Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎంతమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యువతకు ఈజీ మనీ ఆశ చూపి బెట్టింగ్ యాప్ నిర్వహకులు వారిని నిలువునా దోచేస్తున్నారు. వారి వద్ద నుంచి లక్షల్లో వసూలు చేసి రోడ్డున పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది యువత అప్పులపాలై తన జీవితాలను అర్ధంతారంగా ముగించిన ఘటనలు ఇటీవల కాలంలో చూస్తూనే ఉంది. ఇది చూసి కడుపుమండిన ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్.. తొలిసారి ఈ బెట్టింగ్ యాప్ ల దురాగతంపై స్పందించారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
సజ్జనార్ ప్రేరణతో..
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar).. బెట్టింగ్ యాప్స్ పై సమర శంఖం మోగించడంతో పోలీసుల్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. కాసుల కోసం బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తూ ఈ పాపంలో పాలు పంచుకున్న పలువురు సెలబ్రిటీలపై పోలీసులు కేసులు సైతం నమోదు చేశారు. ఈ క్రమంలో కడుపుమండిన ఓ సామాన్యుడు సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ సెలబ్రిటీలపై హైదరాబాద్ పంజాగుట్టు పోలీసు స్టేషన్ లో కేసు పెట్టాడు.
కేసు ఎవరిపైనంటే?
హైదరాబాద్ కు చెందిన సాధారణ సిటిజన్ అర్జున్ గౌడ్ (Arjun Goud).. గత కొన్ని రోజులుగా వార్తల్లో వస్తున్న బెట్టింగ్ యాప్ దురాగతాలు చూసి చలించిపోయాడు. సెలబ్రిటీలు డబ్బు కోసం ప్రమోషన్ల రూపంలో ప్రజలను ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారో చూసి రగిలిపోయాడు. ఈ క్రమంలో సజ్జనార్ ను ప్రేరణగా తీసుకొని బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన స్టార్ క్రికెటర్స్ సచిన్ (Sachin), విరాట్ కోహ్లీ (Virat Kohli)తో పాటు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) పై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అర్జున్ గౌడ్ రియాక్షన్
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్ పై ఫిర్యాదు అనంతరం సామాన్యుడు అర్జున్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఛోటా మోటా యూట్యూబర్లు, చిన్న స్థాయి సెలబ్రిటీలతో పాటు పెద్ద పెద్ద యాడ్స్ చేసి కోట్లు సంపాదిస్తున్న వారిపైనా కేసులు నమోదు చేయాలని సూచించారు. తన స్నేహితుల్లో కొందరు బెట్టింగ్ యాప్ లలో పెట్టుబడి నష్టపోయినట్లు ఆయన తెలిపారు. అందుకే ఒక సిటిజన్ గా సామాజిక బాధ్యతతో ఈ కేసు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఇకపై ఎవరూ కూడా ఇలా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయకుండా చర్యలు తీసుకోవాలని అర్జున్ గౌడ్ పోలీసులను కోరారు.
Also Read: Betting App Owners: బెట్టింగ్ యాప్స్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఏకంగా 19మందిపై..
ఓనర్లపై కేసు నమోదు
ఇదిలా ఉంటే తాజాగా బెట్టింగ్ యాప్ ఓనర్లు అయినా 19 మందిపై హైదరాబాద్ మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో వారిని అదుపులోకి తీసుకొని స్టేట్ మెంట్ రికార్డు చేసే అవకాశముంది. కాగా ఇప్పటికే మియాపూర్ పోలీసు స్టేషన్ లో 20 పైగా సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలను ఈ బెట్టింగ్ యాప్ కేసులకు సంబంధించి సాక్ష్యాలుగా వినియోగించుకోనున్నట్లు సమాచారం అందుతోంది.