KBR Park
హైదరాబాద్

KBR Park: కేబీఆర్ పార్కు చుట్టూ.. ట్రా ‘ఫికర్’కు చెక్ – ఏడు ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్‌లు

⦿ విజిబుల్ డెవలప్‌మెంట్‌పై సర్కారు నజర్
⦿ సమీపిస్తున్న బల్దియా ఎన్నికలు..
⦿ అభివృద్ధి పనులపై ప్రభుత్వం ఫోకస్
⦿ స్పీడప్ కానున్న కేబీఆర్ చుట్టూ హెచ్ సిటీ-1 పనులు
⦿ ఏడు ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్‌లు
⦿ స్టీల్‌తోనే నిర్మించేందుకు బల్దియా ప్లాన్
⦿ టెండర్ల ప్రక్రియ చేపట్టనున్న జీహెచ్ఎంసీ
⦿ స్థల సేకరణకు పూర్తయిన మార్కింగ్
⦿ నటుడు బాలకృష్ణ, మాజీ మంత్రి జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్
⦿ రేపు ఆమోదం తెలపనున్న స్టాండింగ్ కమిటీ!

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం చివరి సంవత్సరం కావటంతో రానున్న బల్దియా ఎన్నికలకు సర్కారు ఇప్పటి నుంచే అలర్ట్ అయింది. నగరంలో అత్యధికంగా ట్రాఫిక్ సమస్య ఉండే జంక్షన్లలో ఒకటైన జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి వీలైనంత త్వరగా విజిబుల్ డెవలప్‌మెంట్ పనులను చేపట్టే దిశగా సర్కారు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి పార్కు చుట్టూ సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఏడేళ్ల క్రితం జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కు చుట్టూ ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం (ఎస్ఆర్ డీపీ) కింద ప్రతిపాదించిన పనులకు ఇప్పటి వరకు ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీంతో జీహెచ్ఎంసీలోని అన్ని రకాల అభివృద్ది పనులను హెచ్ సిటీ-1 కిందకు తీసుకువచ్చి, ఈ పనులు చేపట్టాలని సర్కారు ఆదేశించింది. పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా ఏడు ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వీటిని మామూలుగా సిమెంట్, కాంక్రీట్‌తో నిర్మిస్తే సమయం ఎక్కువ పట్టే అవకాశముండటంతో స్టీల్‌తో నిర్మించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నది. వచ్చే డిసెంబర్ నెలాఖరు వరకు రాకపోకలు సాగించే నగరవాసులకు ఈ పనులు స్పష్టంగా కనిపించే స్థాయిలో చేపట్టాలని ఇప్పటికే సర్కారు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ పనులు తమకు కలిసొస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలిసింది.

త్వరలోనే స్థల సేకరణ షురూ..
పార్కు చుట్టూ చేపట్టాల్సిన ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణానికి మొత్తం 86 ఆస్తుల నుంచి స్థల సేకరణ చేసేందుకు అధికారులు మార్కింగ్ చేశారు. పార్కు చుట్టూ నిర్మించనున్న ఏడు ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్‌లలో భాగంగా తొలి దశగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి సినీ నటుడు బాలకృష్ణ నివాసం వరకు రాకపోకలు వేగంగా సాగేందుకు వీలుగా స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం బాలకృష్ణ నివాసానికి మార్కింగ్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి చెక్ పోస్టు మీదుగా మాదాపూర్ వెళ్లే దారిలో మరో ఫ్లై ఓవర్‌ను కూడా నిర్మించనున్నారు. ఈ రెండు ఫ్లై ఓవర్లు ఎక్స్ ఆకారంలో నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే అపోలో హాస్పిటల్ సమీపంలోని మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి కూడా అధికారులు మార్కింగ్ చేశారు. మొత్తం 86 ఆస్తుల నుంచి స్థల సేకరణ చేసి, నష్ట పరిహారాన్ని జీహెచ్ఎంసీ చెల్లించనుంది. ఇందుకు గాను కొత్త ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్‌లో రూ.790 కోట్లను స్థల సేకరణకు కేటాయించారు. త్వరలోనే ఫీల్టు లెవల్ స్థలాల సేకరణ ప్రక్రియ మొదలుపెట్టేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తున్నది.

23న స్టాండింగ్ కమిటీ ఆమోదం..
ఫ్లై ఓవర్ చుట్టూ నిర్మించనున్న ఏడు ఫ్లై ఓవర్లతో పాటు ఏడు అండర్ పాస్‌ల కోసం రూ.1090 కోట్లను అంచనా వ్యయం కాగా, ఇందులో రూ.580 కోట్లతో నిర్మాణ పనులు, మిగిలిన రూ.510 కోట్లతో స్థల సేకరణ, యుటిలిటీలను మార్చే పనులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఇందులో సర్కారు ఇప్పటికే సుమారు రూ.825 కోట్లకు మాత్రమే పరిపాలనపరమైన అనుమతులిచ్చింది. మిగిలిన అంచనా వ్యయం కోసం జీహెచ్ఎంసీ ఈ నెల 23న జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో మంజూరు చేసి, తదుపరి పరిపాలనపరమైన అనుమతుల కోసం సర్కారుకు పంపనున్నారు. వచ్చే డిసెంబర్ 20 నాటికి కౌన్సిల్ పదవీకాలం ముగియనున్నందున, అంతకన్నా ముందే కేబీఆర్ పార్కు చుట్టూ అభివృద్ది పనులను కొలిక్కి తీసుకువచ్చి, పదవీకాలం ముగిసిన తర్వాత అవసరమైతే జీహెచ్ఎంసీ ఎన్నికలకు కొంత సమయమిచ్చి, ఈ పనులు పూర్తయ్యాకే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం