Pakistan train hijack: పాకిస్థాన్ బలోచిస్థాన్ ప్రావిన్స్ లో ఓ రైలును మంగళవారం మిలిటెంట్లు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. వారి చెరలో బందీలుగా ఉన్న ప్రయాణికులను విడిపించేందుకు పాకిస్థాన్ బలగాలు ప్రత్యేక ఆపరేషన్ ను చేపట్టాయి. ఈ క్రమంలో ఇప్పటివరకూ 155 మంది ప్రయాణికులను మిలిటెంట్ల నుంచి రక్షించినట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. ట్రైన్ ను ఆధీనంలోకి తెచ్చుకున్న 27 మంది బలూచిస్థాన్ రెబల్స్ ను అంతం చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ కాల్పుల్లో 30 మంది వరకూ సైనికులు చనిపోయినట్లు సమాచారం. మిగిలిన వారిని రక్షించేందుకు మిషన్ కొనసాగుతున్నట్లు పాక్ బలగాలు స్పష్టం చేశాయి.
పాకిస్థాన్ లో వేర్పాటు బలోచ్ మిలిటెంట్లు మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా రెచ్చిపోయారు. దాదాపు 500 మందికిపైగా ప్రయాణిస్తున్న రైలును జాఫర్ ఎక్స్ ప్రెస్ పై దాడికి తెగబడ్డారు. సమస్యాత్మక బలోచిస్థాన్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌కు రైలు వెళ్తుండగా ఈ దాడికి తెగబడ్డారు. రైలులోని భద్రతా సిబ్బందిని హత్య చేసినట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. మరికొందరు సెక్యూరిటీ సిబ్బందితో పాటు 182 మందిని బందీలుగా చేసుకున్నట్లు మంగళవారం సోషల్ మీడియాలో పేర్కొంది.
జాఫర్ రైలు ప్రయాణిస్తున్న మార్గంలో 17 సొరంగాలు ఉండగా 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ ను పేల్చేసి తమ నియంత్రణలోకి తీసుకున్నారు. రైలును చుట్టుముట్టి భారీస్థాయిలో కాల్పులు జరిపారు. జైల్లోని బలోచ్ రాజకీయ ఖైదీలను 48 గంటల్లో విడుదల చేయాలని, లేకుంటే రైలును పూర్తిగా పేల్చేస్తామని మిలిటెంట్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రైలు హైజాక్ అయిన సొరంగ మార్గాన్ని పాక్ బలగాలు చుట్టు ముట్టాయి. అయితే ఘటనాస్థలి మెుత్తం చీకటిగా ఉండటంతో ఆర్మీ చర్యలకు అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Telangana: తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ? అసలేం జరుగుతోంది?
బందీలుగా ఉన్న మహిళలు, చిన్నారులను వెంటనే విడిచిపెట్టినట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే దీనిని పాక్ బలగాలు ఖండించాయి. వారిని రక్షణ కవచాలుగా మిలిటెంట్లు వాడుకుంటున్నాయని ఆరోపించాయి. కాగా హైజాక్ ఘటనను పాక్ ప్రదాని షరీఫ్ తీవ్రంగా ఖండించారు. అటు పాక్ అంతర్గత మంత్రి మోసిన్ నఖ్వీ సైతం ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలగాలు కాపాడిన ప్రయాణికుల్లో 31 మంది మహిళలు, 15 చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు.