Kancha Gachibowli Land: కంచె గచ్చిబౌలి భూముల (Kancha Gachibowli Land) వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ భూములపై యాజమాన్య హక్కులు తమకే ఉన్నాయంటూ 78వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వారసులు సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ ను దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకోవటాన్ని సవాల్ చేశారు. కంచె గచ్చిబౌలిలోని వందలాది ఎకరాల భూమికి సంబంధించి సుప్రీం కోర్టులో కొన్నేళ్లపాటు కేసులు నడిచిన విషయం తెలిసిందే. కొంతకాలం క్రితం ఈ భూములు ప్రభుత్వానివే అని న్యాయస్థానం చెప్పటంతో ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంది.
Also Read: Gadwal District: ఇందిరమ్మ ఇళ్ల ఇసుక టిప్పర్ల నిలిపివేత.. కమిషన్ కోసమే అడ్డుకుంటున్నారా?
వివాదం మరోసారి సుప్రీం కోర్టుకు
ఆ తరువాత అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అయితే, అభివృద్ధి పేర భూముల్లో ఉన్న చెట్లను నరికి వేస్తున్నారని, వన్యప్రాణులకు గూడు లేకుండా చేస్తున్నారంటూ హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిపారు. దీనికి వేర్వేరు రాజకీయ పార్టీలు, సంఘాలు మద్దతు ఇచ్చాయి. దాంతో వివాదం మరోసారి సుప్రీం కోర్టుకు చేరింది. సుమోటోగా తీసుకుని దీనిపై విచారణ చేసిన సుప్రీం కోర్టు అభివృద్ధి పేర చెట్లను నరికి వేయటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. చెట్లను తొలగిస్తుండటంతో వన్యప్రాణులు ఆవాసాన్ని కోల్పోతున్నాయని పేర్కొంది. నరికి వేసిన చోట్ల స్థానంలో కొత్తగా మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేసింది. అలా చేయని పక్షంలో బాధ్యులైన అధికారులు అదే కంచె గచ్చిబౌలి భూముల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసే జైలుకు పంపించాల్సి ఉంటుందని హెచ్చరికలు కూడా జారీ చేసింది.
యజమాని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్
దాంతో పర్యావరణ పునరుద్ధరణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రభుత్వం సమగ్ర నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. తాజాగా, కంచె గచ్చిబౌలిలోని 2,725 ఎకరాల 23 గుంటల భూములకు నిజమైన యజమాని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అని తాజాగా ఆయన వారసులు చెబుతున్నారు. ఈ భూములపై యాజమాన్య హక్కులు తమకే ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకోవటాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో సోమవారం ఇంప్లీడ్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లీగల్ నోటీస్ కూడా జారీ చేసినట్టుగా అందులో పేర్కొన్నారు.
Also Read: BC Reservations: బీసీ రిజర్వేషన్లపై సర్కార్ సవాల్.. సుప్రీం విచారణపై ఉత్కంఠ?
