Fake visas Passports: గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేర పాస్ పోర్టులను టాంపర్ చేయటంతోపాటు నకిలీ వీసాలు సృష్టిస్తూ లక్షలు కొల్లగొడుతున్న గ్యాంగులోని ఇద్దరిని ఎయిర్ పోర్టు పోలీసులు, శంషాబాద్ ఎస్వోటీ అధికారులు కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 14 పాస్ పోర్టులు, 14 పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లతోపాటు మరికొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వెస్ట్ గోదావరి పెనుగొండ మండలానికి చెందిన సత్యనారాయణ, ఆసిఫ్ నగర్ నివాసి అంజి, చిలుకూరి బాలాజీ (43), సుంకర శివకుమార్ (30), గోపాల్ కలిసి తేలికగా డబ్బు సంపాదించేందుకు ఒక ముఠాగా ఏర్పడ్డారు.
Also Read: Kancha Gachibowli Land Case: కంచ గచ్చిబౌలి భూముల కేసు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు!
పెద్ద జీతాలకు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేసుకున్నారు. విదేశీ ఉద్యోగం మోజులో తమ వద్దకు వచ్చిన వారి నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బు తీసుకుంటూ వారి పాస్ పోర్టులను టాంపరింగ్ చేయటంతోపాటు నకిలీ వీసాలు సృష్టించి ఇస్తున్నారు. ఇదేవిధంగా వెస్ట్ గోదావరికి చెందిన గండికోట వెంకట రమణి (38)తోపాటు మరో ఏడుగురికి కువైట్ లో ఉద్యోగం ఇప్పిస్తామని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు.
అయితే, ఎయిర్ పోర్టులో జరిపిన తనిఖీల్లో వీసాలు నకిలీవని తేలటంతో అధికారులు వారిని వెనక్కి పంపించి వేశారు. ఈ మేరకు వెంకట రమణి ఫిర్యాదు చేయగా ఎయిర్ పోర్టు పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం శంషాబాద్ ఎస్వోటీ అధికారులతో కలిసి దర్యాప్తు చేసి ముఠాలోని చిలుకూరు బాలాజీ, సుంకర శివకుమార్ లను అరెస్ట్ చేశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు