Kite Festival: సంక్రాంతి సంబురాలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ముస్తాబు అయ్యింది. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. సెలబ్రేట్ ది స్కై పేరుతో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి కైట్ ప్లేయర్స్ నగరానికి చేరుకున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ మూడు రోజులపాటు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు పతంగులు వేగరవేయనున్నారు. నేడు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, ఎండీ వల్లూరు క్రాంతితో కలిసి ఈ ఫెస్టివల్‌ను ప్రారంభించనున్నారు. తెలంగాణ సంస్కృతి, ఫెస్టివల్‌లో 18 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నారు. దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 55 మంది నేషనల్ కైట్ ఫ్లయర్స్ పాల్గొంటున్నారు. ప్రజలకు ఉచిత ప్రవేశం ఉంటుంది. పతంగుల పండతోపాటు కల్చర్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ (సీఎల్ఐసీ) సహకారంతో స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటలు, పంజాబ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు నోరూరించే పిండివంటలు రెడీ చేస్తున్నారు. గృహిణులు తమ ఇళ్లలో తయారు చేసిన సుమారు 1,200 రకాల మిఠాయిలు, తెలంగాణ సంప్రదాయ పిండి వంటలను ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా 60 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటితోపాటు చేనేత, హస్తకళల కోసం మరో 100 స్టాల్స్ అందుబాటులో ఉండనున్నాయి. సందర్శకుల కోసం ప్రతిరోజూ తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.
Also Read: Minister Ponguleti: రాష్ట్రంలో అక్రమార్కుల భరతం పడతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
16 నుంచి ఎయిర్ బెలూన్ షో..
సంక్రాంతి పండుగ తర్వాత కూడా సందడి కొనసాగనుంది. అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 13 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్నది. హాట్ ఎయిర్ బలూన్ ఫెస్టివల్16 నుంచి18 వరకు జరగనున్నది. పరేడ్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు ఉంటుంది.16 నుంచి 17 డ్రోన్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు ఉంటుంది. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ లో ఐరోపా దేశాల ప్రతినిధులతో అంతర్జాతీయ స్థాయి బెలూన్ల ప్రదర్శన ఉంటుంది. ఇందులో ఆకాశ విహారించాలనుకునే ఔత్సాహికులు బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించిన పలు చెరువుల వద్ద పతంగుల పండుగ నిర్వహించనున్నారు. బాగ్ అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, మాదాపూర్‌లోని తమ్మిడికుంట, రాజేంద్రనగర్‌లోని బమ్రుకున్ ఉద్ దౌలా చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ ఇమేజ్ను పెంచేలా ఏర్పాట్లు : మంత్రి జూపల్లి
హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా పకడ్భందీ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సందర్శకులకు ఎలాంటి లోటు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యారికేడింగ్, పరిశుభ్రత, ట్రాఫిక్, అగ్నిమాపక వ్యవస్థ, బందోబస్తు, మంచినీటి సరఫరా, వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. హైడ్రా పునరుద్ధరించిన చెరువుల వద్ద ఈసారి పతంగులను ఎగుర వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
Also Read: Harish Rao: నల్లమల సాగర్ కు సహకరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నీళ్ల శాఖ మంత్రిపై హరీష్ రావు ఫైర్!

