ghmc
హైదరాబాద్

Water Supply Disruption: అధికారుల్లో సమన్వయ లోపం… గ్రేటర్ వాసుల పాలిట శాపం

ఉభయ శాఖల మధ్య సమన్వయ లోపం
పైపులైన్ బదలాయింపు పనుల పంచాయతీ
12 గంటల్లో పూర్తి చేస్తామని చెప్పి..
వారం రోజుల గడువు కోరిన ఎన్‌హెచ్‌ఏ‌ఐ
పనుల్లో ఆలస్యం.. మండిపడ్డ జలమండలి ఎండీ
వారం రోజుల పాటు ప్రజలకు నీటి కటకట

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపం గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) ప్రజలకు శాపంగా (Water Supply Disruption) మారుతున్నది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏ‌ఐ)(NHAI) ఆధ్వర్యంలో బీహెచ్ఈఎల్(BHEL) చౌరస్తా నుంచి సుమారు కిలోమీటర్ పొడవున నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా బీహెచ్ఈఎల్ చౌరస్తాలో ఉన్న వాటర్ పైపులైన్ బదలాయింపు పనులను తొలుత 12 గంటల్లో చేస్తామని పనులను ప్రారంభించింది. దీంతో అప్రమత్తమైన జలమండలి(Water board) ఈ నెల 8వ తేదీన ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పలు డివిజన్లలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ప్రజలకు సమాచారం అందజేసింది. కాగా ఈ నెల 9వ తేదీ ఆదివారం ఉదయం కూడా పనులు పూర్తి కాకపోవడంతో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బీహెచ్ఈఎల్ చౌరస్తాకు చేరుకొని పరిశీలించారు. పనులను ఆలస్యం చేయడంతో అధికారులపై మండిపడ్డారు.

జ‌ల‌మండ‌లి ఎండీ అసంతృప్తి..
రోడ్డు ప‌నుల్లో భాగంగా తాగునీటి పైపులైన్‌(Pipeline)ను మ‌రో చోట‌కు మార్చే ప‌నుల‌ను ఆల‌స్యం చేస్తుండ‌టం ప‌ట్ల నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) తీరుపై జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. 12 గంట‌ల‌ని చెప్పి.. 30 గంట‌లు గ‌డిచినా ప‌నులు పూర్తి చేయ‌క‌పోవడంతో నీటి స‌ర‌ఫ‌రాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నద‌ని ఆయ‌న పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ జంక్షన్ వ‌ద్ద రోడ్డు ప‌నులు జ‌రిపేందుకు జ‌ల‌మండ‌లి పీఎస్సీ పైపులైన్‌ను వేరే చోట‌కు మార్చాల్సిన అవ‌స‌రం ఏర్పడినట్లు ఆయన వెల్లడించారు. వీలైనంత వేగంగా ప‌నులు పూర్తి చేయాల‌ని ఎన్‌హెచ్ఏఐకు సూచించారు. ప‌నుల ఆల‌స్యంతో వారం రోజుల పాటు నీటి స‌ర‌ఫ‌రాలో అంతరాయం ఏర్పడుతుందని.. ప్రజలు గమనించాలని కోరారు.

అంతరాయం నెల‌కొన్న ప్రాంతాలు..
జలమండలి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ డివిజన్ – 6లోని ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్. డివిజన్ – 9లోని కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్ట. డివిజన్ – 17లోని ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్. డివిజన్ – 22లోని దీప్తిశ్రీ నగర్, బీరంగూడ, అమీన్ పూర్, నిజాంపేట్ ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి మరోసారి ప్రజలకు సూచించింది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవా?
గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో మెయింటెనెన్స్ పనులు తదితర కారణాలతో తరచూ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నట్లు జలమండలి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం చేరవేస్తున్నది. కానీ.. జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటిపైనే ఆధారపడి జీవించే మధ్యతరగతి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని సమాచారం ఇవ్వడంలో చూపే శ్రద్ధను.. ప్రత్యామ్నాయంగా ట్యాంకర్లతో ప్రజలకు నీటిని సరఫరా చేయడంపై జలమండలి దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.

 

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు