Transfers In GHMC: గ్రేటర్ హైదరాబాద్ మహా నగర ప్రజలకు అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీలో బదిలీలు ఉత్తుత్తి ప్రక్రియగా మారాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్న శానిటరీ జవాన్లు, ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. నిన్నమొన్నటి వరకు పని చేసిన సీటును వదిలేది లేదని భీష్మించుకుంటున్నట్లు సమాచారం. పాత సీటులోని పోస్టింగ్ ల కోసం గోషామహాల్ సర్కిల్ లోని ముగ్గురు శానిటరీ జవాన్లు డిప్యూటీ కమిషనర్ మొదలుకుని, జోనల్ కమిషనర్ , అదనపు కమిషనర్ల వరకు మేనేజ్ చేసుకుని మళ్లీ వచ్చి వాలటంతో ఇతర సర్కిల్ నుంచి ఆ సీటులోకి బదిలీ అయిన జవాన్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.
డిప్యూటీ కమిషనర్, మెడికల్ ఆఫీసర్లను మేనేజ్ చేసుకుంటే చాలు ఏ సీటులోనైనా, ఎన్ని ఏళ్లయినా కొనసాగవచ్చునన్న శానిటరీ జవాన్లు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. ఒకే చోట ఏళ్ల దశాబ్దాల తరబడి విధులు నిర్వహిస్తున్న శానిటరీ జవాన్లకు స్థాన చలనం కల్గిస్తూ కమిషనర్ ఇలంబర్తి మూడు నెలల క్రితం ఆదేశాలు జారీ చేసినా, అవి ఎక్కడా అమలు కావటం లేదు. ఆయన ఆదేశాల ప్రకారం 168 మందిని వివిధ సర్కిళ్ల నుంచి ఇతర సర్కిళ్లకు బదిలీ చేయగా, బదిలీ అయిన మొత్తం జవాన్లలో కేవలం 20 నుంచి 30 శాతం మంది మాత్రమే బదిలీ అయిన చోట విధులు నిర్వహిస్తుండగా, కొందరు జవాన్లు ఉన్న చోటే కొనసాగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: Mahesh Kumar Goud: మన్మోహన్ సింగ్ ఫెలోషిప్.. యువతకు మంచి అవకాశం!
మరి కొందరు నిన్నమొన్నటి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ను అడ్డుపెట్టుకుని పాత సీట్లలోనే కొనసాగిన శానిటరీ జవాన్లు ఇపుడు డిప్యూటీ కమిషనర్, మెడికల్ ఆఫీసర్లను మేనేజ్ చేసుకుని మళ్లీ పాత స్థానంలోకి వచ్చి వాలుతున్నారు. ఫలితంగా వేరోక చోట నుంచి బదిలీ అయి అక్కడకు వచ్చిన శానిటరీ జవాన్లు ఎక్కడ విధులు నిర్వహించాలోనన్నది అయోమయం గందరగోళంగా మారింది. ఇదే రకంగా సీటును కాపాడుకునేందుకు గోషామహాల్ సర్కిల్ కు చెందిన ముగ్గురు శానిటరీ జవాన్లు ఏకంగా పైరవీ కారుల అవతారమెత్తారు.
స్థానికంగా ఉన్న మెడికల్ ఆఫీసర్ ను మేనేజ్ చేసుకుని, వీరు ఇంకా గోషామహాల్ సర్కిల్ లోనే కొనసాగుతున్నట్లు తెలిసింది. కమిషనర్ వీరి ట్రాన్స్ ఫర్ అర్డర్ ఇవ్వగానే స్థానిక డిప్యూటీ కమిషనర్ వీరిని గోషామహాల్ సర్కిల్ నుంచి రిలీవ్ చేయగా, పక్షం రోజుల పాటు ఈ ముగ్గురు శానిటరీ జవాన్లు బదిలీ అయిన మెహిదీపట్నం సర్కిల్ ఆఫీసుల్లో అటెండెన్స్ వేయించుకుని, తిరిగి గోషామహాల్ సర్కిల్ కు వచ్చి, విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Also Read: PG Medical Courses: టీజీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో.. పీజీ మెడికల్ కోర్సులకు గ్రీన్ సిగ్నల్!
కమిషనర్ చీవాట్లు పెట్టినా మారని వైనం
గోషామహాల్ సర్కిల్ లో విధులు నిర్వహిస్త్తూ, మూడు నెలల క్రితం బదిలీ అయినప్పటికీ, వారిని అక్కడే కొనసాగించాలని వీరు ఓ మంత్రితో కమిషనర్ ఇలంబర్తికి ఫోన్లు చేయించటంతో కమిషనర్ ఇలంబర్తి అప్పట్లో తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఫోన్ లో కమిషనర్ చీవాట్లు పెట్టినా, మారని ముగ్గురు శానిటరీ జవాన్లు రెండు రోజుల క్రితం మళ్లీ పైరవీ చేసుకుని మెహిదీపట్నం నుంచి పాత ప్లేస్ గోషామహాల్ సర్కిల్ లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
గోషామహాల్ సర్కిల్ లోని శానిటరీ జవాను సీటను వదులుకునేందుకు సిద్దంగా లేరంటే ఈ ముగ్గురు స్థానికంగా గోషామహాల్ సర్కిల్ లో ఏ స్థాయిలో అక్రమార్జనకు పాల్పడుతున్నారో అంచనా వేసుకోవచ్చు. మంత్రితో కమిషనర్ కు ఫోన్ చేయించినా, పని కాకపోవటంతో అప్పట్లో ఈ ముగ్గురు శానిటరీ జవాన్లు డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లను మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నలుగురు కలిసి పై స్థాయి అధికారులకు రూ. కోటి వరకు లంచం ఆఫర్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. తమను ఇక్కడ కొనసాగేందుకు పైరవీ చేస్తే రూ. కోటి ఇస్తామని కూడా మరో ప్రజాప్రతినిధికి ఈ ముగ్గురు శానిటరీ జవాన్లు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు