Medchal News: పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం..ప్యాకర్స్ మూవర్స్ పేరుతో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను షామీర్ పేట్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో డిసిపి కోటిరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. బోయిన్ పల్లికి చెందిన ప్రదీప్ కుమార్ తన బొలేరో వాహనాన్ని ప్యాకర్స్ మూవర్స్ పని కోసం ఉపయోగిస్తూ ఉండేవాడు.
అదే ప్రాంతానికి చెందిన సన్నీ, మనీష్ కుమార్ లతో ప్రదీప్ కుమార్ కు పరిచయమైంది. ఈ క్రమంలో బొలెరో వాహనానికి డ్రైవర్ గా సన్నీ, హెల్పర్ గా మనీష్ కుమార్ పని చేస్తున్నారు. గత నెల మార్చి 31న ప్రదీప్ కుమార్ హర్యానా రాష్ట్రానికి చెందిన సాహిల్ తో కలిసి ఒడిశా రాష్ట్రానికి వెళ్లి అక్కడ సుభాష్ అనే వ్యక్తిని కలిసి 273 కిలోల గంజాయిని లక్షా 30 వేల రూపాయలు చెల్లించి కొనుగోలు చేశాడు.
Also read: Ramam: ‘విశ్వం’ తర్వాత ‘రామం’.. ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్!
ఒడిశా నుంచి హర్యానకు తెలంగాణ రాష్ట్రం మీదుగా హర్యాన, పంజాబ్ లకు చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా రవాణా చేస్తున్నారని పక్క సమాచారం అందడంతో శనివారం షామీర్ పేట్ ఓఆర్ఆర్ వద్ద ఎస్ఓటి, షామీర్ పేట్ పోలీసులు, సైబరాబాద్ బృందం సంయుక్తంగా బొలెరో వాహనం లో తరలిస్తున్న గంజాయి పట్టుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి 273 కిలోల గంజాయి, బొలెరో వాహనం, మొబైల్ ఫోన్లు, జియో డంగిల్ స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి చెప్పారు. వీటి విలువ మొత్తం దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ప్రజలు గంజాయి అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్ 9490617444 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని డిసిపి కోరారు.