అందుబాటులో ఉండని ఆఫీసర్స్…
కొరవడిన జవాబుదారీతనం
ఆదేశాలిచ్చిన కమిషనర్ సైతం అదే బాటలో
నిరాశతో వెనుదిరుగుతున్న ప్రజాప్రతినిధులు, అర్జీదారులు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : జీహెచ్ఎంసీ (GHMC)లో పరిపాలన (Administration) ఇష్టారాజ్యంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సందర్శన వేళలైన (visiting Hours) మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిళ్లలోనూ అధికారులు (Officers) ప్రజలకు తప్పకుండా అందుబాటులో ఉండాలంటూ వారం రోజుల క్రితం కమిషనర్ (Commissioner) జారీ చేసిన ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. వివిధ రకాలైన సమస్యలు, అర్జీలతో అధికారులను కలిసేందుకు కార్యాలయానికి వచ్చే సందర్శకుల (visitors) కు, ప్రజాప్రతినిధుల (people Representatives)కు అధికారులు అందుబాటులో ఉండటం లేదన్న విషయాన్ని గుర్తించిన కమిషనర్ తప్పకుండా ఉండేలా ఆదేశాలిచ్చారు. కానీ అధికారులు మాత్రం కమిషనర్ ఆదేశాలను ఏ మాత్రం లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జోన్లు, సర్కిళ్లలో అదే తీరు, కమిషనర్ విధులు నిర్వర్తించే ప్రధాన కార్యాలయంలోనూ అదనపు కమిషనర్లు, పలు ఇతర విభాగాధిపతులు కనీసం ప్రజాప్రతినిధులకు సైతం అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలున్నాయి. అందుబాటులో ఉండాల్సిన సమయంలో కొందరు ఆఫీసర్లు బయటకు వెళ్తుండగా, మరి కొందరు యాంటీ రూమ్‌లలో విశ్రాంతికే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారం కొందరు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు (Corporators) జీహెచ్ఎంసీ నాలుగో అంతస్తులోని శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్‌ను కలిసేందుకు వచ్చారు. సార్ యాంటీ రూమ్‌లో ఉన్నారని ఒకరు , టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారని మరో సిబ్బంది రకరకాల సమాధానాలు చెప్పారు. అప్పటికే ఆ అధికారిని కలిసేందుకు వచ్చిన పది మంది, ఓ కార్పొరేటర్ వెయిటింగ్‌లో ఉన్నారు. చేసేదేమీ లేక అరగంట సేపు వేచి చూసి, వారంతా ఆ అధికారిని కలవకుండానే వెళ్లిపోయారు. మొత్తానికి సందర్శకులను కలవడం ఇష్టం లేకనే సదరు అధికారి యాంటీ రూమ్‌కు పరిమితమయ్యారని తెలిసింది.
ఆదేశాలిచ్చిన వారే పాటించరా?
జీహెచ్ఎంసీలో సాధారణంగా ఉన్నతాధికారులు పరిపాలన పరమైన, అభివృద్ధి పరమైన ఆదేశాలు జారీ చేసి ఇక తమ పనైపోయిందని భావిస్తుంటారన్న విమర్శలున్నాయి. ప్రస్తుతమున్న కమిషనర్ ఇలంబర్తి (Commissioner Ilambarithi) పై కూడా ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ స్థాయిల్లో అధికారులు సామాన్య సందర్శకులు, ప్రజాప్రతినిధుల కోసం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య సీట్లలోనే అందుబాటులో ఉండాలంటూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ సందర్శన వేళల్లో ఆయన కూడా అందుబాటులో లేకపోవటంతో ఆయన జారీ చేసిన ఆదేశాలు ఆయనే అమలు చేయకపోతే ఎలా? అంటూ సందర్శకులు ప్రశ్నిస్తున్నారు. అంబర్‌పేటలోని రఘునాథ్ నగర్‌లో ఓ పహిల్వాన్ బంధువు ఏకంగా రోడ్డును పది ఫీట్ల వరకు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు సుమారు వంద మంది స్థానికులు సోమవారం కమిషనర్‌ను కలిసేందుకు ప్రధాన కార్యాలయానికి దాదాపు నాలుగు గంటల సమయంలో వచ్చారు. కమిషనర్ అందుబాటులో లేరని, ఇప్పుడే బయటకెళ్లారని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించిన రఘునాథ్ నగర్ కాలనీ వాసులు కమిషనర్ ఎంట్రన్స్ ఎదుట ఆందోళనకు దిగారు. సందర్శన వేళల్లో జోన్లు, సర్కిళ్లలో అధికారులు అందుబాటులో లేకపోతే మున్ముందు దాదాపు అన్ని ఆఫీసుల ఎదుట ఇలాంటి ఆందోళనలే జరిగే అవకాశాలున్నాయి.