water crisis
హైదరాబాద్

Water Crisis: పొంచి ఉన్న నీటి ముప్పు

  • రంగారెడ్డిలో ఇష్టారాజ్యంగా నీటిని తోడేస్తున్న పరిశ్రమలు!
  • అడుగంటుతున్న భూగర్భజలాలతో సర్కారు అప్రమత్తం
  • పరిశ్రమలు, మాల్స్​‍, రిసార్ట్స్‌లో నీటి వృథాకు అడ్డుకట్ట
  • బోర్లకు మీటర్లు పెట్టేందుకు భూగర్భజల శాఖ కసరత్తు
  • ఇప్పటికే జిల్లాలో మొదలైన ప్రక్రియ

Water Crisis: భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతుండటం ఆందోళన కల్గిస్తున్నది. నీటి పరిరక్షణకు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తు తరాలకు ముప్పు వాటిల్లనుంది. ఈ ఉపద్రవానికి ముందే చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. నీటి వృథాను అరికట్టే దిశగా చర్యలకు పూనుకున్నది. ముఖ్యంగా పరిశ్రమలు, పెద్ద పెద్ద మాల్స్‌‍, రిసార్ట్స్‌లలో వివిధ అవసరాల నిమిత్తం బోర్ల నుంచి విచ్చలవిడిగా నీటిని తోడుతుండటంతో.. నియంత్రించేందుకుగాను బోర్లకు మీటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే మొదలైంది. భూగర్భజల శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టి బోర్లకు నీటి మీటర్లను ఏర్పాటు చేయిస్తున్నారు.

వృథాకు అడ్డుకట్ట

రంగారెడ్డి జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, భారీ, మెగా పరిశ్రమలు కలిపి మొత్తం 4,428 వరకు ఉన్నాయి. పరిశ్రమల నిర్వహణ కోసం ఇష్టానుసారంగా బోరు బావులను తవ్వుతున్నారు. పరిశ్రమలు స్థాపించే సమయంలో ఒకటి, రెండు బోర్లకు మాత్రమే అనుమతులు పొంది ఆ తర్వాత పెద్ద సంఖ్యలో బోర్లు వేసుకుని వాడుకుంటున్నారు. ఆయా బోర్ల నుంచి జలాలను ఇష్టం వచ్చినట్లు తోడేస్తుండటంతో.. ఈ ప్రభావం భూగర్భజలాలపై పడుతున్నది. వాస్తవానికి ఎన్ని బోర్లు అవసరం? నిత్యం ఎన్ని లీటర్ల నీటిని వాడుకుంటున్నారు? తదితర విషయాలను ఎప్పటికప్పుడు పరిశ్రమల నిర్వాహకులు తెలియపర్చాల్సి ఉంటుంది. కానీ..ఇది ఎక్కడా అమలు కావడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే..పొంచి ఉన్న నీటి ముప్పును ముందే గ్రహించి నీటి లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. వెయ్యి లీటర్లకు ప్రభుత్వం నిర్దేశించిన మేర రుసుమును పరిశ్రమల నిర్వాహకులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి రెన్యూవల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంతో వృథా నీటికి అడ్డుకట్ట పడటంతోపాటు ప్రభుత్వానికి కొంతమేర ఆదాయం సమకూరనున్నది.

విడుతల వారీగా అమలు

భూగర్భజల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశ్రమల్లోని బోర్లను పరిశీలిస్తున్నారు. పరిశ్రమల నిర్వాహకులు వాడుకుంటున్న బోర్ల లెక్కలను తీస్తున్నారు. అనుమతులు ఉన్నవి ఎన్ని? లేనివి ఎన్ని? అన్న వివరాలను సేకరిస్తున్నారు. అనుమతులు లేకపోతే నోటీసులు జారీ చేసి బోర్లకు నీటి మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 400లకు పైగా పరిశ్రమలు టీజీఐపాస్ ద్వారా అనుమతులు పొంది ఉండటంతో వాటికి మీటర్లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరో 200 పరిశ్రమలకు ఎటువంటి అనుమతులు లేకపోవడంతో వాటన్నింటికీ నోటీసులు అందజేశారు. వాటిల్లో ఇప్పటికే 125పైగా పరిశ్రమలకు మీటర్ల ఏర్పాటుపై చర్యలు మొదలైనట్లు అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలతోపాటు కొంతమంది రిసార్ట్స్‌ నిర్వాహకులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌‍లు, ఫంక్షన్‌హాళ్లు, హోటళ్లు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు, రైస్ మిల్లుల నిర్వాహకులు బోర్ల ద్వారా పెద్ద ఎత్తున నీటిని వాడుకుంటున్నారు. ఈ క్రమంలో వీటిపైననూ అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే జిల్లాలో 24 రిసార్ట్స్‌ను గుర్తించి నోటీసులిచ్చారు. 19 మంది రిసార్ట్స్‌ నిర్వాహకులు బోర్లకు మీటర్లు ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. విడతల వారీగా బోర్ల ద్వారా నీటిని వాడుకుంటున్న వారందరూ మీటర్లు ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి అని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు భూగర్భజల శాఖ అధికారులు చెబుతున్నారు.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?