GHMC: ఎప్పటికపుడు పరిధిని పెంచుకుంటూ విస్తరిస్తున్న జీహెచ్ఎంసీ(GHMC)లో ఇంజనీర్ల కొరత నెలకొంది. 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి ముందున్న పాత జీహెచ్ఎంసీ పరిధికి జీహెచ్ఎంసీలోని ప్రాజెక్టులు, మెయింటనెన్స్ ఇంజనీరింగ్ విభాగానికి మొత్తం 60 మంది ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ల(Executive Engineers)ను మంజూరు చేయగా, 30 సర్కిళ్లలో ప్రస్తుతం కేవలం 29 మంది ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు మాత్రమే పని చేస్తున్నట్లు సమాచారం. ఇక రకంగా మంజూరు చేసిన ఇంజనీర్ల సంఖ్యలో సగానికి తక్కువగానే ఉంది. రోజురోజుకి కొత్త ప్రాజెక్టులు వస్తుండటంతో ఒక వైపు మెయింటనెన్స్, మరో వైపు ప్రాజెక్టుల విభాగాల్లో ఈ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు పని భారంతో అల్లాడిపోతున్నట్లు సమాచారం.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్
ముఖ్యంగా మెయింటనెన్స్‌లో ఏడాది పొడువున వివిధ రకాల విధులు నిర్వహించాల్సి ఉండగా, ప్రాజెక్టుల విభాగంలో ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసేందుకు ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ల పాత్రే చాలా కీలకంగా మారింది. మెయింటనెన్స్ లో రోడ్లు, నాలాలు వంటి ఇతరాత్ర విధులుండగా, ప్రాజెక్టులకు సంబంధించి డిజైనింగ్ లు, గ్రౌండింగ్ కు సంబంధించిన విధులతో ఈ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు అల్లాడిపోతున్న సమయంలోనే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(Telangana Core Urban Region)పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీ(GHMC)లో విలీనం చేసింది. దీంతో ఇప్పటి వరకు 650 కిలోమీటర్ల వరకున్న జీహెచ్ఎంసీ విస్తీర్ణం, ఈ విలీనంతో ఏకంగా 2 వేల 50 కిలోమీటర్లకు పెరిగింది. ఈ పెరిగిన పరిధిలోని నాలాలు, రోడ్ల మెయింటనెన్స్ చేపట్టాలంటే సర్కారు గతంలో ఇంజనీరింగ్ విభాగానికి మంజూరు చేసిన 60 మంది ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరముంది.
Also Read: Deepu Chandra Das: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తి హత్యోదంతంలో సంచలనాలు వెలుగులోకి
జీహెచ్ఎంసీ పాత పరిధిలో..
జీహెచ్ఎంసీ పాత పరిధికి తగిన విధంగా ఇంజనీర్ల సంఖ్య లేకపోగా, పెరిగిన పరిధిలో ప్రస్తుతమున్న ఇంజనీర్లపై మెయింటనెన్స్ పరంగా, ప్రాజెక్టుల పరంగా అదనంగా పని భారం పెరగనుంది. విలీనం అనంతరం ఇప్పటికే ఇంజనీరింగ్ మెయింటనెన్స్ విభాగం 27 సర్కిళ్లుగా మారిన 27 పట్టణ స్థానిక సంస్థలోని రోడ్లు, అందులో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, నాలాల్లో చిన్న, మధ్య, భారీ తరహా నాలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విధులు నిర్వహిస్తూనే మళ్లీ జీహెచ్ఎంసీ పాత పరిధిలోని ప్రాజెక్టులు, మెయింటనెన్స్ విధుల నిర్వహణకు సమయం సరిపోక అల్లాడిపోతున్నట్లు తెలిసింది. సర్కారు జీహెచ్ఎంసీ పరిధిని పెంచిన విధంగానే గతంలో మంజూరు చేసిన 60 మంది ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ల లో ఇంకా కావల్సిన 31 మంది ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లను కేటాయించాలని జీహెచ్ఎంసీ కోరుతుంది. ఈ మేరకు త్వరలోనే సర్కారుకు ప్రతిపాదనలు కూడా పంపేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.
డీపీసీ ఏమైనట్టు?
ఇంజనీరింగ్ విభాగంలోని మెయింటనెన్స్, ప్రాజెక్టుల విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఇంజనీర్లలో అర్హులైన ఇంజనీర్లకు ఎప్పటికపుడు పదోన్నతులను కల్పించేందుకు డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ఇంకా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో డీపీసీ ఏర్పాటు చేయకపోవటానికి కారణమేమిటీ? అంటూ పదోన్నతులకు అర్హులైన ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు. ఇంజనీరింగ్ వింగ్ హెడ్ వెంటనే డీపీసీని ఏర్పాటు చేయాలని పదోన్నతులకు అర్హత కల్గిన ఇంజనీర్లు కోరుతున్నారు. ఈ విషయంపై కూడా త్వరలోనే సర్కారుకు ఓ వినతి పత్రాన్ని సమర్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
Also Read: Ponguleti Srinivas Reddy: భూభారతి పోర్టల్‌తో అనుసంధానం.. ఒక్క క్లిక్‌తో రైతులకు పూర్తి భూసమాచారం!

