Hydra: భాగ్యనగరంలో అభివృద్ధి చెందిన చెరువులను చూసి తమ ప్రాంతాల్లో ఉన్న చెరువులను కూడా అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. చెరువులు కబ్జా కాకముందే ముందస్తుగా పరిరక్షణ చర్యలు చేపట్టాలని మరికొందరు హైడ్రా (Hydra)ను కోరారు. చెరువులను అనుసంధానం చేసిన వరద కాలువలను పునరుద్ధరించాలని హైడ్రా (Hydra)ను అభ్యర్థిస్తున్నారు. ఒకప్పటి చెరువుల వైభవాన్ని చెబుతూ మంచినీటి సరస్సులుగా మార్చాలని కూడా కోరుతున్నారు. జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్, ప్రగతినగర్ చెరువు, కాటేదాన్‌లోని నూర్ మహమ్మద్‌కుంట, ఫిల్మ్‌నగర్ చెరువు ఇలా నగరం నలుమూలల నుంచి చెరువులను అభివృద్ధి చేయాలని డిమాండ్లు వస్తున్నట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
హైడ్రా ప్రజావాణికి 76 ఫిర్యాదులు
అంబర్‌పేటలోని బతుకమ్మకుంట, కూకట్‌పల్లి నల్లచెరువు, పాతబస్తీలోని బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు పర్యాటక ప్రాంతాలుగా మారాయని, తమ ప్రాంతంలో ఉన్న చెరువుల దుర్గంధాన్ని నివారించి, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని ప్రజావాణిలో వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే రహదారులు, పార్కుల ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులందినట్లు తెలిపారు. ఇలా సోమవారం హైడ్రా ప్రజావాణికి 76 ఫిర్యాదులందినట్లు తెలిపారు. వీటిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించి సంబంధిత అధికారులకు ఫిర్యాదుదారుల ముందే పరిష్కార బాధ్యతలను అప్పగించారు.
ఫిర్యాదులు ఇలా
జీడిమెట్ల పారిశ్రామిక వాడను ఆనుకుని ఉన్న ఫాక్స్ సాగర్ కబ్జాలను తొలగించి, మరో ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలని అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో కోరారు. తాగునీటితో పాటు సాగునీటిని అందించిన ఈ చెరువును పునరుద్ధరిస్తే అనేక మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా గౌరెల్లి గ్రామంలోని మాలకుంట చెరువును హైడ్రా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరారు. చెరువు కట్టను ధ్వంసం చేసి నీటిని బయటకు వదిలేసి ఆక్రమణలకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఎఫ్ టీఎల్ హద్దు రాళ్లు వేసి చెరువు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని మత్స్య పారిశ్రమిక సంఘం సభ్యులు కోరారు. అలాగే కొండాపూర్ సీఎంసీ లేఔట్‌లోని రహదారి ఆక్రమణ, పెద్దంబర్‌పేటలోని బాలాజీ లేఔట్ వద్ద 40 ఫీట్ల రహదారిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంపై ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేశారు. వెంటనే రోడ్లను పునరుద్ధరించి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Hydraa: ప్రగతినగర్ చెరువుకు ప్రాణం పోసిన హైడ్రా.. ఆనందంలో స్థానికులు

