Ramachandra Rao: హైదరాబాద్ సంస్థానాన్నే కాకుండా దేశంలోని దాదాపు 560 సంస్థానాలను ఏకం చేసి ‘అఖండ భారత్’ నిర్మించిన మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలో ఆదివారం నిర్వహించిన ‘సర్దార్ @ 150 యూనిటీ మార్చ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. సీతాఫల్ మండి శివాజీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ చిలకలగూడ గాంధీ విగ్రహం వద్ద ముగిసింది. అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణతో సర్దార్ వల్లభాయ్ పటేల్ కు విశేష అనుబంధం ఉందని, అప్పటి నైజాం సర్కారు దమనకాండకు ముగింపు పలికించడానికి జరిగిన ఆపరేషన్ పోలోకు కీలకం పటేలేనని పేర్కొన్నారు.
Also Read: Automobile Facts: ఆటో రిక్షాలకు ఎందుకు మూడు చక్రాలే ఉంటాయో తెలుసా?
స్వాతంత్ర్య సమరంలో..
ఆ సమయంలో నిజాం ప్రభుత్వం పాకిస్తాన్‌లో విలీనం కావాలనే ప్రయత్నాలు చేస్తూ, ప్రజలపై దమనకాండను కొనసాగించిందని, పటేల్ కఠిన చర్యలతో నిజాం తల వంచి భారతదేశంలో భాగమయ్యేందుకు సిద్ధమయ్యాడని వివరించారు. సాంస్కృతిక, ధార్మిక, భౌగోళిక విభిన్నతతో ఉన్న దేశాన్ని ఒకే జాతీయత కింద ఐక్యం చేసిన వ్యక్తిత్వం వల్లభాయ్ దని కొనియాడారు. స్వాతంత్ర్య సమరంలో పటేల్ చేసిన త్యాగాలు, తరువాత భారతదేశ తొలి హోంమంత్రిగా దేశాన్ని ఏకత, సమగ్రత సాధించేలా తీసుకున్న నిర్ణయాలు భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయన్నారు. భారతదేశం అనేక త్యాగాలపై నిర్మితమైందని, దేశ నిర్మాణం వెనుక ఉన్న మహనీయుల త్యాగాలు యువతకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముకుంద్ రెడ్డి, సినీనటి ఖుష్బూ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, నాయకులు పీఎల్ శ్రీనివాస్, శ్యాంసుందర్ గౌడ్, మహిపాల్ రెడ్డి, బండారు విజయలక్ష్మి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పార్టీలకతీతంగా వేలాది మంది ప్రజలు ఈ యూనిటీ మార్చ్‌లో భాగస్వాములయ్యారు.
Also Read: Medchal: వెంచర్ కోసం నాలా కబ్జానా? ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నట్లు!

