర్యాప్తు ప్రారంభించారు. ఓ బస్సు ఆపోజిట్ లైన్ లోకి ఎంటర్ కావడం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అది గమనించని రెండో బస్సు డ్రైవర్ వేగంగా వెళ్లి దానిని ఢీకొట్టినట్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రమాద ఘటనపై బొలీవియా ప్రభుత్వం సంతాపం తెలియజేసింది. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది.