AV Ranganath: చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్ పరిధిలో మట్టి వేసి కబ్జాలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) హెచ్చరించారు. ఆయన తెల్లాపూర్‌లోని మేళ్ల చెరువు, గండిపేట చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువుల స్వరూపాన్ని మార్చాలని చూస్తే ఉపేక్షించబోమని, మట్టి పోసిన వారితోనే తిరిగి దానిని తీయించి, వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. గండిపేట చెరువులో హిమాయత్ నగర్ గ్రామం వైపు డాక్టర్ ఖుర్షీద్ అనే వ్యక్తి మట్టి పోయడాన్ని కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. 48 గంటల్లోగా ఆ మట్టిని తొలగించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే మేళ్ల చెరువులో మట్టి పోసిన రాజు యాదవ్ అనే వ్యక్తికి కూడా తక్షణమే మట్టిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా అన్ని చెరువుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
Also Read: AV Ranganath: ఉత్తమ విధులు నిర్వర్తించిన మెట్ టీమ్‌లను.. అభినందించిన హైడ్రా కమిషనర్ రంగనాధ్!
జూబ్లీహిల్స్‌లో పార్కు కబ్జాల తొలగింపు
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 32లోని సుమారు రెండు ఎకరాల పార్కులో జరిగిన ఆక్రమణలను హైడ్రా, జీహెచ్‌ఎంసీ సిబ్బందితో కలిసి తొలగించింది. పార్కును ఆనుకుని ఉన్న నివాసితులు తమ వ్యక్తిగత అవసరాల కోసం (వాచ్‌మెన్ రూమ్‌లు, ఆవుల షెడ్లు) పార్కును కబ్జా చేయడాన్ని గమనించిన కమిషనర్, వెంటనే వాటిని కూల్చివేయించారు. పార్కులోకి ఉన్న ప్రైవేట్ గేట్లను తొలగించి, ప్రహరీ నిర్మించాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ప్రధాన గేటును ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
బుల్కాపూర్ నాలా పునరుద్ధరణ
హుస్సేన్ సాగర్‌కు వర్షపు నీటిని చేరవేసే చారిత్రక బుల్కాపూర్ నాలాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. మణికొండ ప్రాంతంలో ఈ నాలా కబ్జాకు గురవుతుందన్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు. శంకర్పల్లి నుంచి హుస్సేన్ సాగర్ వరకు సాగే ఈ నాలాను పునరుద్ధరించడం ద్వారా పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
Also Read: AV Ranganath: ఉత్తమ విధులు నిర్వర్తించిన మెట్ టీమ్‌లను.. అభినందించిన హైడ్రా కమిషనర్ రంగనాధ్!

