Hyderabad Roads: హైదరాబాద్ నగరంలో రోడ్ల నిర్వహణ భేష్ గా ఉందని, రోడ్డు భద్రతా చర్యలు అభినందనీయమని జీహెచ్ఎంసీని సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ప్రశంసించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతా చర్యల అమలులో కార్పొరేషన్ చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నగరంలోని బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్‌లో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు, హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, డీజీపీ డా. జితేందర్, పురపాలక కార్యదర్శి ఇలంబరితి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌తో పాటు పోలీసు, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, రవాణా శాఖ, ఆర్ అండ్ బీ, ట్రాఫిక్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read: Charlie Kirk: ట్రంప్ సన్నిహితుడు దారుణ హత్య.. భవనం పైనుంచి షూట్ చేసిన అగంతకుడు
రోడ్డు ప్రమాదాల్లో ఎవ్వరూ చనిపోకుండా చూడాలి
ఈ సందర్భంగా జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే మాట్లాడుత, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ఇతరుల ప్రాణాలను మనం కాపాడితే, భగవంతుడు మన ప్రాణాలను కాపాడతాడు అనే భగవద్గీత లోని ఓ వాక్యాన్ని సమావేశంలో చైర్మన్ ప్రస్తావించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో ఎవ్వరూ చనిపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. సమావేశంలో పలు శాఖలు రోడ్డు భద్రతా చర్యలపై తమ శాఖ తీసుకున్న చర్యలను వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చేపట్టిన రోడ్డు భద్రతా కార్యక్రమాలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చైర్మన్ కు వివరించారు.
1,687.76 కి.మీ రోడ్లపై లేన్ మార్కింగ్
రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు, ప్రయాణికులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు నగరంలో 1,687.76 కి.మీ రోడ్లపై లేన్ మార్కింగ్, 3 వేల 949 జీబ్రా క్రాసింగ్స్, 3 వేల 453 ప్రదేశాల్లో బార్ గుర్తులు, మరో 3 వేల 335 సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వివరించారు. ప్రధాన రోడ్లలో ప్రతి సంవత్సరానికి ఒకసారి లేన్ మార్కింగ్ చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. పాదచారుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. నగరంలో 212.71 కి.మీ మేర కొత్తగా ఫుట్‌పాత్‌లు వేసినట్లు, మరమ్మత్తులు చేపట్టామన్నారు. 23 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణం చేపట్టి ఇప్పటికే 15 పూర్తి చేశామన్నారు.
1,442 గుంతలు పూడ్చివేసి, 574 క్యాచ్‌పిట్ మరమ్మతులు
50 కూడళ్ల అభివృద్ధి పనులు ఇప్పటి వరకూ పూర్తి చేశామన్నారు. నగరవ్యాప్తంగా 92 బ్లాక్ స్పాట్లను గుర్తించి, ఇప్పటికే 75 బ్లాక్ స్పాట్ లలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రోడ్డు భద్రతా డ్రైవ్ లో భాగంగా జూలై 2025 నుంచి ఇప్పటి వరకు 1,442 గుంతలు పూడ్చివేసి, 574 క్యాచ్‌పిట్ మరమ్మతులు, 328 క్యాచ్‌పిట్ కవర్లు మార్చడం, 12 సెంట్రల్ మీడియన్ పనులు పూర్తి చేశామన్నారు. గత, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరాల్లో రోడ్డు నెట్ వర్క్ బలోపేతం పై దృష్టి పెట్టామని కమిషనర్ వివరించారు.
అబిడ్స్, ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, టోలిచౌకీ ఫ్లైఓవర్, సనత్‌నగర్, మాధాపూర్, సికింద్రాబాద్, సైదాబాద్ ప్రాంతాల్లో తారు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని కమిషనర్ చైర్మన్ కు నివేదించారు. కమిషనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ఛైర్మన్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే, జిహెచ్ఎంసీ రోడ్డు భద్రతా చర్యలను అభినందిస్తూ, ప్రమాదాల నివారణలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి హాజరయ్యారు.
Also Read: Hydra: కూకట్ పల్లిలో రూ. వంద కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం