Ibrahimpatnam D Mart: తెలిసీ తెలియక చేసిన ఒక తప్పుకు ఓ బాలుడు చిత్రహింసలకు గురయ్యాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏకంగా 8 గంటల పాటు అతడు నిర్భంధించబడ్డాడు. ఇంతకీ ఆ బాలుడు చేసిన నేరం ఏమిటి అని ఆలోచిస్తున్నారా..? అతడు ఓ చాక్లెట్ చోరీ చేయడం. అవును ఢీ మార్ట్‌లో సరుకులు కొనడానికి వచ్చిన బాలుడు చాక్లెట్ చోరీ చేశాడని యాజమాన్యం ఆ బాలుడిని చిత్రహింసలకు గురి చేసింది. ఈ అమానవీయ ఘటన ఇబ్రహీంపట్నం మెగా డీమార్ట్‌లో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే..
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మెగా డీమార్ట్‌లో జరిగిన అమానవీయ ఘటన ప్రజలను కలవర పెడుతోంది. కేవలం ఒక చాక్లెట్ చోరీ చేశాడన్న ఆరోపణతో 13 ఏళ్ల బాలుడిని డీమార్ట్ యాజమాన్యం ఎనిమిది గంటల పాటు నిర్బంధించి, తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. ఈ ఘటన గురించి వివరాలు తెలిసిన వారి ద్వారా పోలీసులకు సమాచారం అందడంతో, బాలుడిని విడిపించి డీమార్ట్ యాజమాన్యం, సిబ్బందిపై కేసు నమోదు చేశారు.
Also Read: సరదాగా మొదలు పెట్టి.. ఆత్మహత్యతో ముగించాడు
ఈ ఘటనలో బాధితుడైన 13 ఏళ్ల బాలుడు వస్తువులు కొనుగోలు చేయడానికి మెగా డీమార్ట్‌కు వచ్చాడు. అయితే, అతడు ఒక చాక్లెట్ చోరీ చేశాడని గుర్తించిన డీమార్ట్ సిబ్బంది, బాలుడిని బిల్డింగ్ అండర్‌గ్రౌండ్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, అంటే ఏకంగా ఎనిమిది గంటల పాటు బాలుడిని నిర్బంధించారు. ఈ సమయంలో అతడిని శారీరకంగా హింసించినట్లు తెలుస్తోంది.
ఈ దారుణ ఘటన గురించి డీమార్ట్‌కు వచ్చిన కొందరు వినియోగదారుల ద్వారా సమాచారం బయటకు రావడంతో, విషయం పోలీసుల దృష్టికి చేరింది. వెంటనే రంగంలోకి దిగిన ఇబ్రహీంపట్నం పోలీసులు బాలుడిని నిర్బంధం నుంచి విడిపించారు. అనంతరం డీమార్ట్ యాజమాన్యం, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కేసు నమోదు చేశారు.
ఒక చిన్న చాక్లెట్ చోరీకి బాలుడిని ఇంత తీవ్రంగా శిక్షించడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాధిత బాలుడి ఆరోగ్య పరిస్థితి, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తీసుకునే తదుపరి చర్యల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.