తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Sitarampur Man Suicide: మూడే మూడు నెలలు…కింగ్567 అనే బెట్టింగ్ యాప్ లో జూదం ఆడి 92 లక్షలు పోగొట్టుకున్నాడు షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామ నివాసి…బీఏ విద్యార్థి హర్షవర్ధన్. ఆ తరువాత ఇంట్లోవాళ్లకు ఏం చెప్పాలో అర్థంగాక ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో పరిహారంగా ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం హర్షవర్ధన్ బెట్టింగుల్లో పోగొట్టుకోవటంతో ఆ కుటుంబం రోడ్డుపాలైంది. ఇలాంటి ఉదంతాలు ఎన్నో…ఎన్నెన్నో. ఈ ఒక్కటే కాదు…ఇలాంటి ఎన్నో విషాదాలకు కారణమవుతున్న బెట్టింగ్ యాప్ లను టాలీవుడ్ హీరో, హీరోయిన్లు, బుల్లితెర యాంకర్లు, ఇన్ ఫ్యూయెన్సర్లు ప్రమోట్ చేయటంపై జనం నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కోట్ల రూపాయలకు పడగలెత్తినా కొన్ని లక్షల రూపాయల కోసం ఇలాంటి బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తారా? అంటూ నెటిజన్లు ఛీ కొడుతున్నారు. కేసులు నమోదైన తరువాత ఇలా చేయటం తప్పని చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. వీళ్లది కాసిన్ని కాసుల కోసం పడ్డ కక్కుర్తే అని వ్యాఖ్యానిస్తున్నారు.
Also read: CPI Narayana: మెగాస్టార్ చిరంజీవినే భయపెట్టా.. మీరెంత?.. అంటూ నారాయణ వార్నింగ్
రాణా దగ్గుపాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్…అందరూ టాలీవుడ్ స్టార్లు. చేసిన సినిమాల ద్వారా కోట్లు సంపాదించారు. బుల్లితెర యాంకర్లు, నటులు అయిన విష్ణుప్రియ, రీతూ చౌదరి, శ్రీముఖి, టేస్టీ తేజ తదితరులవి కూడా దేనికీ లోటు లేని జీవితాలే.
సాధారణంగా సినీ తారలు, బుల్లితెర నటులు, యాంకర్లకు అభిమానులు వేలల్లోనే ఉంటారు. అనునిత్యం వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే వీళ్ల ఫాలోవర్ల సంఖ్య వేలు…లక్షల్లో ఉంటుంది. సరిగ్గా దీనినే ఆదాయ మార్గంగా చేసుకున్నారు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన టాలీవుడ్, బుల్లితెర సెలబ్రెటీలు. వేర్వేరు బెట్టింగ్ యాప్ ల నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకుని వాటిని ప్రమోట్ చేశారు.
ఆయా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ తీసిన వీడియోలను తమ తమ సోషల్ అకౌంట్లలో అప్ లోడ్ చేశారు. దీని కోసం ప్రధానంగా ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ లను ఉపయోగించుకున్నారు. ఇలా తమ అభిమాన తారలు పెట్టిన వీడియోలు చూసి వారిని ఫాలో అవుతున్న వారిలో చాలామంది ఆయా యాప్ లలో బెట్టింగులు పెట్టి డబ్బు పోగొట్టుకుని ఉంటారని పోలీసులు చెబుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుని ఉండవచ్చని అంటున్నారు.
Also read: Betting Apps: రీతూ చౌదరి, విష్ణుప్రియలకు పోలీసులు సంధించిన ప్రశ్నలివే..!
ఇప్పుడు కేసులు నమోదైన తరువాత బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయటం చట్టరీత్యా నేరమన్న విషయం తమకు తెలియదన్న టాలీవుడ్ స్టార్లు, బుల్లితెర నటులు చెబుతున్నమాటలు అర్దరహితమైనవని వ్యాఖ్యానిస్తున్నారు. బెట్టింగ్ యాప్ ల బారిన పడి రోడ్లపాలైన కుటుంబాలు…ప్రాణాలు తీసుకున్న వారి ఉదంతాలు తరచూ మీడియాలో వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయటం తప్పని తమకు తెలియదని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు.
చట్టరీత్యా తప్పన్న విషయం తెలియక పోయినా తాము చేస్తున్న ప్రమోషన్లు నైతిక విలువలకు విరుద్ధమని తెలియదా? అని వ్యాఖ్యానిస్తున్నారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన వారిలో ఏ ఒక్కరు కూడా వాటి ద్వారా జూదం ఆడి ఉండరన్నారు.
ఫిర్యాదులు వస్తే మరింత తీవ్రమైన కేసులు…
బెట్టింగ్ యాప్ ల బారిన పడి సర్వస్వం కోల్పోయిన వారు…ఆత్మహత్యలు చేసుకున్న యువకుల కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలని ఓ సీనియర్ పోలీస్ అధికారి సూచించారు. ఫలానా యాప్ కారణంగా డబ్బు పోగొట్టుకున్నామని, కుటుంబ సభ్యున్ని కోల్పోయామని తెలియచేస్తే ఆ యాప్ ను ప్రమోట్ చేసింది ఎవరు? అన్న విషయాన్ని బయటకు తీస్తామన్నారు. అప్పుడు యాప్ ను ప్రమోట్ చేసిన వారిపై మరింత తీవ్రమైన కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందన్నారు.