Crime News: ట్రై కమిషనరేట్ల పోలీసులకు వాంటెడ్ గా ఉన్న క్రిమినల్‌ను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సరూర్ నగర్ జిల్లెలగూడ ప్రాంతానికి చెందిన సుధీర్ (43) మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి ఎండీఏ(MDA) పూర్తి చేశాడు. తేలికగా డబ్బు సంపాదించటానికిగాను మోసాలు, దొంగతనాలను వృత్తిగా చేసుకున్నాడు. ఈ క్రమంలో ట్రై కమిషనరేట్ల పరిధుల్లోని వేర్వేరు చోట్ల నేరాలకు పాల్పడ్డ అతనిపై పది కేసులు నమోదై ఉన్నాయి.
ఆర్టీసీ సిబ్బందే టార్గెట్..
గతంలో ఏ ఠికాణా లేని సుధీర్ కొంతకాలంపాటు ఎంజీబీఎస్(MGBS) లోనే కాలం గడిపాడు. ఆ సమయంలో ఆర్టీసీ(RTC)లో డ్రైవర్లు, కండక్టర్లుగా పని చేస్తున్న పలువురితో పరిచయం చేసుకున్నాడు. ఆ సమయంలోనే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆర్టీసీ సిబ్బందిపై ఆన్ లైన్ ద్వారా ఎలా ఫిర్యాదులు చేయవచ్చో తెలుసుకున్నాడు. ఆ తరువాత డ్యూటీలో ఉన్న సమయంలో కొందరు కండక్టర్లు బస్ స్టేషన్ లో నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటుండగా వారి వీడియోలను రికార్డు చేశాడు. ఆ తరువాత తనను తాను ఆర్టీసీ విజిలెన్స్ ఆఫీసర్ గా బెదిరింపులు మొదలు పెట్టాడు.
Also Read: Rowdy Janardhana: ‘రౌడీ జనార్ధన’ టైటిల్ గ్లింప్స్.. బాబోయ్ అరాచకమే!
ఐపీఎస్ ఫోటోలను డీపీగా..
ఈ క్రమంలో గతంలో ఆర్టీసీ ఎండీగా పని చేసిన వీ.సీ.సజ్జనార్(VC Sajnar), ప్రస్తుతం ఎండీ నాగిరెడ్డి(MD Nagireddy) ఫోటోలను తన వాట్సాప్ ప్రొఫైల్ గా పెట్టుకున్నాడు. ఆ తరువాత నిద్రపోతూ తన కంటపడిన వారికి విజిలెన్స్ ఆఫీసర్ గా డ్యూటీలో నిర్లక్ష్యం కనబరిచినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో? వివరణ ఇవ్వాలంటూ బెదిరిస్తూ డబ్బు వసూళ్లు చేశాడు. ఈ మేరకు కొన్ని ఫిర్యాదులు రావటంతో దర్యాప్తు ప్రారంభించిన సీఐ జ్యోత్స్న, డీఐ మల్లేశంతో కలిసి నిందితున్ని అరెస్ట్ చేశారు.
గతంలో కోట్లల్లో మోసాలు..
సుధీర్ ను జరిపిన విచారణలో అతను గతంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ(Star Health Insurance Company)లో సేల్స్ మేనేజర్(Sales Manager) గా పని చేసినట్టుగా వెల్లడైంది. ఆ సమయంలో పదుల సంఖ్యలో జనానికి టోకరా ఇచ్చి 3కోట్ల రూపాయల మేర మోసం చేసినట్టుగా తెలిసింది. ఈ మేరకు అతనిపై మీర్ పేట పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదైనట్టు తెలియవచ్చింది. ఈ కేసులో అరెస్ట్ కూడా అయినట్టుగా తేలింది. బెయిల్ పై విడుదలైన తరువాత తప్పించుకు తిరుగుతున్న సుధీర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయి ఉన్నట్టుగా డీసీపీ బాలస్వామి(DCP Balaswami) చెప్పారు.
Also Read: GHMC: బల్దియాలో ఇంజినీర్ల కొరత.. పని భారంతో అల్లాడుతున్న అధికారులు

