tanker
హైదరాబాద్

Water Crisis: హలో.. ట్యాంకర్ కావాలి; మహానగరంలో నీటి సమస్య

వేసవి ప్రారంభంలోనే ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్
జనవరిలోనే లక్షా16 వేల ట్యాంకర్లు?
పెరిగిన డిమాండ్‌తో అప్రమత్తమైన జలమండలి
సమ్మర్‌లో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్లాన్
900 వాటర్ ట్యాంకర్లు, 79 ఫిల్లింగ్ స్టేషన్లు

తెలంగాణ బ్యూరో,స్వేచ్ఛ: వేసవి ప్రారంభంలోనే మహానగరంలో నీటి సమస్య తలెత్తుతున్నది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లో ఎండలు ఓ మోస్తరుగా దంచి కొడుతున్నాయి. ఈ పరిస్థితి మున్ముందు మరింత తీవ్రమయ్యే పరిస్థితులున్నందున, వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. గత ఏడాది జనవరిలో 80 వేల ట్యాంకర్లు బుక్ కాగా, ఈ సారి జనవరిలోనే లక్షా 16 వేల వాటర్ ట్యాంకర్లు బుక్ అయ్యాయంటే మున్ముందు నీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉండనుందో అంచనా వేసుకోవచ్చు. గ్రేటర్‌లోని జలమండలి పరిధిలోని 23 ఆపరేషన్, మెయింటనెన్స్ సెక్షన్ల పరిధిలో దాదాపు 13 లక్షల 70 వేల నల్లా కనెక్షన్లు ఉన్నట్లు, వీటి ద్వారా కోటీ 30 లక్షల మందికి ప్రతి రోజు 550 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వేసవిలో అదనంగా మరో 20 ఎంజీడీల నీటిని సరఫరా చేసేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రజల సౌకర్యార్థం ప్రస్తుతం జలమండలి‌లో సుమారు 900 వాటర్ ట్యాంకర్లున్నట్లు, వీటికీ వస్తున్న బుకింగ్‌లకు అనుగుణంగా నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఫ్లిలింగ్ కోసం 79 స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు, వీటిని ఫిల్ చేసే సమయాన్ని కూడా బాగా తగ్గించినట్లు అధికారులు తెలిపారు. గతేడాది జనవరిలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరగటంతో పదుల సంఖ్యలో ఫిల్లింగ్ పాయింట్లను పెంచినట్లు తెలిపారు. సర్కారు ఆదేశాల మేరకు గోదావరి ఫేజ్-2,3ల ద్వారా నగరానికి నీటిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రయత్నం టెండర్ల దశలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే నగరానికి వస్తున్న కృష్ణా ఫేజ్-1,2 జలాలకు తోడుగా గోదావరి ఫేజ్-2,3 జలాలను కూడా తీసుకువస్తే ప్రతి సీజన్‌లోనూ నగరానికి కావాల్సిన మోతాదులో నీటిని సరఫరా చేయవచ్చని జలమండలి అధికారులు భావిస్తున్నారు.

ఐదేళ్లలో 867 ఎంజీడీలకు పెరగనున్న వాటర్ సప్లై..
ప్రస్తుతం హైదరాబాద్‌లో 23 ఆపరేషన్, మెయింటనెన్స్ డివిజన్లలోని 13.7లక్షల నల్లా కనెక్షన్లతో కోటి 30 లక్షల మందికి తాగునీటిని అందించేందుకు జలమండలి డైలీ 560 ఎంజీడీల నీరు స‌ర‌ఫ‌రా చేస్తున్నది. కానీ, రానున్న ఐదేళ్లలో 2030 నాటికి నగర తాగునీటి డిమాండ్ 867 ఎంజీడీలకు పెరుగనున్నట్లు, 2050 నాటికి 1114 ఎంజీడీలకు పెరగనున్నట్లు జలమండలి అంచనా వేసింది. దీనికనుగుణంగా అదనంగా జలాలను తరలించేందుకు గోదావరి ఫేజ్-2,3 లను తెరపైకి తెచ్చింది. సర్కారు పచ్చజెండా ఊపడంతో ప్రస్తుతం ఈ ప్రయత్నం టెండర్ల దశలోనే ఉన్నది. ఇప్పటికే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-1 కింద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీటిని నగరానికి తరలిస్తుండగా, తాజాగా పథకం రెండో దశ ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 15 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉన్నది. మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు 5 టీఎంసీలను ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పంప్ హౌస్‌లు, సబ్ స్టేషన్లు, నీటి శుద్ధి కేంద్రాలు, భారీ పైపు‌లైన్స్‌ నిర్మించనున్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ -1 ద్వారా 163 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.

ఏడాదిలో 16.43 లక్షల వాటర్ ట్యాంకర్ల ట్రిప్పులు
గతేడాది జనవరిలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరగటంతో అప్రమత్తమైన జలమండలి అధికారులు అప్పటికే అందుబాటులో ఉన్న ట్యాంక‌ర్లు, డ్రైవ‌ర్లు, ఫిల్లింగ్ స్టేష‌న్లు, పాయింట్లు పెంచి, డిమాండ్‌కు తగిన విధంగా ట్యాంకర్లను సరఫరా చేసింది. జ‌ల‌మండ‌లి ప‌రిధిలో గత సంవత్సరం డిసెంబర్ వరకున్న దాదాపు 733 కి పైగా ట్యాంక‌ర్లు, 78 ఫిల్లింగ్ స్టేషన్లతో గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ నెలాఖరు కల్లా మొత్తం 16 లక్షల 43 వేల 660 ట్యాంకర్ల ట్రిప్పులను డెలివరీ చేసినట్లు అధికారులు తెలిపారు.

 

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?