తల్లిని చంపిన తనయుడు
– మద్యం మత్తులో దుర్మార్గం
రాజేంద్రనగర్, స్వేచ్ఛ: Hyderabad Crime: కనిపెంచిన కన్నతల్లిని ఓ దుర్మార్గుడు మద్యం మత్తులో దారుణంగా హత్య చేసిన సంఘటన ఆర్.జి.ఐ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని రాళ్లగూడలో ప్రకాష్ (35) తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. గతంలో ఇద్దరు భార్యలు అతడిని విడిచి వెళ్లిపోగా మూడో భార్యని చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రకాష్ కొంతకాలంగా పని పాట చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు.
ప్రతిరోజు మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను వేదించసాగాడు. గతంలో అతడి తండ్రి మృతి చెందాడు. ఇలా ఉండగా బుధవారం రాత్రి 10 గంటలకు ప్రకాష్ తన తల్లి చంద్రకళ (55)తో మద్యం మత్తులో మరోసారి గొడవపడ్డాడు. ఈ క్రమంలో కర్ర, సిలిండర్ తో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. హత్య సమాచారం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ బాలరాజు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.